నరసాపురం ఎంపీ రఘురామక్రిష్ణ రాజు ప్రస్తుత ఎన్నికల్లో మాస్టర్ ప్లాన్ తో ముందుకు దూసుకుపోతున్నారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురూ కలిసి జతకట్టి ఎన్నికల్లో కూటమిగా పోటీచేస్తుండడానికి తాను కూడా ప్రధాన కారకుడిని అని, కీలకంగా వ్యవహరించానని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. బహుశా ఆ నమ్మకంతోనే… తాను నరసాపురం ఎంపీ సీటునుంచే మళ్లీ బరిలో ఉంటానని, పొత్తులు కుదరడానికి చాలాకాలం ముందునుంచి రఘురామ చెబుతూనే ఉన్నారు. ఏ పార్టీ తరఫున పోటీచేస్తానో ఇప్పుడే చెప్పలేనని కూడా అన్నారు. కానీ.. ఆయనకు భంగపాటు తప్పలేదు. పొత్తుల్లో ఈ సీటు భాజపాకు వెళ్లగా, అక్కడ శ్రీనివాసవర్మ అనే అభ్యర్థిని ప్రకటించారు.
అప్పటినుంచి రఘురామ ఎన్నికల్లో పోటీచేయడానికి ఏదో ఒక స్థానం వెతకులాడుతూ చేయని ప్రయత్నం లేదు. చంద్రబాబునాయుడు మీద తనకు పూర్తి నమ్మకం ఉన్నదని, ఆయన తనకు న్యాయం చేస్తారని చెప్పుకుంటూ వచ్చారు. తెలుగుదేశం పార్టీలో చేరారు కూడా. ఆయనకు తెలుగుదేశం సిటింగ్ స్థానమైన ఉండి నియోజకవర్గాన్ని కేటాయిస్తారని బాగా ప్రచారం జరిగింది. అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు వర్గీయులు పెద్దస్థాయిలో గొడవ చేశారు. ఇలాటి నేపథ్యంలో రఘురామ మాత్రం తనకు నరసాపురం ఎంపీ స్థానమేకావాలని పట్టుపట్టినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన కోరికను నెరవేర్చడానికి చంద్రబాబునాయుడు స్వయంగా రంగంలోకి దిగి సుదీర్ఘమైన మంత్రాంగం నడపడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
చంద్రబాబునాయుడు ఉండవిల్లి నివాసంలో పురందేశ్వరి, బిజెపి పెద్దలు, పవన్ కల్యాణ్ లతో ఒక కీలక సమావేశం జరిగింది. సీట్ల సర్దుబాటులో మార్పుచేర్పుల గురించి చర్చించుకున్నారు. ఈ చర్చల్లో చంద్రబాబునాయుడు.. నరసాపురం ఎంపీ స్థానాన్ని తమ పార్టీకి కేటాయించాలని అక్కడినుంచి రఘురామక్రిష్ణరాజును పోటీచేయిస్తామని, దానికి బదులుగా ఉండి ఎమ్మెల్యేస్థానాన్ని బిజెపికి ఇస్తాం అని ప్రతిపాదించినట్టుగా వార్తలు వస్తున్నాయి. కావలిస్తే ప్రస్తుతం నరసాపురం ఎంపీగా బిజెపి ప్రకటించిన శ్రీనివాసవర్మకే ఉండి ఎమ్మెల్యే టికెట్ ఆ పార్టీ ఇచ్చుకోవచ్చుననికూడా చంద్రబాబు సలహా ఇచ్చినట్టు సమాచారం. రఘురామ క్రిష్ణ రాజును ఒక ఎమ్మెల్యే నియోజకవర్గానికి పరిమితం చేయడం కంటె..
ఆయనను ఎంపీ స్థానంలో పెడితే.. మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పార్టీ విజయావకాశాలను ఆయన ప్రభావితం చేయగలరని చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బాబు ప్రతిపాదనకు బిజెపి హైకమాండ్ ఏమంటుందో చూడాలి.
ఎంపీ కోసమే రఘురామ పట్టు : ఓకే అన్న బాబు!
Tuesday, January 21, 2025