జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అత్యంత వివాదాస్పద అధికారిగా ముద్రపడిన ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక రకమైన ఈసడింపుతో ఏడేళ్ల పదవీ కాలాన్ని కూడా త్యజించి వీఆర్ఎస్ తీసుకున్నారు. అది ఇంకా అమలులోకి రాకముందే తిరిగి ప్రభుత్వ సర్వీసులో చేరాలనుకుంటున్నారు. గత ఐదేళ్లలో ఆయన ప్రదర్శించిన అహంకారాన్ని, అధికార మదాన్ని పరిశీలించినప్పుడు ఆయన ఇన్ని మెట్లు దిగివచ్చి, తిరిగి విధుల్లో చేరాలని అనుకోవడం, ఏదో ఒక పోస్ట్ కేటాయించమని ప్రభుత్వాన్ని అభ్యర్థించడం అనేది అనూహ్యమైన సంగతి. అయితే అలా ఆయన రాజీ పడడం వెనుక ఒక మతలబు ఉన్నదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
బొత్స సత్యనారాయణ విద్యా శాఖ మంత్రిగా ఉండగా ప్రవీణ్ ప్రకాష్ ఆయనతో కుమ్మక్కు అయి అనేక రకాల అక్రమాలకు అరాచకాలకు పాల్పడ్డారని అభియోగాలు ఉన్నాయి. అంతకుముందు కూడా జగన్మోహన్రెడ్డి కోటరీలో కీలక స్థానంలో ఉంటూ రాష్ట్రవ్యాప్తంగా అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వాటిని ఒక్కటొక్కటిగా బయటకు తీస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ఎన్నికలకు ముందే తెలుగుదేశం గెలిస్తే కనుక తాను ఇక ప్రభుత్వ సర్వీసులో పనిచేయడం కష్టం అని సహచర ఐఏఎస్ అధికారితో వ్యాఖ్యానించినట్లుగా వార్తలు కూడా వచ్చాయి. ఆయన భయాలకు తగ్గట్లుగానే తెలుగుదేశం రావడం ఆయనను అప్రధాన పోస్టులోకి పంపడం జరిగింది. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు కూడా. ప్రభుత్వం వెంటనే ఆమోదించింది సెప్టెంబర్ 30వ తేదీ నుంచి అది అమలులోకి వస్తుందని ఆదేశాలు కూడా జారీ అయ్యా యి.
తీరా ఇప్పుడు పదవిలో మళ్ళీ చేరుతానంటున్నారు ప్రవీణ్ ప్రకాష్. అమరావతి వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి దీని వెనుక మతలబు ఏమిటంటే సర్వీసులో ఉంటే అవినీతి కేసులు ఎదుర్కోవడానికి కాస్త వెసులుబాటు ఉంటుందని ఆలోచిస్తున్నారట. ఈ ప్రభుత్వం తనను అరెస్టు చేయడం తప్పదని సర్వీసులో ఉంటే కోర్టు కేసులు వాదించుకోవడంలో ప్రభుత్వ ఖర్చుతో చేయవచ్చునని, ఇదే విఆర్ఎస్ తర్వాత అయితే అందుకు తన సొంత ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుందని ప్రవీణ్ ప్రకాష్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకే కాస్త రాజీ పడినా సరే సర్వీసులో కొనసాగాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి విధుల్లోకి తీసుకోరాదని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
పీపీ- మెట్లు దిగి రావడం వెనుక మతలబు ఇదే!
Monday, January 27, 2025