కాంగ్రెస్ లో చెల్లుబాటు కాని శశిధర్ రెడ్డి బిజెపి భారం కారా!

Wednesday, December 25, 2024

తెలంగాణాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చెడిది తామే అని నిత్యం ప్రగల్భాలు పలుకుతున్న బిజెపి నాయకులకు ఎన్నికలలో పోటీ చేయడం  కోసం సమర్ధం గల నేతల కొరత ఏర్పడింది. పోటీ చేయగల సత్తా ఉన్న నాయకులు దొరికితే తమదే విజయం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అందుకనే బహుశా మరే రాజకీయ పార్టీల్లో లేన్నట్లుగా ఫిరాయింపులను ప్రోత్సహించడం కోసం ఏకంగా `చేరికల కమిటీ’ అంటూ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 

టిఆర్ఎస్ లో సుదీర్ఘకాలం కీలక నేతగా వ్యవహరించిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అవసరం తీరిపోయింది ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కన బెడితే, ఎంతో కష్టపడి ఆయనను బిజెపి నాయకులు అక్కున చేర్చుకొని, ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేయించి, ఉప ఎన్నిక వచ్చేటట్లు చేసి, అక్కడ ఆయన గెలుపొందడంతో అదంతా తమ బలమే అనుకోని మురిసి పోతున్నారు. 

దానితో రాజేందర్ నేతృత్వంలో `చేరికల కమిటీ’ ఏర్పాటు చేసి,  దానిని  ఇతర పార్టీల నుండి వచ్చిన `ఫిరాయింపుదారులు’తో నింపేశారు. అయితే, ఆశించిన విధంగా ఈ కమిటీ `కమల్ ఆకర్షణ’లో విజయం సాధింపలేక పోతున్నది. 

ఎన్నికల వరకు ఇదే హీట్ కొనసాగించాలనుకొని, కాంట్రాక్టులకు దగ్గరకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని బలవంతంగా ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేయించి,  ఎన్నిక వచ్చేటట్లు చేసి, అక్కడ గెలిస్తే ఇక టిఆర్ఎస్ ఎమ్యెల్యేలు అందరూ వరుసగా తమ పార్టీలో చేరబోతున్నట్లు బిజెపి నేతలు కలలు కన్నారు. అయితే, అనూహ్యంగా ఓటమి చెందడంతో ఖంగుతిన్నారు. 

అంతలో `ఎమ్యెల్యేల కొనుగోలు’ కేసు అంటూ బిజెపి అగ్రనేతలనే క్రిమినల్ కేసులలో ఇరికించడం కోసం కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించడంతో ఇప్పుడు కాంగ్రెస్ నేతల వైపు తిరుగుతున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లో భవిష్యత్ ఆందోళనకరంగా మారడం, రాష్ట్రంలో సహితం పార్టీలో పట్టించుకొనేవారు లేకపోవడంతో, రాజకీయంగా కనుమరుగు కావడం ఇష్టంలేని నేతలు మాత్రమే బీజేపీలో చేరుతున్నారు. 

అటువంటి కొద్దిమంది నేతలను అందలం ఎక్కిస్తూ, బిజెపి నేతలు సంతృప్తి పడుతున్నారు. అయితే వారెవ్వరూ పార్టీకి ఎటువంటి విజయాలు తీసుకురాలేరన్నది అందరికి తెలిసిందే. తాజాగా, కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం పదవులు అనుభవించి, తండ్రు రెండు సార్లు ముఖ్యమంత్రిగా, మరో రెండో సార్లు కీలక రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేయడంతో పాటు తనకు నాలుగు సార్లు ఎమ్యెల్యేగా చేసిన మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. 

