`ఆపరేషన్ సిందూర్ ‘కు ప్రతీకారంగా పాకిస్తాన్ సైన్యం డ్రోన్ లు, క్షిపణులతో చేపట్టిన ముప్పేట దాడిని భారతీయ సైన్యం అత్యంత సమర్ధవంతంగా తిప్పికొట్టడమే కాకుండా, పాకిస్థాన్ లోని సైనిక స్థావరాలు, సైనిక విమానాశ్రయాలపై ఎదురు దాడులు జరపడం ద్వారా మొత్తం ప్రపంచాన్ని విస్మయ పారించింది. చరిత్రలో ఎన్నడూ లేనంత నిస్సహాయ పరిస్థితుల్లో పాకిస్తాన్ కనిపించింది. మరో 72 గంటలు ఇదే పరిస్థితి కొనసాగితే అనూహ్యమైన పరిణామాలు జరిగి ఉండేవని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.
అయితే, అర్ధాంతరంగా కాల్పుల విరమణ ప్రకటన జరిగిన తీరు మొత్తం దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఆ తర్వాత వరుసగా రెండు రోజులపాటు గతంలో ఎన్నడూ లేనివిధంగా సైనికాధికారులతో గంటల తరబడి మీడియా సమావేశాల ద్వారా పాకిస్థాన్ సేనలపై ఏ విధంగా విజయాలు సాధించామో వివరించే ప్రయత్నం చేశారు. 48 గంటల తర్వాత స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి జాతిని ఉద్దేశించి ప్రసంగించడం ద్వారా ఎవ్వరి ఒత్తిడిలకు లొంగి కాల్పుల విరమణ జరపలేదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
ఇవన్నీ చూస్తుంటే మోదీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందని స్పష్టం అవుతుంది. ముందురోజే భారత్- పాకిస్థాన్ ఘర్షణలతో జోక్యం చేసుకునే అవసరం తమకు లేదంటూ ప్రకటించిన అమెరికా, స్వయంగా డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా కాల్పుల విరమణ గురించి మొదటగా ప్రకటించడం, ఆ తర్వాతనే మోదీ మంత్రివర్గ సభ్యులకు, ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియడం గమనిస్తే తెరవెనుక నిగూఢమైన వత్తిడులు పనిచేశాయనే అనుమానాలు కలుగుతున్నాయి. కనీసం కేంద్ర మంత్రివర్గం పూర్తిస్థాయిలో సమావేశమై ఈ అంశాన్ని చర్చించిన దాఖలాలు లేవు.
ఆపరేషన్ సిందూర్ జరగగానే భారత్ సేనలు ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకుంటాయని లేదా బలోచిస్తాన్ ను విముక్తి చేస్తాయని అంటూ సోషల్ మీడియాలో బీజేపీ మద్దతు దారులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కనీసం ఈ ఘర్షణల సందర్భంగా సరిహద్దుల్లో పాక్ సేనలు బందీగా చేసిన బిఎస్ఎఫ్ జవాన్ ను విడిచిపెట్టమని వత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా జరగలేదు. పాకిస్థాన్ వీధులలో స్వేచ్ఛగా తిరుగుతున్న ‘లష్కరే తాయిబా చీఫ్ మసూద్ అజర్‌ను లేదా దావూద్ ఇబ్రహీం వంటి వారిని అప్పచెప్పాలని భారత్ వత్తిడి తెచ్చే ప్రయత్నం చేయలేదు.
