రెడ్ బుక్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. రెండేళ్లుగా రెడ్ బుక్ అనే పదమే హెచ్చరికకు ఒక పర్యాయపదంలాగా తెలుగునాట నానుతోంది. ఇప్పుడు రెడ్ బుక్ మూడో చాప్టర్ అనేది వార్తల్లోని పదంగా మారింది. ఈసారి జగన్మోహన్ రెడ్డి మాటల్లోని భయం రూపంలో కాదు.. నారా లోకేష్ మాటల్లోని హెచ్చరిక రూపంలో రెడ్‌బుక్ అనే పదం చర్చల్లోకి వస్తోంది. మూడో చాప్టర్ అనే పదం వాడడం ద్వారా.. ఇప్పటికే రెండు చాప్టర్లు పూర్తయ్యాయి.. అనే సంకేతాలు ఇచ్చారు లోకేష్. ఇప్పుడు మూడో చాప్టర్ అంటే అందులో ఎవరెవరు ఉంటారు? రెండు చాప్టర్లలో ఎవరి పేర్ల ఉండేవి? ఆ శిక్షలను ఈ నాలుగైదు నెలల్లో ఎవరు అనుభవించారు? ఇప్పుడు మూడో చాప్టర్ కోటాలో టార్గెట్ కాబోతున్నది ఎవరు? అనే రకరకాల అంశాలు చర్చకు రావడం సహజం. ఆ నేపథ్యంలో రెడ్‌బుక్ మూడో చాప్టర్ అనే పదం వినగానే.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల్లో వణుకు మొదలవుతోంది.
రెడ్‌బుక్ రెండు చాప్టర్లు ఆల్రెడీ ఓపెన్ అయ్యాయని నారా లోకేష్ ప్రకటించారు. ఆయన అమెరికా పర్యటనలో అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడ మాట్లాడుతూ.. ఈ ముచ్చటను అభిమానులతో పంచుకున్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఖచ్చితంగా సినిమ చూపిస్తాం అని హెచ్చరిస్తూనే.. త్వరలోనే మూడో చాప్టర్ కూడా తెరుస్తాం అని హెచ్చరించారు.
రెడ్‌బుక్ అనే పదాన్ని కనిపెట్టినప్పటినుంచి నారా లోకేష్ ఒకే మాట చెబుతున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో అనేక మంది అధికారులు తాము ప్రభుత్వ ఉద్యోగులం అనే విషయం మర్చిపోయి.. జగన్ సేవకులం అన్నట్టుగా ప్రవర్తిస్తూ వచ్చారు. తెలుగుదేశం వారిని, ఇతర ప్రతిపక్షాలను కూడా ప్రతి సందర్భంలోనూ ఇబ్బంది పెడుతూ వచ్చారు. ప్రధానంగా పోలీసులు, ఇతర శాఖల్లోని ఉన్నతాధికారులు ఇలా కట్టుతప్పి వ్యవహరించడం జరగుతూ వచ్చింది.
తన పాదయాత్ర సమయంలో నారా లోకేష్.. ఇలాంటి జగన్ భక్త అతి చేసే అధికారులతో అనేక ఇబ్బందులు పడ్డారు. అప్పట్లోనే రెడ్‌బుక్ అనే పదం పుట్టింది. ఈ అరాచక అధికారుల పేర్లు అందులో రాస్తానని, తమ ప్రభుత్వం వచ్చాక వారి సంగతి చూస్తామని హెచ్చరించారు.
ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత.. అవినీతి అధికారుల మీద మాత్రం చర్యలు తీసుకుంటూ వచ్చారు. అనేక మంది ఉన్నతాధికారులు శంకరగిరి మాన్యాలు పట్టిపోయారు. కొందరు పోలీసు కేసులు ఎదుర్కొంటున్నారు. కొందరు పోలీసు ఉన్నతాధికారులు కూడా విచారణలు ఎదుర్కొంటున్నారు. సస్పెండ్ అయిన వారు అనేకులు ఉన్నారు. అయితే ఇప్పటికే రెండు చాప్టర్లు ఓపెన్ అయ్యాయని లోకేష్ చెప్పడాన్ని బట్టి, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర విభాగాల ఉన్నతాధికారులు ఆ రెండు చాప్టర్లు అని అనుకోవచ్చు. వారిద్దరూ పోగా ఇక మిగిలింది ఎవరు?
అంటే, మూడో చాప్టర్ లో జగన్ అండ చూసుకుని పెట్రేగిపోయిన వైసీపీ నాయకుల జాబితా ఉన్నదనే చర్చ రాష్ట్రంలో నడుస్తోంది. అధికార పార్టీ అనే మదంతో పెద్దస్థాయి నుంచి సాధారణ కార్యకర్తల వరకు అడ్డగోలుగా రెచ్చిపోయిన వారు అనేకులు ఉన్నారు. వారు చట్టాన్ని ఖాతరు చేయరు.. ఏ వ్యవస్థనూ పట్టించుకోరు. అలాంటి వైసీపీ నాయకుల వంతు ఇప్పుడు వచ్చినట్టేనని.. మూడో చాప్టర్ రెడ్‌బుక్ లో వారి భరతం పడతారని ప్రజలు అనుకుంటున్నారు. వైసీపీలో కూడా అదే భయం ఉంది. అధికార్ల చాప్టర్లు అయిపోయాయి.. ఇక మిగిలింది రాజకీయ చాప్టర్లే అని వారు జడుసుకుంటున్నారు.