రాజకీయాల్లో గెలుపుఓటుములు సర్వసాధారణం. ఒకసారి ఓడినా సరే.. మళ్లీ గెలుస్తాం అనే నమ్మకంతోనే అందరూ ఆ రంగంలో జీవిస్తూ ఉంటారు. ఏపీలో కేవలం 11 సీట్లు మించి సాధించలేకపోయిన జగన్మోహన్ రెడ్డి, తెలంగాణలో అంతో ఇంతో పరువు దక్కే సీట్లు వచ్చిన కేసీఆర్ కూడా అదే చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో మనం గెలవబోతున్నాం అంటూ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ నమ్మకం అనేది కొన్ని సందర్భాల్లో పార్టీ కట్టు తప్పిపోకుండా, పార్టీ నాయకులు ఇతర పార్టీల్లోకి ఫిరాయించకుండా చూసేందుకు చెప్పే మాయమాట కూడా అయి ఉంటుంది. కానీ.. ఒక పార్టీలోని కీలక నాయకులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేదాన్ని బట్టి.. ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదో అంచనా వేయవచ్చు. తాజా పరిణామాలను గమనిస్తోంటే.. నాయకులే కాదు.. అధికారులు కూడా కొందరు తీసుకునే నిర్ణయాలు పార్టీల భవిష్యత్తుకు సంకేతాలుగా మారుతాయి.
జగన్ విషయానికి వస్తే.. ఆయన పాలన కాలంలో.. అడ్డగోలుగా చెలరేగిపోయిన అధికారుల్లో ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ కూడా ఒకరు. సీఎంపేషీలో ఉన్నా, తరువాత విద్యాశాఖ అజమాయిషీ చేసినా ఆయన తనకు ఎదురేలేదన్నట్టుగా చెలరేగారు. ఎన్నికలకు ముందు.. కోడ్ ఉండగా.. స్కూళ్లలో పేరంట్స్ మీటింగులు పెట్టి.. జగన్ కు ఓట్లేయించేలా తన వంతు కృషి చేయాలని అనుకున్నారు. అవన్నీ వర్కవుట్ కాలేదు. ఉపాధ్యాయుల్ని ఆయన వేధించిన తీరు గురించి కథలు కథలుగా చెబుతుంటారు. అలాంటి ఐఏఎస్ అధికారి ఇప్పుడు జగన్ దిగిపోగానే, వీఆర్ఎస్ తీసుకుని ఇంటిబాట పడుతున్నారు. కూటమి గెలిస్తే పనిచేయలేను అని ఎన్నికలకు ముందే ప్రకటించిన అధికారి ఆయన.
ఇక్కడ ఒక విషయం గమనించాలి. ప్రవీణ్ ప్రకాష్ కు ఇంకా ఏడేళ్ల సర్వీసు ఉంది. అయినా ఇప్పుడే వీఆర్ఎస్ తీసేసుకుంటున్నారు. సాధారణంగా జగన్ వెంట ఉన్న నాయకులకు అయిదేళ్లు గడిచాక మళ్లీ తాము అధికారంలోకి వస్తాం అనే ఆశ ఉండొచ్చు. జగన్ కూడా వారిని అలాగే నమ్మిస్తున్నారు. కానీ ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి ఏడేళ్ల ముందే ఇంటికి వెళ్తున్నాడంటే.. ఆయనకు జగన్ మళ్లీ గెలుస్తాడనే నమ్మకం లేదన్నమాట. ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ తీసుకోవడం, జగన్ కు ఇక రాజకీయ భవిష్యత్తు లేదు అని అనుకోవడానికి సంకేతం అని పలువురు అంచనా వేస్తున్నారు.
పీపీ నిష్క్రమణం : జగన్ భవిష్యత్తుకు నిదర్శనం!
Wednesday, December 25, 2024