75 ఏళ్ళ వయస్సు వచ్చిన వారికి రాజకీయ సన్యాసం అంటున్న బీజేపీ 73 ఏళ్ళ వయస్సులో ఉన్న శశిధర్ రెడ్డిని అక్కున చేర్చుకొని వచ్చే ఏడాది ఎన్నికలలో పోటీ చేయించడానికి సిద్దపడుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఉండగా పి జనార్ధనరెడ్డితో సాన్నిహిత్యం, తండ్రి చెన్నారెడ్డి మద్దతుదారుల అండతో ఒక వెలుగు వెలిగినా, తండ్రి కారణంగా సోనియా గాంధీతో సాన్నిహిత్యం ఏర్పాటు చేసుకొని, ఢిల్లీలో పలుకుబడి సంపాదించినా ఎన్నడూ పార్టీలో చెప్పుకోదగిన బలం గల నేతగా గుర్తింపు పొందలేదు. 

రాజకీయంగా పనికిరారని కాంగ్రెస్ దూరంగా ఉంచుతున్న నేతలతో బిజెపి తన బలం పెంచుకొనే ప్రయత్నం చేస్తుండటం విస్మయం కలిగిస్తోంది. ఆ పార్టీ ఎదుర్కొంటున్న `నాయకత్వ సంక్షోభం’ను వెల్లడి చేస్తుంది. పార్టీ అగ్రనేత అమిత్ షా సొంతంగా జరిపించుకున్న సర్వే  ప్రకారం తెలంగాణాలో 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు మించి ఎన్నికలలో గట్టి పోటీ ఇవ్వగల అభ్యర్థులు బిజెపికి లేరు. 

ఇప్పుడున్న నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్యెల్యేలలో ఒకరిద్దరికి మించి తిరిగి గెలుస్తారన్న భరోసా లేదు. కేసీఆర్ కాంగ్రెస్ నుండి ప్రోత్సహించిన ఫిరాయింపులను నిత్యం ప్రస్తావిస్తూ ఉండే బిజెపి నేతలు ఇప్పుడు `ఫిరాయింపులు’ లేకపోతే తెలంగాణాలో తమకు రాజకీయ అస్తిత్వం ప్రశ్నార్ధకం కాగలదని ఆందోళన ఆ పార్టీ నేతలలో వ్యక్తం అవుతున్నది. 

దశాబ్దాల తరబడి బిజెపి కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ, పనిచేస్తున్న నాయకులను పక్కన పెట్టి, బలమైన ఆర్ధిక వనరులు గల `ఫిరాయింపుదారుల’ కోసం బిజెపి నాయకత్వం ఇప్పుడు అన్వేషణ చేస్తున్నది. ఎన్నికలలో కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టె వారు కావాలని చూస్తున్నది. ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నికలో టిఆర్ఎస్, బిజెపి పోటీ పది డబ్బు వరద నీరు వలే ఖర్చు పెట్టారు. రెండు పార్టీలు కలసి రూ 200 నుండి రూ 300 కోట్ల మేరకు ఖర్చు చేసి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 

అందుకనే ఐటి, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించి ఇతర పార్టీలలోని `ఆర్ధిక నేరస్థులు’ను లక్ష్యంగా చేసుకొని, వారిని బీజేపీలో చేరమని వత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సోదాలు చేస్తున్న అధికారులే `మీరు బీజేపీలో చేరితే మీకు, మాకు ఈ సోదాల తతంగం తప్పుతుంది’ అంటూ రాయబారాలు జరుపుతున్నారు. 

ఇప్పటికే కాంగ్రెస్  నుండి చేరిన  డీకే అరుణ, సుధాకర్ రెడ్డి వంటి నేతలు బీజేపీలో ఉన్నారు. వారికి పదవులు  ఇచ్చి, ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు. అయితే వారంతా బిజెపికి `భారం’గా మారుతున్నారు తప్ప ప్రయోజనం ఉండడం లేదు. ఇప్పుడు మరో మాజీ కాంగ్రెస్ నేత శశిధర్ రెడ్డి సహితం బిజెపికి `భారం’గానే మిగిలే అవకాశం లేకపోలేదు. 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles