రోజా శత్రువుల గుడ్ బై: పెద్దిరెడ్డి ఆశీస్సులున్నాయా?

Saturday, May 18, 2024

జగన్మోహన్ రెడ్డికి వారికి కీలకమైన నామినేటెడ్ పదవులు కూడా కట్టబెట్టారు. వారు అడిగినదెల్లా చేశారు. కానీ.. ఆయన ఇచ్చిన పదవులు, తాయిలాల కంటె వారికి మంత్రిరోజా పట్ల ఉన్న శత్రుత్వమే ముఖ్యం. ఆమె తమను పక్కన పెడుతోందని కలుపుకుపోవడం లేదని వారి ఆరోపణ. అందుకే వారంతా ఇప్పుడు ఏకంగా పార్టీనే వీడిపోయారు. ప్రస్తుతానికి వేరే పార్టీలో చేరలేదు గానీ.. రోజా వ్యతిరేక ప్రచారంలో ముమ్మరంగా పనిచేస్తున్నారు. అయితే నియోజకవర్గ ప్రజల్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం.. రోజాను ఓడించడానికి ప్రయత్నిస్తున్న ఈ నాయకులు అందరికీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు ఉన్నాయని కూడా అంటున్నారు.


సినీ నటి రోజా చిత్తూరుజిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గంలోని స్థానిక నాయకులతో ఆమెకు తొలినుంచి విభేదాలు ఉన్నాయి. వారితో సర్దుకుపోవడం గురించి ఆమె ఏనాడూ పట్టించుకోలేదు. తనను వ్యతిరేకిస్తున్న వర్గం వారినందరినీ పక్కన పెట్టేసి.. తన కంటూ సొంత వర్గాన్ని తయారుచేసుకోవడం మీదనే ఆమె దృష్టిపెడుతూ వచ్చారు. అయితే నగరిలో రోజాను వ్యతిరేకిస్తున్న వర్గానికి జిల్లాలోని కీలక నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి.

రోజా వ్యతిరేక వర్గంలో కీలక నాయకుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డికి, స్వయంగా పెద్దిరెడ్డి పూనుకుని శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్ పదవి ఇప్పించారు కూడా. ఆయన ప్రారంభం నుంచి నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు. టికెట్ల కేటాయింపునకు ముందు కూడా.. జగన్ ను ఈ తిరుగుబాటు నాయకులంతా కలిసి రోజాకు టికెట్ ఇస్తే ఓడిస్తాం అంటూ చెప్పి వచ్చారు. జగన్ వారిని పట్టించుకోలేదు. టికెట్ రోజాకే దక్కింది. నియోజకవర్గంలోని కొందరితో రోజాకు సయోధ్య కుదిర్చడానికి జగన్ స్వయంగా ప్రయత్నించారు కూడా. కానీ అవేమీ ఫలితమివ్వలేదు.

రెడ్డివారి చక్రపాణి రెడ్డితోపాటు, రెడ్డివారి భాస్కర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, లక్ష్మీపతి రాజు, ఆరుగురు సర్పంచులు, డీసీసీబీ మాజీ డైరెక్టర్లు తమ వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యత్వానికి తాజాగా రాజీనామా చేశారు. ఇక అక్కడ చాటు మాటు వ్యవహారం లేదు. బాహాటంగానే బరిలోకి దిగి రోజాను ఓడించడం కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ మొదలియార్ వర్గం నాయకుడు ఏలుమలై పార్టీకి రాజీనామా చేసి, తన వెంట ఉన్న క్షత్రియసామాజిక వర్గం సహా చెలరేగి రోజా వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజా కొందరు నాయకులకు భారీ నగదు కానుకలు ఇచ్చి తన వర్గంగా నిలుపుకున్నప్పటికీ.. ఇందరు నాయకులు పార్టీకి వీడిపోతుండగా.. వారికి పెద్దిరెడ్డి ఆశీస్సులు పుష్కలంగా ఉండగా.. ఆమె గెలుపు ఎలా సాధ్యమవుతుందని ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles