ఈ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పతనం అవుతున్నదంటే అందుకు దారి తీసిన ప్రధాన కారణాలలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఒకటి. ఈ దొంగచాటు చట్టం ద్వారా ప్రజల ఆస్తులను కాజేయడానికి జగన్మోహన్ రెడ్డి సర్కారు వక్రమార్గాలను సృష్టించింది అని, మీ భూమి మీద మీకు హక్కు లేకుండా చేసేస్తున్నదని ప్రతిపక్షాలు పెద్ద పెట్టున గోల చేశాయి. కేవలం ప్రతిపక్షాలు మాత్రమే కాదు.. చట్టాన్ని పరిశీలించిన న్యాయనిపుణులు కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకు వేసి.. తమ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఈ దుర్మార్గమైన ల్యాండ్ టైటిలింగ్ చట్టం నుంచి ప్రజలకు, రైతులకు విముక్తి కల్పిస్తానని వాగ్దానం చేశారు. తమ ప్రభుత్వం రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీ పై పెడతానని ఎలాగైతే ప్రకటించారో, రెండో సంతకం ఈ చట్టం రద్దు మీద పెడతానని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ చట్టం గురించిన భయం ప్రజల్లో బాగా పనిచే సింది. జగన్ సర్కారుని ఇంటికి పంపడానికి వారు నిర్ణయించుకుని పోలింగ్ కేంద్రాలకు వచ్చారు.
ఇదంతా పక్కన పెడితే-పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఒక అద్భుతం అని డప్పు కొట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి నీలి మీడియా ‘సాక్షి’ ప్రయత్నం చేస్తుంది. సాక్షి డిప్యూటీ ఎడిటర్ వెంకటేష్ నీతి ఆయోగ్ సంస్థలు సమాచార హక్కు ద్వారా అడిగిన వివరాలను బట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక అద్భుతం అని సమాధానం వచ్చినట్టుగా వారు తప్పుడు కథనాలను వండి వార్చడానికి ప్రయత్నిస్తున్నారు.
నిజానికి కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసినదే ఈ చట్టం. ప్రజలకు ఇబ్బంది లేకుండా రికార్డులు నిర్వహణ దీని ద్వారా సాధ్యమవుతుందని నీతి ఆయోగ్ ఈ చట్టాన్ని సమర్ధించింది. ఒక మోడల్ చట్టం రూపకల్పన చేసి అన్ని రాష్ట్రాలకు పంపింది కూడా. అయితే ఆంధ్రప్రదేశ్ లోని జగన్మోహన్ రెడ్డి ఆ చట్టాన్ని యధాతధంగా రాష్ట్రంలో అమలులోకి తీసుకురాలేదు. ఈ విషయాన్ని చాలా కీలకంగా గమనించాల్సిన అవసరం ఉంది. కేవలం నీటి ఆయోగ్ పంపిన చట్టం డ్రాఫ్ట్ ఆధారంగా.. వైఎస్ఆర్సిపి ముద్రగలిగిన అనేక కుట్రలను కూడా మేళవించి.. ఏపీలోని చట్టాన్ని తయారు చేశారు.
అయితే సాక్షి చేస్తున్న తప్పుడు ప్రచారం ఏమిటంటే నీతి ఆయోగ్ ఈ గొప్పగా సమర్ధిస్తున్నదని అనడం. ఈ చట్టం మంచిదని నీతి ఆయోగ్ చెపుతున్న మాట వాస్తవమే. కానీ సాక్షి ఉద్యోగి అడిగిన ప్రశ్నలలోనే ఏపీలో తీసుకు వచ్చిన చట్టం ఎలా ఉందనే ప్రశ్నకు.. నీతి ఆయోగ్ జవాబు ఇవ్వలేదు. ఆ చట్టం గురించిన సమాచారం తమ వద్ద లభించడం లేదని మాత్రమే పేర్కొంది. ఈ ఏపీలోని చట్టం ద్వారా భూకబ్జాలు సాధ్యమవుతాయా అని అడిగిన ప్రశ్నకు కూడా.. ఏపీలోని చట్టం గురించి తమ వద్ద సమాచారం లభించడం లేదని మాత్రమే నీతి ఆయోగ్ చెప్పింది.
కేంద్రం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తప్పు అని చంద్రబాబు నాయుడు గాని, ఇతర విపక్షాలు గాని అనడం లేదు. నీతి ఆయోగ్ రూపొందించిన ముసాయిదా డ్రాఫ్ట్ను వాడుకుని జగన్ సర్కారు రూపకల్పన చేసిన చట్టం మాత్రమే దుర్మార్గమైనదని అందరూ భయపడుతున్నారు. ఇప్పుడు అర్థ సత్యాలను ప్రచారంలో పెడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఏపీలోని చట్టాన్ని సమర్ధించినట్లుగా తప్పుడు కథనాలతో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ప్రజలను మోసం చేయడానికి సాక్షి ప్రయత్నిస్తుండడం చూస్తూ ఉంటే వారి దిగజారుడుతనం ప్రజలకు అర్థమవుతోంది.