తాను మాజీ ముఖ్యమంత్రిని కదా అని.. తాను ఏం మాట్లాడినా సరే.. తన అభిమానులు వెర్రి కేకలతో ప్రోత్సహిస్తుంటారు గనుక.. రెచ్చిపోయి మాట్లాడవచ్చునని, ఎంతటివారినైనా తూలనాడవచ్చునని, సభ్యత లేకుండా బట్టలూడదీయిస్తానని రంకెలు వేయవచ్చునని జగన్ అనుకుంటే కలకాలం చెల్లుబాటు కాదు. ఇలాంటి దుడుకు మాటలు మాట్లాడినప్పుడు.. తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ.. పోలీసు కేసులు నమోదు కావడం మనం ఇప్పటికే పలు సందర్భాల్లో గమనిస్తున్నాం. వాక్ స్వాతంత్ర్యం అనే రాజ్యాంగపు ప్రాథమిక హక్కును అడ్డుపెట్టుకుని చెలరేగే వారిని కట్టడి చేయడానికి కోర్టులు కూడా విచ్చలవిడి మాటల పట్ల కఠినంగా ఉంటున్న విషయాన్ని గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద మనోభావాలు దెబ్బతిన్నాయనే కేసులు నమోదు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆయనకు కూడా చిక్కులు తప్పకపోవచ్చునని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
పాపిరెడ్డి పల్లిలో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లినప్పుడు.. జగన్ రెచ్చిపోయి మాట్లాడుతూ.. పోలీసుల్ని తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే బట్టలూడదీయించి కొడతానంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసు వర్గాలు మండిపడుతున్నాయి. జగన్ ఎవరిని ఉద్దేశించి అన్నారో ఆ ఎస్సై సుధాకర్ స్పందిస్తూ.. ఖాకీ దుస్తులు జగన్ ఇచ్చినవి కాదని వ్యాఖ్యానించారు. ఇవి తాము కష్టపడి సంపాదించుకున్నాం అని.. వాటిని ఎవ్వరూ తీసేయలేరని అన్నారు. నిజాయితీగా పనిచేస్తున్నాం అని హెచ్చరించారు.
పోలీసు అధికారుల సంఘం నాయకులు ప్రత్యేకంగా విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ వ్యాఖ్యలను ఖండించారు. ఆయన క్షమాపణ చెప్పి తీరాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసు
శాఖలో 5వేల మంది మహిళలు పనిచేస్తున్నారని, ఆయన వ్యాఖ్యలు తమ మనోభావాలు గాయపరుస్తున్నాయని అనడం గమనించాల్సిన సంగతి. ఇలాంటి నేపథ్యంలో తమ మనోభావాలు గాయపడ్డాయంటూ.. రాష్ట్రంలో ఏదో ఒక చోట మహిళా పోలీలసులు కొందరు జగన్ మీద పోలీసు కేసు రిజిస్టరు చేసే అవకాశం ఉన్నదని పలువురు భావిస్తున్నారు.
ఎందుకంటే.. ఇప్పటికే ఆయన వ్యాఖ్యల మీద గాజువాక, పీఎం పాలెం పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. గాజువాకలో తెలుగుశక్తి అధ్యక్షుడు బీవీరామ్, పీఎం పాలెంలో తెదేపా రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ఆనందబాబు కేసులు పెట్టారు. వీరు బయటి వ్యక్తులు గనుక.. వీరి కేసులు బలంగా ఉండకపోయినా.. పోలీసుల బట్టలు ఊడదీయించి కొడతానంటూ.. చేసిన వ్యాఖ్యలపై మహిళా పోలీసులే గనుక కేసులు పెడితే తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. జగన్ కు చిక్కులు తప్పవని అంతా అనుకుంటున్నారు.
చిక్కులే : జగన్‌పై ‘మనోభావాల’ కేసు పడుతుందా?
Friday, April 18, 2025
