జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం తప్పులు చేసిందని చెప్పడానికి చాలా తపన పడ్డారు. కానీ ఆయనకు ప్రజల ఎదుట నిరూపించడానికి పెద్దగా తప్పులేం కనిపించలేదు. జగన్ పాలనలో అత్యంత అరాచకత్వం రాజ్యమేలింది కాబట్టి.. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకిరాగానే.. జగన్ పాపాలను చాలా వరకు బయటపెట్టారు. అలా 2019లో అప్పట్లో జగన్ కు అవకాశం చిక్కలేదు. అందుకే రివర్స్ టెండరింగ్ అంటూ ఒక ప్రహసనం ప్రారంభించారు. చంద్రబాబునాయుడు హయాంలో పనులు కాంట్రాక్టులు పొందిన వారిని పక్కకు తప్పించడానికి, తన సొంత మనుషులకు కాంట్రాక్టులు కట్టబెట్టుకోవడానికి జరిగిన అతిపెద్ద కుట్ర ఇది. అదేమాదిరి రివర్స్ టెండరింగ్ అనే కుట్రలను తిరుమల దేవస్థానం విషయంలోనూ, నెయ్యి సరఫరా వంటి కాంట్రాక్టుల్లోనూ కూడా అనుసరించడం వల్ల మాత్రమే ఇప్పుడు ఈ పాపం జరిగినట్టుగా తెలుస్తోంది.
రివర్స్ టెండరింగ్ అనే పదం ద్వారా.. జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు సహా ఇతర కాంట్రాక్టర్లందరినీ పక్కకు తప్పించారు. మళ్లీ టెండర్లు పిలిచి తన మనుషులకు అప్పగించుకున్నారు. ఏడువందల కోట్లు మిగలబెట్టాను అని అన్నారు. కానీ.. ఆ పనుల నిర్వహణ అత్యంత అధ్వానంగా సాగడం వల్ల ఇప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయల భారం అదనంగా పడింది. అలాగే తిరుమలలో కూడా చేశారు. నెయ్యి సరఫరా కాంట్రాక్టర్లను కూడా పక్కకు తప్పించి.. కొత్త టెండర్లు పిలిచారు. రివర్స్ టెండరింగ్ అన్నారు. కిలో నెయ్యి రూ.320కు ఇస్తాం అన్నవారికి కాంట్రాక్టు కట్టబెట్టారు.
అదే టీటీడీలో స్వామివారి నైవేద్యాలకు సుమారు 1700 రూపాయలకు కిలో నెయ్యి కొంటుండగా.. లడ్డూ తయారీకి మాత్రం 320కు ఎలా వస్తుందని వారు ఆలోచించలేదు. రివర్స్ టెండరింగ్ చేసి డబ్బు మిగలబెట్టాం అని టముకువేసుకున్నారు. అయినవారికి కాంట్రాక్టులు ఇచ్చారు. నాణ్యత తనిఖీల్లో లోపాయికారీగా నిర్లక్ష్యం వహించారు. ఆ పాపాల ఫలితమే ఇప్పుడు ఇంత పెద్ద దుమారం రేగుతున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.