పాకిస్థానే కాల్పుల విరమణకు ప్రాధేయపడిందని, పలు దేశాలను అభ్యర్హ్దించిందని ప్రధాని మోదీ స్వయంగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే కాల్పుల విరమణ అంగీకరించడానికి మనం విధించిన షరతులు ఏమిటి? అనే విషయంలో మౌనం వహిస్తున్నారు. ‘పీవోకేను స్వాధీనం చేయాలని అడిగినామా? లేదా పహల్గాంలో కాల్పులు జరిపిన నలుగురు ఉగ్రవాదులను అప్పగించాలని డిమాండ్ చేశామా? మున్ముందు భారత్‌పై ఉగ్రదాడులు జరగకుండా పాక్ నుంచి స్పష్టమైన హామీ తీసుకున్నామా?’ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పహల్గమ్ లో ఉగ్రదాడికి పాల్పడిన ప్రతి వ్యక్తిని వెంటాడి పట్టుకొని, శిక్షిస్తామని బీహార్ లోని బహిరంగ సభలో ప్రధాని స్వయంగా ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు వారి ఆచూకీ తెలియడం లేదు. వారింకా జమ్మూ కాశ్మీర్ లోనే తిరుగుతున్నట్లు నిఘా వర్గాలు సంకేతాలు ఇచ్చాయి. ఈ విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వాన్ని జవాబుదారీచేసే ప్రయత్నం చేయడం లేదు. అమెరికా అధ్యక్షుడు భారత్‌ను, పాకిస్థాన్‌ను ఒకే గాటన కట్టి `కామన్‌సెన్స్’ అనే పదజాలం వాడుతుంటే ఖండించే ప్రయత్నం కూడా చేయలేక పోయారు.
గత ఫిబ్రవరిలో అమెరికా ఆహ్వానం లేకుండానే రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ను అభినందించడానికి ప్రత్యేకంగా వెడితే మీడియా సమావేశంలో భారత్ ను `టారిఫ్ కింగ్’ అంటే సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేదు. కాల్పుల విరమణ జరపకపోతే వాణిజ్య సంబంధాలు తెంచుకుంటామని బెదిరిస్తే రెండు దేశాలు దారిలోకి వచ్చి కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని ట్రంప్ చెప్పినా ప్రధాని ఖండించే ప్రయత్నం చేయలేదు. ఈ సందర్భంగా 1971లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ వ్యవహరించిన తీరును పలువురు గుర్తుకు తెచ్చుకోవడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది.
ప్రధాని ఇందిరాగాంధీని అమెరికా అధ్యక్షుడు నిక్సన్ వైట్ హౌజ్‌కు పిలిపించి పాకిస్థాన్ విషయంలో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరిస్తే, `మేము అమెరికాను స్నేహితునిగా భావిస్తున్నాము, బాస్ గా కాదు. మా దేశం గురించి మేము నిర్ణయం తీసుకుంటాము. మరొకరు చెప్పాల్సిన అవసరం లేదు’ అంటూ స్పష్టంగా మొఖం మీదే చెప్పి, అమెరికా అధ్యక్షుడితో జరగాల్సిన సంయుక్త మీడియా సమావేశాన్ని రద్దు చేసుకొని ఆమె తిరిగి వచ్చేసారు.
ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఏకంగా అమెరికాలో మీడియా ముందే ట్రంప్‌తో వాగ్వాదానికి దిగి సమావేశం మధ్యలోనే బయటికి వచ్చేశారు. కమెడియన్ నుంచి దేశాధ్యక్షుడిగా ఎదిగిన జెలెన్ స్కీ కూడా రష్యాతో కాల్పుల విరమణ చేసుకోమంటే అమెరికా అధ్యక్షుడినే ఎదిరించి బయటికి వెళ్లిపోయాడు. ట్రంప్ ఏపని చేసినా వ్యాపార ప్రయోజనాలే ముఖ్యం. అందుకనే సుంకాలు అంటూ బెదిరించి, చైనా ఎదురు తిరిగితే బేరానికి వచ్చారు.
పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టే సమయంలో అమెరికా, చైనా అందించిన క్షిపణులను భారత్ సేనలు ధ్వంసం చేస్తూ ఉంటె తమ ఆయుధ కంపెనీల వ్యాపారం దెబ్బతింటుందనే భయంతోనే అర్ధాంతరంగా కాల్పుల విరమణకు ఒత్తిడి తీసుకు వచ్చారనే ప్రచారం జరుగుతుంది. మరోవంక, ఇరాన్, సౌదీ అరేబియా, ఇంగ్లాండ్ వంటి దేశాలు సహితం ఈ విషయంలో భారత్ పై వత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాయి. ఆ విధమైన వత్తిడులు తీసుకు రావడం సర్వసాధారణమే.
