దర్శకుడు రాంగోపాల్ వర్మకు సినిమా కష్టాలు వచ్చాయి. బిడ్డ చచ్చినా పురిటి వాసన పోలేదన్నట్టుగా ఆయన పరిస్థితి తయారైంది. ఆయన చేసిన వ్యూహం సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా చీదేసింది. ఎంత ఘోరంగా అంటే.. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ ను ఇప్పటిదాకా సినిమా చేయాలంటూ సంప్రదించిన వారు కూడా లేరు. భారీగా డబ్బులు, ఇంటరెస్టింగ్ గా చేయదగిన సబ్జెక్టు రెండూ చేతిలో ఉండి కూడా వ్యూహం సినిమాను ఆయన చేసిన తీరు.. వర్మ మీద ఎవ్వరికీ నమ్మకం లేకుండా చేసేసింది. వ్యూహం పరాజయం సంగతి సరే.. కానీ.. వ్యూహం ప్రమోషన్ కోసం వేసిన వేషాలు ఇప్పుడు ఆయనను పోలీసు కేసుల రూపంలో చుట్టుకున్నాయి. అరెస్టు కూడా అయ్యే అవకాశం ఉన్నదని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.
వ్యూహం సినిమా రాంగోపాల్ వర్మకు ఇటీవలి సంవత్సరాలలో బాగా అలవాటు అయిన అట్టర్ ఫ్లాప్ లలో ఒకటి! రాజశేఖర రెడ్డి మరణం తర్వాత.. జగన్ సీఎం అయ్యేవరకు ఆయన జీవితంలోని కథ ఇది… అని ముందే ప్రకటించారు. నిజానికి ఆ కథతో అద్భుతమైన సినిమా తీయడానికి అవకాశం ఉంటుంది. అప్పట్లో ఆ సినిమా కోసం చాలా భారీ బడ్జెట్ ను ఆయనకు జగన్ తరఫు నుంచి సమకూర్చారనే ప్రచారం కూడా జరిగింది. అప్పటిక రాంగోపాల్ వర్మ డబ్బులు బాగా వర్కవుట్ అయితే చాలు.. ఎవరు ఎలాంటి సినిమా కోరుకుంటే అలాంటి సినిమా, ఎవరు తమ జీవితం గురించి సినిమా తీయమంటే అలాంటి సినిమా తీసేయడానికి సిద్ధమైపోయి ఉన్నారు. అలాంటప్పుడు ప్రకటించిన టైం పీరియడ్ లో జగన్ జీవితంలో ఉన్న అనేక వేరియేషన్స్ కారణంగా గొప్ప సినిమా వస్తుందని.. కనీసం జగన్ అభిమానులైనా ఆశించారు. కానీ అదేం జరగలేదు. రాంగోపాల్ వర్మ ఒక ‘ఐస్ క్రీం’ తీసినంత శ్రద్ధగానే ‘వ్యూహం’ కూడా తీశారు. శ్రద్ధను బట్టే ఫలితం అన్నట్టుగా ఈ సినిమా కూడ పోయింది. కనీసం వైసీపీ కార్యకర్తలు కూడా ఆ పినిమాను చూడలేదు.
వ్యూహం ప్రమోషన్స్ కోసం చేసిన ట్వీట్లు మాత్రం పదిలంగా రాంగోపాల్ వర్మ ఖాతాలో ఉండిపోయాయి. వర్మ కూడా వ్యూహం సినిమాను పొగుడుకుని ఉంటే సరిపోయేది. కానీ.. నెగటివ్ ప్రచారం ద్వారా, వివాదాన్ని సృష్టించడం ద్వారా మార్కెటింగ్ కోరుకుంటూ ఉండే వర్మ చంద్రబాబును, లోకేష్ నానా రీతుల్లో అసభ్యంగా మార్ఫింగ్ చేయించి.. ట్వీట్లు పెడుతూ భ్రష్టుపట్టారు. ఆ పాపాలు ఇప్పుడు వెన్నాడుతున్నాయి. సోషల్ మీడియా కేసుల్లో పోలీసుల నోటీసులు అందుకున్ర్న వర్మ ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. తనకు ఇంకో నాలుగు రోజుల సమయం కావాలని వాట్సప్ ద్వారా కోరి, డుమ్మా కొట్టారు. తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించి భంగపడిన రాంగోపాల్ వర్మ.. ప్రస్తుతం పోలీసు విచారణకు హాజరయ్యేలోగా న్యాయనిపుణుల్ని సంప్రదిస్తున్నట్టు సమాచారం.
ఆర్జీవీ : బిడ్డ చచ్చినా పురిటివాసన పోలేదు!
Wednesday, January 22, 2025