రచ్చబండ పేరుతో అయిదు సంవత్సరాల పాటూ.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా.. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పరిపాలన గురించి ప్రతివారం నిశితవిమర్శలతో ఎండగడుతూ చెలరేగిపోయిన ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామక్రిష్ణ రాజు ఫిర్యాదు చేయడంతో.. మాజీ సీఎం జగన్ మీద హత్యాయత్నం కేసు నమోదు అయింది. అత్యంత దారుణంగా ప్రజలు ఆయనను తిరస్కరించిన తరువాత.. చంద్రబాబు సీఎం అయిన తర్వాత.. జగన్ మీద నమోదైన మొదటి కేసు ఇదే. అది కూడా క్రిమినల్ కేసు. అంత సులువుగా బుకాయింపులతో తప్పించుకోగలిగేది కాదు.
కేవలం జగన్ మీద మాత్రమే కాదు.. జగన్ కళ్లలో ఆనందం చూడడమే తమ జీవిత పరమావధి అన్నట్లుగా చెలరేగిపోయిన అప్పటి జగన్ భక్త అధికారుల మీద కూడా ఇదే కేసు నమోదు అయింది. అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఏ1, ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు ఏ2 కాగా, వారిని హత్య చేయడానికి ప్రేరేపించిన జగన్ ఏ3 గా ఉన్నారు. అలాగా సీఐడీ ఏఎస్పీ అరన్ విజయ్ పాల్, తీవ్రమైన రక్తగాయాలు అయినప్పటికీ.. రఘురామ రిమాండుకు ఫిట్ గా ఉన్నారని సర్టిఫై చేసిన అప్పటి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ఏ5 నిందితురాలు. జగన్ భక్తిని చూపినందుకు, ఆయన ఆదేశాలను శిరసావహించి తప్పుడు పనులు చేసినందుకు వారంతా ఇప్పుడు హత్యాయత్నం కేసులో నిందితులయ్యారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత.. తాము ప్రతీకార, కక్షపూరిత చర్యలు చేపట్టబోయేది లేదని చాలా స్పష్టంగా ప్రకటించారు. ఆయన తన మాట మీదనే నిలబడి ఉన్నారు. కక్షపూరితంగా కేసులు పెట్టడం లేదు. చంద్రబాబు జాలి చూపించినంత మాత్రాన.. జగన్ హయాంలో వేధింపులు పడిన వారందరూ ఇంకా నోరుమూసుకునే ఉంటారని అనుకోవడానికి వీల్లేదు. అందుకే ఇప్పుడు రఘురామ ముందుకొచ్చి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు కాలేదు. పోలీసులు సంయమనంతో న్యాయనిపుణుల సలహాలు తీసుకుని మరీ కేసు పెట్టారు.
రఘురామను అప్పట్లో రాజద్రోహం నేరం కింద అరెస్టు చేసి, తీవ్రంగా హింసించిన సంగతి అందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత ఆయనకు బెయిలు వచ్చింది. అప్పటి దుడుకు చర్యల ఫలితంగానే ఇప్పుడు జగన్ మీద కేసులు నమోదైనట్టు ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
రఘురామ బోణీ!: జగన్ పై హత్యాయత్నం కేసు!
Thursday, December 26, 2024