కానీ అటువంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వ స్పందన వ్యూహాత్మకంగా, దేశ ప్రయోజనాలు కాపాడే విధంగా ఏమేరకు ఉంది? అనే ప్రశాంలే ఇప్పుడు తలెత్తుతున్నాయి. బీజేపీలో సీనియర్లను తప్పించడం కోసం 75 ఏళ్ళ తర్వాత పదవులు లేవనే వరవడిని తీసుకొచ్చిన ప్రధాని మోదీ ఇప్పుడు అదే అంశమై మరో నాలుగు నెలల్లో ప్రధాని ప్రదవికి రాజీనామా చేయాలనే వత్తిడులు ఎదుర్కొంటున్నారు.
ఈ వత్తిడులు కారణంగానే గత ఏడాది జనవరిలోనే పదవీకాలం పూర్తయిన జెపి నడ్డా స్థానంలో కొత్త బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకోలేక పోతున్నారు. పలు కీలక రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల ఎంపిక సహితం జరగడం లేదు. మరోవంక, కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు సాధ్యం కావడం లేదు. ఇటువంటి సమయంలో `ఆపరేషన్ సిందూర్’ ఆయన నాయకత్వాన్ని మరింతగా సుస్థిరం చేసుకునేందుకు లభించిన సువర్ణవకాశంగా పలువురు భావించారు.
బహుశా 1971 తర్వాత మొదటిసారి రాజకీయ విబేధాలు విస్మరించి ప్రతిపక్షాలు అన్ని ఈ విషయంలో ప్రభుత్వంకు బాసటగా నిలిచాయి. పహల్గమ్ ఉగ్రదాడి జరిగినప్పటి నుండి అసదుద్దీన్ ఒవైసీ వంటి నాయకుల నుండి అందరూ పాకిస్థాన్ ను `ఉగ్రదేశం’గా పేర్కొంటూ ఆ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్ మొదటిసారిగా ప్రతిపక్షాల నుండి వచ్చింది.
ఆ స్థాయిలో బీజేపీ నాయకత్వం ఈ సమయంలో స్పందింపలేదని స్పష్టం అవుతుంది. ఎంతసేపు గతంలో ఉగ్రదాడుల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఇతర రాజకీయ పార్టీలు ఏ విధంగా వ్యవహరించాయో అంటూ ప్రతిపక్షాలపై విమర్శలతో సోషల్ మీడియాలో పోస్టులను నింపివేసారు. అఖిలపక్ష సమావేశంకు ప్రధాని గైరాజరైనా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే హుందాగా ఈ అంశాన్ని ఇప్పుడు లేవనెత్తాలి అనుకోవడం లేదని చెప్పడం గమనార్హం.
ఇప్పటి వరకు యుద్ధాలలో భారత్ సాంకేతికంగా విజయం సాధించిన యుద్ధం 1971 మాత్రమే. పాకిస్థాన్ సేనలు వచ్చి భారత సేనల ముందు లొంగిపోయాయి. అందుకు నాటి ఇందిరాగాంధీ సమర్థవంతమైన నాయకత్వంతో పాటు నాటి సైన్యాధిపతి మానెక్ షా వ్యూహాత్మకంగా వ్యవహరించిన తీరు కూడా కారణం. అయితే సిమ్లా ఒప్పందం సందర్భంగా పట్టుబడిన 90 వేల మంది సైనికులను ఏకపక్షంగా ఇందిరా గాంధీ పాకిస్తాన్ ను అప్పచెప్పారని అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. ఆ విధంగా మోదీ ప్రభుత్వ వ్యూహాత్మక వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే, యుద్ధం ముగిసినా `బంగ్లాబంధు’ ముజిబుర్ రహమాన్ ఇంకా పాకిస్తాన్ జైలులో ఉండటం అప్పట్లో ఇందిరా గాంధీని తీవ్ర కలవరంకు గురిచేసింది. ముజిబుర్ ను జైలులో చంపివేస్తే బంగ్లాదేశ్ నాధుడు లేక అల్లకల్లోలం అవుతుంది. అప్పుడు భారత్ కు పక్కలో బల్లెంగా మారే ప్రమాదం ఉంది. అటువంటి ప్రమాదం నివారించడం కోసం ఆమె ఎక్కువగా ఆందోళన చెందారు.
