ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన పోరాటంగా ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో.. వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఈ పోలింగ్ ముగిసేదాకా ఆమె ఇలా సైలెంట్ గానే ఉండిపోతారా? వైఎస్ రాజశేఖర రెడ్డిని ప్రేమించే ప్రజల్లో, ఆయన భార్యగా ఆమె మాటకు ఎంతో విలువ ఉంటుంది. మరి, ఇలాంటి నేపథ్యంలో వారికి స్పష్టమైన దిశానిర్దేశం చేయకుండా విజయమ్మ రాజకీయ మౌనం ఇలాగే కొనసాగుతుందా? అనే సందేహాలకు త్వరలోనే తెరపడనుంది. ఏపీ ప్రజలు, ప్రత్యేకించి వైఎస్ రాజశేఖర రెడ్డిని అభిమానించే వారు ఈ ఎన్నికల్లో ఎటు వైపు మొగ్గాలో, ఎవరిని గెలిపించాలో.. వైఎస్ విజయమ్మ వీడియో సందేశం ద్వారా దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు విజయమ్మ వీడియో సందేశం అమెరికాలో తయారవుతున్నదని కూడా సమాచారం అందుతోంది.
జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలను క్లాస్ వార్అని అభివర్ణించినా, కురుక్షేత్రం అని పేర్కొన్నా.. మరోవైపు చంద్రబాబునాయుడు ఇది క్యాష్ వార్ అని ప్రకటించినా.. వాటన్నింటికంటె మించి మరో కోణాన్ని కూడా రాష్ట్రప్రజలు గమనిస్తున్నారు. ఇది అన్నాచెల్లెళ్ల వార్ అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
అన్న జగన్మోహన్ రెడ్డి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ సారథిగా ఒకవైపు ఉంటే.. మరొకవైపు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గా చెల్లెలు షర్మిల తలపడుతున్నారు, కడప ఎంపీ బరిలో కూడా ఉన్నారు. కేవలం ఎన్నికల బరిలో ఉండడం మాత్రమే కాదు. రోజుకో రకం తీవ్రమైన విమర్శలతో జగన్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ చెలరేగిపోతున్నారు.
అయితే వారి తల్లి విజయమ్మ పరిస్థితి ఏమిటి?
అధికాకారం కోసం అన్నాచెల్లెళ్ల మధ్య వార్ ముదురుతున్నదని అర్థమైన తొలిరోజుల్లోనే విజయమ్మ చల్లగా అమెరికాకు జారుకున్నారు. ఇక్కడే ఉంటే అటు కొడుకు, ఇటు కూతురు.. ఇద్దరి మీద ఆమెకు ప్రేమే. ఎవ్వరినీ కాదనలేరు. కానీ వారి ఒత్తిడిని తట్టుకుని ఇష్టంలేని ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి వస్తుందని ఆమె భావించి ముందే అమెరికాకు వెళ్లిపోయినట్టు వార్తలు వచ్చాయి.
అయితే అమెరికాలో ఆమె ఎక్కడ ఉన్నారు? ఆమె ఉంటున్నది.. షర్మిల కొడుకు దగ్గరే. ఇటీవల పెళ్లయిన మనవడి వద్దనే విజయమ్మ ఉంటున్నారు. ఆమెకు కొడుకు కంటె కూతురు మీద ఎక్కువ ప్రేమ అని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్ష పదవికి పార్టీ ప్లీనరీ వేదికమీద నుంచే రాజీనామా ప్రకటించినప్పుడే ఆమె తేల్చేశారు. ఇప్పుడు నేరుగా ఎన్నికల ప్రచారానికి దిగితే ఉండగల ఒత్తిళ్లను గురించి ఆలోచించి.. ఆమె అమెరికా నుంచి వీడియో సందేశం ద్వారా ఎన్నికల ప్రచారం చేయబోతున్నట్టు సమాచారం. కడప ఎంపీ నియోజకవర్గం నుంచి తన బిడ్డ షర్మిలను గెలిపించాలని, ఆ నియోజకవర్గం నుంచి ప్రజలకు ఎంతెంతో సేవచేసిన తన భర్త రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని తన బిడ్డకు అందించాలని ఆమె నియోజకవర్గ ప్రజలను అభ్యర్థించేలా.. ఈ వీడియో సందేశం ఉంటుందని తెలుస్తోంది. మరి షర్మిల ఆ వీడియోను ఎలాంటి కీలక సమయంలో బయటకు విడుదల చేస్తారో చూడాలి.
అమెరికాలో సిద్ధం.. వైఎస్ విజయమ్మ వీడియో సందేశం!
Wednesday, January 22, 2025