షర్మిల ఎవరు వదిలిన బాణమో తేల్చేసిన ప్రధాని మోదీ

Wednesday, December 18, 2024

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం స్వయంగా ఫోన్ చేసి పరామర్శించి, ఇటీవల జరిగిన ఘటనలకు ఆయన సానుభూతి తెలపడంతో ఇప్పటి వరకు ఆమె ఎవ్వరు వదిలిన బాణమో అని జరుగుతున్న చర్చకు తెరపడిన్నట్లు అయింది. 

పైగా, ఆమెను ఢిల్లీకి రావాలంటూ ఆమెకు ప్రధాని కోరడం, ఒక మహిళని చూడకుండా.. కారులో ఉండగానే తీసుకువెళ్లడం అనేది దారుణమని విచారం వ్యక్తం చేయడం, ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని స్పష్టం చేయడం గమనిస్తే మర్యాదకోసం చేసిన ఫోన్ కాదని స్పష్టం అవుతుంది. 

అంతేకాకుండా ఆ ఘటనను చూసి చాలా బాధపడ్డానని చెప్పడంతో పాటు ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని మోదీ కఠిన పదజాలం ఉపయోగించడం గమనిస్తే వ్యూహాత్మకంగా తెలంగాణాలో కొంతకాలంగా అనుసరిస్తున్న రాజకీయ ఎత్తుగడలతో భాగం అని భావింప వలసివస్తుంది. 

అంతే కాకుండా, కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతున్న విషయంపై తాము అండగా నిలుస్తామంటూ షర్మిలకు మోదీ భరోసా కల్పించినట్లు ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ సర్కార్‌కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని షర్మిలకు మోదీ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం కొనసాగించాలని, ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజావ్యతిరేక నిర్ణయాలను గట్టిగా ప్రశ్నించాలని సూచించినట్లు తెలుస్తున్నది. 

షర్మిలతో సుమారు 10 నిముషాలు మాట్లాడిన ప్రధాని అంతకు ముందు, సోమవారం జీ-20పై నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి, షర్మిల సోదరుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద కూడా  ఈ విషయాన్ని ప్రస్తావించారు.

సొంత చెల్లెలు షర్మిలపై దాడి జరిగినా,  హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసినా, ఆమె కూర్చుని ఉండగానే కారును క్రేన్‌తో లాక్కెళ్లి ఠాణాకు తరలించినా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి స్పందించలేదు. ఈ సంఘటనలను ఖండించలేదు.

 ‘ఆ విషయం తెలిసి నాకే బాధ కలిగింది. ఇంత జరిగినా మీరెందుకు మాట్లాడలేదు?’ అని నేరుగా జగన్‌నే ప్రశ్నించడం రాజకీయంగా కలకలం చెందుతున్నది. ప్రధాని ప్రశ్నతో దిగ్బ్రాంతి చెంది, ఏం సమాధానం చెప్పాలో తెలియక, జగన్‌ తనదైన శైలిలో నవ్వుతూ మౌనంగా నిల్చున్నట్లు తెలిసింది.

పొరుగు రాష్ట్రంలో అన్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పటికీ ఎటువంటి ప్రాధాన్యత లభించక పోవడంతో, తెలంగాణకు వచ్చి సొంతంగా పార్టీని వై ఎస్ షర్మిల ప్రారంభించినప్పుడు ఆమె ఎవ్వరు వదిలిన బాణమో అన్నట్లు పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం కోసం సీఎం కేసీఆర్ వదిలిన బాణం అన్న ప్రచారం జరిగింది. 
జగన్ తో కేసీఆర్ కు లోపాయికారిగా సాన్నిహిత్యం ఉండడంతో, మిత్రుడి కోసమే చెల్లెలుతో అక్కడ పార్టీ ప్రారంభింప చేశారని పలువురు బిజెపి నేతలు బహిరంగంగా ఆరోపణలు చేశారు.

అయితే, ఆమె బిజెపి వదిలిన బాణమే అంటూ కాంగ్రెస్ నేతలు మొదటి నుండి స్పష్టం చేస్తున్నారు. షర్మిల అరెస్ట్ కాగానే బిజెపి నేతలు వరుసగా సానుభూతి వ్యక్తం చేస్తుండడంతో ఆమెను బిజెపి వదిలిన బాణంగా టిఆర్ఎస్ నేతలు కూడా ఆరోపించడం ప్రారంభించారు. ఇప్పుడు ప్రధాని ఆమెకు స్వయంగా ఫోన్ చేయడంతో వారందరి ఆరోపణలకు బలం చేకూరినట్లు అయింది. 

గతంలో పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసిన షర్మిల.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లలో భారీగా అవినీతి జరిగిందంటూ ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై సీబీఐ డైరెక్టర్‌, కాగ్‌కు కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం. అంటే, బిజెపి పెద్దలతో ఆమె కొంతకాలంగా సంబంధాలు ఏర్పర్చుకున్నట్లు  స్పష్టం అవుతుంది. 

వైఎస్ షర్మిల అరెస్ట్‌ను తెలంగాణ బీజేపీ నేతలు వెంటనే ఖండించడం ఈ సందర్భంగా గమనార్హం. ఓ మహిళ పట్ల కేసీఆర్ సర్కారు విపరీతమైన అహంకారాన్ని ప్రదర్శించిందని, ఇదో హేయమైన చర్య అని అంటూ మొదటగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించి తీవ్రంగా ఖండించారు. 

ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలకు ధర్నాలు, పాదయాత్రలు చేసే హక్కు ఉంటుందన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్  ప్రభుత్వం అరెస్ట్‌ చేసే పద్ధతి, తీసుకుపోయే పద్ధతి దుర్మార్గమని మండిపడ్డారు. వైఎస్ షర్మిల క్యారవాన్‌ను టీఆర్ఎస్ కార్యకర్తలు తగలబెట్టడాన్ని ఖండిస్తున్నానని బండి సంజయ్ ట్వీట్ చేశారు. 

మహిళ అని కూడా చూడకుండా అరెస్టు చేయడం,ఆమె వాహనాన్ని తగలబెట్టడం కేసీఆర్ అరాచక పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు.   అలాగే ఈ ఘటనపై షర్మిల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సహితం మరుసటి రోజే స్పందిస్తూ, ఆమె అరెస్ట్ ను ఖండిస్తూ ట్వీట్ చేశారు. పైగా, తన ఆగ్రహాన్ని డీజీపీ మహేందర్ రెడ్డికి తెలిపారు కూడా. షర్మిల ఆ మరుసటి రోజు గవర్నర్ ను స్వయంగా కలుసుకున్నారు. 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles