చంద్రబాబునాయుడు తాను ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాగానే.. మొదటి సంతకం మెగా డీఎస్సీ మీదనే పెడతానని రాష్ట్రంలోని నిరుద్యోగా ఉపాధ్యాయులకు ఎన్నికల ప్రచార సమయంలో ఒక చల్లటి కబురు చెప్పారు. రెండో సంతకం.. లాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద పెడతానని కూడా ప్రకటించి, భూ యజమానులైన చిన్న సన్నకారు రైతుల్లో ఆశలు నింపారు. అయితే మూడో సంతకం దేనిమీద పెడతారు? రాష్ట్రంలో పేద ప్రజల కడుపు నింపే అన్న క్యాంటీన్ల వ్యవస్థను పునరుద్ధరించే ఫైలు మీదనే మూడో సంతకం పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.
గతంలో చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా రాష్ట్రంలోని నిరుపేదల కోసం చేసిన అనేకానేక అద్భుతమై పనులలో అన్న క్యాంటీన్ కూడా ఒకటి. పేదవాళ్లకు అయిదు రూపాయలకే భోజనం పెట్టే అద్భుతమైన పథకాన్ని ఆయన ప్రారంభించారు. అసలు పేదవాడి ఆకలి గురించి ఆలోచించి.. రెండు రూపాయలకే కిలోబియ్యం అనే పథకాన్ని దేశంలోనే ఒక ఆదర్శంగా ప్రారంభించిన నందమూరి తారక రామారావు పేరిట అన్న క్యాంటీన్లుగా వాటికి సార్థక నామకరణం చేశారు. అవి నిజంగా ఎంతో అద్భుతంగా పేదల కడుపునింపుతూ సేవలందించాయి.
అయితే తాను ముఖ్యమంత్రి అయినప్పటినుంచి విధ్వంసక పాలనను ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్లను కూడా ఆపుచేయించారు. పేదవాడి కడుపు కొట్టవద్దని, కావాలంటే తన తండ్రి వైఎస్సార్ పేరు పెట్టుకుని కొనసాగించాలని ఎందరు సూచించినా జగన్ చెవికెక్కలేదు. ఆ వ్యవస్థను నిలిపివేయడం మాత్రమే కాదు. అన్న క్యాంటీన్ల కోసం నిర్మించిన భవనాలను కూడా కొన్ని చోట్ల కూల్చివేయించారు. వాటిని సచివాలయాలుగా మార్చేశారు. అన్న క్యాంటీన్ల విషయంలో అరాచకంగా వ్యవహరించారు. ఈ నిర్ణయాలతో పేదవాడి ఆకలి కడుపు ఆక్రోశించింది.
ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. అన్న క్యాంటీన్లను పునరుద్ధరించడం గ్యారంటీ. ప్రభుత్వం విధానపరంగా ఈ నిర్ణయం తీసుకోవడానికంటె ముందే.. నందమూరి బాలకృష్ణ హిందూపురంలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. ప్రభుత్వం కూడా పేదవాడి ఆకలి తీర్చడం పట్ల తమకు ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి అన్న క్యాంటీన్లను వెంటనే పునరుద్ధరించాలని.. మూడో సంతకమే ఆ ఫైలుపై పెట్టడం ద్వారా చంద్రబాబు పేదల అభిమానం పొందాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.
మూడో సంతకం ఈ ఫైలుపై పెట్టండి బాబుగారూ!
Wednesday, January 22, 2025