లేకి రాజకీయం: పిల్లలు, దేవుడు ఎందుకు?

Tuesday, January 28, 2025

రాజకీయ నాయకులు మాట్లాడే ఏ ఒక్క మాటకు కూడా పూర్తిస్థాయి విశ్వసనీయత ఉండదు. ప్రతి మాటలోను ఏదో ఒక మెలిక ఉంటుంది. డొంకతిరుగుడు.. తమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే మాట్లాడే తీరు ఉంటుంది. ఇలాంటి దురవస్థ ఎలాంటి నాయకులకైనా తప్పకపోవచ్చు. ఎందుకంటే.. ఏ చిన్న పొల్లుమాట వారి నోటినుంచి వచ్చేసినా.. ప్రత్యర్థులు ఆ ఒక్క మాటను పట్టుకుని నానా రాద్ధాంతం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ విషయం తెలుసు గనుక.. నాయకులు జాగ్రత్తగా మాట్లాడుతుంటారు.

రకరకాల అర్థంపర్థం లేని ప్రతిజ్ఞలు ప్రమాణాలు కూడా చేస్తుంటారు. అయితే.. విజయసాయిరెడ్డి ఇంకా ఒక అడుగు ముందుకు వేసి తన పిల్లలు, వేంకటేశ్వరస్వామి మీద కూడా రకరకాల ప్రమాణాలు చేసేస్తుంటారు. రాజకీయాలనుంచి సన్యాసం తీసుకున్నారు గానీ.. ప్రజలు నమ్మలేని విషయాలు చెప్పేప్పుడు.. ఇలా పిల్లలను, వేంకటేశ్వరస్వామిని రచ్చకీడ్చి వారిమీద ప్రమాణాలు చేయడం అనే అలవాటు మాత్రం ఆయనకు పోయినట్టు లేదు.

కేవీరావు నుంచి బెదిరింపుల ద్వారా విజయసాయిరెడ్డి.. తన అల్లుడి అన్న శరత్ చంద్రారెడ్డి పరం అయ్యేందుకు పనిచేశారంటూ ఆరోపణలు వచ్చాయి. కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసులను ఆయన న్యాయపరంగానే ఎదుర్కొని ఉంటే ఆయన సత్యసంధత చక్కగా నిరూపణ అయ్యేది. చాలా సహజంగా ఆరోపణల గురించి ప్రస్తావన రాగానే.. ఆయన తనకు సంబంధమే లేదని చెప్పుకున్నారు. ఆ వెంటనే.. తన పిల్లల మీద ప్రమాణం చేశారు. తాను ఎంతో ఇష్టపడే వేంకటేశ్వరస్వామి ఎదుట కూడా ప్రమాణం చేయగలనని ఆయన చెప్పుకొచ్చారు. అయితే.. కేవీరావు కూడా తిరుమలకు వచ్చి ప్రమాణం చేయాలని ఒక షరతు పెట్టారు.

ఆరోపణలు విజయసాయి మీద వస్తే.. ఆయనకు తాను చెబుతున్నది నిజమే అనే నమ్మకం ఉంటే, తాను బెదిరింపులకు పాల్పడలేదనే విశ్వాసం ఉంటే.. ఆయన వెళ్లి తిరుమల స్వామి ఎదుట ప్రమాణం చేయవచ్చు. దానికి ఆరోపించిన వ్యక్తి కూడా వచ్చి ప్రమాణం చేయాలనే షరతు ఎందుకు? ఈ మెలిక మాటలు మాట్లాడడం నాయకుల పట్ల ప్రజల్లో మరింత అపనమ్మకాన్ని కలిగిస్తాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ కే చెందిన భూమన కరుణాకర్ రెడ్డి.. గతంలో లడ్డూ కల్తీ గురించి ఆరోపణలు వచ్చినప్పుడు ఎంచక్కా తిరుమల దేవుడి ఆలయం ఎదుట చేతిలో కర్పూరం పెట్టుకుని.. ఇలాంటి అవినీతికి తన హయాంలో పాల్పడి ఉంటే.. తన కుటుంబం మొత్తం నాశనం అయిపోతుందని ప్రమాణం చేశారు. తద్వారా ఆయన వైవీ సుబ్బారెడ్డిని ఇరుకున పెట్టారనేది వేరే సంగతి.

కానీ.. ఆరోపణలు చేసిన వారు కూడా వచ్చి ప్రమాణం చేయాలనే షరతులేమీ పెట్టలేదు. విజయసాయి కూడా అలా చేయవచ్చు.
అలాంటిదేమీ లేకుండా.. అవినీతి, అబద్ధాలకు సంబంధించిన ఆరోపణలు వచ్చిన ప్రతిసారీ.. పిల్లల మీద, దేవుడి మీద ప్రమాణం అని చెప్పే మాటలు ప్రజల్లో విశ్వసనీయతను పెంచవు అని విజయసాయి తెలుసుకోవాలి. అవన్నీ రాజకీయంగా లేకి ఎత్తుగడలుగా ప్రజలు పరిగణిస్తారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles