పద్మవ్యూహంలో రేవంత్ రెడ్డి…. బ్రహ్మాస్త్రంగా 9 నుండి పాదయాత్ర!

Wednesday, December 18, 2024

రెండు తరాలుగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం గల కుటుంబం నుండి రావడమే కాకుండా, సోనియా గాంధీ కుటుంబంతో సాన్నిహిత సంబంధాలు గల సీనియర్ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆ పార్టీని విడిచి, బీజేపీలో చేరడంతో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ లో చెలరేగుతున్న అసమ్మతి తీవ్ర స్థాయికి చేరుకుంది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సహా కాంగ్రెస్ నుండి బైటకు వెడుతున్న వారంతా `టిడిపి ఏజెంట్’, `తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తి’ రేవంత్ రెడ్డికి పిసిసి సారధ్యం అప్పచెప్పడాన్నే కారణంగా చూపుతున్నారు. అంతేకాదు రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు దాదాపు అందరూ, పార్టీ నాయకత్వం పట్ల అసమ్మతి ఉన్నవారంతా వీలు చిక్కిన్నప్పుడల్లా రేవంత్ పై ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

దానితో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఇటీవలనే చేపట్టి, ఒకొక్క రాష్ట్రంలో పార్టీ కమిటీలలో చేర్పులు, మార్పులు చేయడం కోసం కసరత్తు చేస్తున్న మల్లిఖార్జున్ ఖర్గే పై రేవంత్ నాయకత్వం మార్చాలనే డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని సీనియర్ పార్టీ నేతలంతా వ్యతిరేకిస్తూ ఉండడంతో స్వయంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎంపిక చేసినా రేవంత్ కు పిసిసి సారధ్యం అప్పచెప్పడానికి సుమారు రెండేళ్లు పట్టింది.

రేవంత్ సారధ్యంలో తెలంగాణాలో పార్టీ శ్రేణులలో ఒక విధమైన ఉత్సాహం కనిపిస్తున్నా ఉపఎన్నికలలో ఎక్కడా పార్టీ చెప్పుకోదగిన బలం ప్రదర్షింపలేక పోవడం, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలలో సహితం ఎటువంటి ప్రభావం చూపలేక పోవడంతో రేవంత్ ప్రయోగం విఫలమైనదనే వాదనలు ఊపందుకుంటున్నాయి.

పైగా, కోమటిరెడ్డి సోదరులు, శశిధర్ రెడ్డి సహితం ఏఐసీసీ తెలంగాణ ఇన్ ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ను రేవంత్ `కొనుగోలు’ చేశారనే తీవ్రమైన ఆరోపణలు సహితం చేస్తున్నారు. మరోవంక, తెలంగాణాలో ఇదే సమయంలో బిజెపి బలం పెంచుకొంటూ ఉండడం, టిఆర్ఎస్ కు తామే అసలైన ప్రత్యామ్యాయం అనే సంకేతం ఇవ్వడంతో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదనే నిరాశ, నిస్పృహలు సహితం వెల్లడి అవుతున్నాయి.

ఒక విధంగా `పద్మవ్యూహం’లో చిక్కుకున్న రేవంత్ రెడ్డికి ఇప్పుడు తన నాయకత్వాన్ని పార్టీలో నిలుపుకోవడం ఓ సవాల్ గా మారింది. పైగా, తెలంగాణ పిసిసి కమిటీలలో పెను మార్పులకు ఖర్గే బృందం కసరత్తు చేస్తున్న సమయంలోనే ఇటువంటి పరిణామాలు జరుగుతూ ఉండడం ఒకింత ఆత్మరక్షణలో పడేటట్లు చేస్తున్నది.

పిసిసి కమిటీలలో మార్పుల గురించి ఐదారు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన రేవంత్ మౌనంగా ఉంటూ వచ్చారు. శశిధర్ రెడ్డి తనపై చేసిన తీవ్రమైన విమర్శల గురించి కూడా స్పందించలేదు. అయితే ఆదివారం మాత్రం ఎదురు దారి చేశారు. కాంగ్రెస్ ట్రస్ట్ కు సంబంధించి కోట్ల రూపాయలు శశిధర్ రెడ్డి స్వాహా చేశారని రేవంత్  సంచలన ఆరోపణలు చేశారు. ఆ లెక్కలు అడిగినందుకే ఆయన బీజేపీలో చేరారని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ లో ఒక్కరొక్కరు పార్టీని విడవడాన్ని గురించి ప్రస్తావిస్తూ పార్టీలో అందరూ తన న్యాయకత్వాన్ని అంగీకరిస్తున్నారని స్పష్టం చేశారు. కానీ టీపీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న ఆ నలుగురు వ్యక్తులు మాత్రం తన న్యాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే, ఆ నలుగురి పేర్లు మాత్రం చెప్పలేదు. అందరి అభిప్రాయాలూ తీసుకునే నిర్ణయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కానీ ఫలితం తేడా వస్తే మాత్రం అధ్యక్షుడిని తప్పుబట్టడం సరికాదని హితవు చెప్పారు.

పార్టీలో తన నాయకత్వాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సంసిద్ధం చేయడం కోసం రేవంత్ రెడ్డి పాదయాత్ర కు సిద్ధం కాబోతున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం తీసుకరావాలని , రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశ్యం తో రేవంత్ పాదయాత్ర చేయబోతున్నట్లు తెలుస్తుంది.

డిసెంబర్ 9 న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా రేవంత్ పాదయాత్ర ను ప్రారభించాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే,  రేవంత్ పాదయాత్రకు ఢిల్లీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? లేదా? అనే విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఇటీవల జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యనేతలు చర్చించారు. ఈ సమావేశంలో రేవంత్ పాదయాత్ర ను వారి ముందు పెట్టినట్లు తెలుస్తుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles