చంద్రబాబునాయుడు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి పదవీ స్వీకార ప్రమాణం చేసిన తరువాత.. అదే రోజు సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. గురువారం ఉదయం తిరుమలేశుని సేవలో కుటుంబసమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇన్నాళ్ల పరిపాలన చేసిన మరకలను ప్రక్షాళన చేసే కార్యక్రమాన్ని తిరుమలేశుని పాదాల సన్నిధిలోంచే ప్రారంభిస్తానని ప్రకటించారు. ఇప్పుడు చెప్పినట్టుగానే.. మొట్టమొదటగా.. తిరుమల కార్యనిర్వహణాధికారిగా సచ్ఛీలుడిగా పేరున్న జె.శ్యామలరావును నియమించారు.
తిరుమలలో ఈవోగా ధర్మారెడ్డి పరిపాలన ఎంత అరాచకంగా మారిపోయిందో అందరికీ తెలుసు. తిరుమల దేవస్థానాలు మొత్తం తన సామ్రాజ్యం అన్నట్టుగా ఆయన చెలరేగిపోయారు. అప్పట్లో తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇప్పుడు కొడుకు జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డిని నెత్తిన పెట్టుకున్నారు. ఇలాంటి దుర్మార్గమైన ఒంటెత్తు పోకడల ఈవో పరిపాలన టీటీడీ చరిత్రలో ఎన్నడూ చూడలేదని కూడా పలువురు అనేవారు. అలాంటి వివాదాస్పద ఈవో ధర్మారెడ్డిని చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే పక్కకు తప్పించారు. ఈ నెలాఖరున రిటైర్ కానున్న ఆయన సెలవుపై వెళ్లారు. తిరుమలేశుని సేవను క్లీన్ గా ఉంచాలనే తలంపుతో చంద్రబాబు ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న జె.శ్యామలరావును.. టీటీడీ ఈవోగా నియమించారు.
అలాగే టీటీడీ ధర్మకర్తల మండలిని కూడా వీలైనంత త్వరగా వేయడానికి చంద్రబాబునాయుడు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో చంద్రబాబు బోర్డులు వేయడంలో చాలా జాప్యం చేసేవారనే పేరుంది. ఈసారి అలా కాకుండా.. ఒక నెలరోజుల వ్యవధిలోనే వీలైనన్ని ముఖ్యమైన దేవస్థానాలు అన్నింటికీ పాలకమండళ్ల నియామకం పూర్తి చేయాలని చంద్రబాబు అనుకుంటున్నట్టుగా సమాచారం. టీటీడీ బోర్డు అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఫలితాలు వెలువడిన వెంటనే రాజీనామా సమర్పించిన సంగతి పాఠకులకు తెలిసిందే.
తిరుమలేశుని సన్నిధినుంచే ప్రక్షాళన ప్రారంభం!
Sunday, January 26, 2025