ప్రత్యేకించి ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక రకంగా ఉండగా, కడపజిల్లా ప్రత్యేకించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఇప్పుడు కడపజిల్లాలో కూడా పులివెందుల రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలాకా అయిన పులివెందుల నియోజకవర్గంలో వదినామరదళ్ల విమర్శలు- ప్రతివిమర్శల సవాళ్లు హోరెత్తనున్నాయి. రాష్ట్రంలోనే అందరి దృష్టిని ఆకర్షించనున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా.. పులివెందులలో ఈసారి వైఎస్ జగన్ తరఫున ఎన్నికల ప్రచార బాద్యతలను పూర్తిగా ఆయన భార్య వైఎస్ భారతి దగ్గరుండి చూసుకోబోతున్నారు.
రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి నామినేషన్ల పర్వం మొదలవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈనెల 22న ఉదయం 10.30 గంటలకు పులివెందులలో నామినేషన్ వేసేలా ముహూర్తం సెట్ చేసుకున్నారు.
ఆరోజున ఆయన స్వయంగా వెళ్లి నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత.. ఎన్నికల పోలింగ్ తేదీ వరకు కూడా ఆయన భార్య భారతి ప్రచార బాధ్యతలను చూసుకోనున్నారు. ఆమె స్వయంగా నియోజకవర్గం అంతా తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని కూడా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే జరిగితే.. వదినా మరదళ్ల విమర్శలు- ప్రతివిమర్శల హోరు రాష్ట్రానికంతా తాకుతుందనేది పలువురి అభిప్రాయం. వైఎస్ షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు. ఇప్పటికే జగన్ మీద, అవినాష్ రెడ్డి మీద విచ్చలవిడి విమర్శలతో చెలరేగిపోతున్నారు. షర్మిల శుక్రవారం పులివెందుల నియోజకవర్గం మొత్తం బస్సు యాత్ర నిర్వహించి, సాయంత్రం పులివెందులలోనే బహిరంగసభ పెట్టబోతున్నారు. సొంత ఊరినుంచి జగన్ మీద విమర్శల దండయాత్రను సాగిస్తారనడంలో సందేహం లేదు.
భారతి పులివెందుల ప్రచారాన్ని మొత్తం చూడబోతున్న నేపథ్యంలో ఆమె అడుగుపెట్టిన తర్వాత.. షర్మిల విమర్శలకు కౌంటర్ విమర్శలు రావొచ్చు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం శనివారంతో కడప జిల్లాలో షర్మిల బస్సుయాత్ర పూర్తయిపోతుంది. అయితే.. తాజాగా భారతి పులివెందుల బాధ్యతలు చూడబోతున్న నేపథ్యంలో.. షర్మిల మళ్లీ ఒకసారి పులివెందుల నియోజకవర్గానికి వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి రాజన్న కూతురు, కోడలు ఆయన సొంత నియోజకవర్గంలో పరస్పరం కత్తులు దూసుకునే వాతావరణం ఈసారి ఏర్పడబోతున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
రాజన్న ఇలాకాలో వదినా మరదళ్ల సవాల్!
Wednesday, January 22, 2025