పైగా, యుద్ధంలో ఓటమి చెందడంతో తీవ్ర ప్రతికూలత ఎదుర్కొంటున్న భుట్టో ఆమెను ప్రాథేయపడ్డాడని, ఇప్పుడు భారత్ షరతులకు ఒప్పుకొంటే తనను సైన్యం తమ దేశంలో చంపివేస్తుందని భయం వ్యక్తం చేసాడని, కొంచెం వ్యవధి ఇస్తే ఆక్రమిత కాశ్మీర్ ను కూడా అప్పజెబుతానని హామీ ఇచ్చాడని చెబుతారు.
సహజంగానే ఆపదలో చేసే హామీలను పాకిస్తాన్ నేతలకు నిలబెట్టుకునే అలవాటు లేదు.
1965 యుద్ధం సమయంలో సహితం మన సేనలు లాహోర్ వరకు వెళ్ళినా నాటి భౌగోళిక, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి రష్యా మధ్యవర్తిత్వంతో వెనుకడుగు వేయాల్సి వచ్చింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కీలక సమయాలలో రష్యా, అమెరికా వంటి దేశాలు పాకిస్థాన్ ను ఆదుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటె, వ్యూహాత్మకంగా ఆ దేశం అవసరం వారికి ఉంది.
రష్యా, చైనాలకు సరిహద్దుల్లో ఉండడంతో పాకిస్థాన్ తో సుదీర్ఘకాలంగా అమెరికా స్నేహం చేస్తూ వస్తోంది. అందుకొసం గతంలో భారత్ తో వైరం పెంచుకునేందుకు కూడా వెనకాడలేదు. రష్యాకు వ్యతిరేకంగా చైనాతో మైత్రి ఏర్పర్చుకోవడానికి అమెరికాకు పాకిస్థాన్ మధ్యవర్తిగా వ్యవహరించింది. అదే విధంగా రష్యాను ఆఫ్ఘానిస్తాన్ నుండి గెంటివేయడం కోసం తాలిబన్లకు, అమెరికాకు మధ్య పాకిస్థాన్ సయోధ్య కుదిర్చింది. చివరకు ఆఫ్ఘానిస్తాన్ ను ఖాళీ చేసే సమయంలో సహితం అమెరికాకు పాకిస్థాన్ చేదోడుగా ఉంది.
కేవలం చైనాను కట్టడి చేయాలంటే భారత్ అవసరం అనే ఉద్దేశ్యంతోనే అమెరికా మనతో స్నేహం కోసం ప్రయత్నం చేస్తున్నది. అయితే, పాకిస్తాన్ మాదిరిగా భారత్ ఏకపక్షంగా వ్యవహరించే అవకాశాలు లేవు. అందుకనే భారత్ కోసం పాకిస్తాన్ ను వదులుకునేందుకు అగ్రరాజ్యాలు సిద్ధపడటం లేదు. కేవలం 1999లో మాత్రమే వాజపేయి ప్రభుత్వం అనుసరించిన అపూర్వమైన దౌత్యనీతి కారణంగా కార్గిల్ యుద్ధం సమయంలో అంతర్జాతీయంగా పాకిస్థాన్ ను చరిత్రలో మొదటిసారిగా భారత్ ఏకాకి చేయగలిగింది.
‘ముందు కార్గిల్ పర్వతాలపై నుండి నీ సేనలను వెనుకకు పిలిపించి నాకు కనిపించే’ అంటూ కర్కశంగా నవాజ్ షరీఫ్ కు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ చెప్పి వెనుకకు పంపించారు. మిత్రదేశమైన చైనా సహితం జోక్యం చేసుకోకుండా తప్పుచేస్తున్నావని పాకిస్తాన్ ను వారించింది. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న దౌత్యం స్వదేశీ రాజకీయాలలో ప్రచారం కోసం ఉపయోగించుకునే ప్రయత్నాలకు వేదికగా పరిమితం అవుతూ ఉండడంతో అంతర్జాతీయంగా చెప్పుకోదగిన పరిణితి ప్రదర్శింపలేక పోతున్నామని మరోసారి రుజువైంది. ఇప్పటికైనా `సోషల్ మీడియా’ ప్రచార వేదికగా దౌత్యాన్ని వదులుకొని, వ్యూహాత్మక ప్రయోజనాలపై దృష్టి సారించాలి.
