సాధారణంగా ముఖ్యమంత్రి ఒక ఊరికి వస్తున్నారంటే ఆ ఊరి ప్రజల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. రాష్ట్రం మొత్తానికి అధినేత అయిన నాయకుడు.. తమ ఊరికి వస్తున్నారంటే.. అక్కడి ప్రజలు ఎదురుచూసేవారు. తమ ఊరికి ఏదో వరాల జల్లు కురుస్తుందని నిరీక్షించేవారు. ముఖ్యమంత్రుల పర్యటనలు కూడా అలాగే ఉండేవి. ఆ ఊరికోసం ఏదైనా చేస్తున్నప్పుడే.. సాధారణంగా ముఖ్యమంత్రి అక్కడకు వచ్చేవారు. దానికి తోడు అక్కడికి వచ్చిన సందర్భంగా ఆ ఊరికి, ఆ ప్రాంతానికి ఎన్నెన్నో కొత్త వరాలను కూడా ప్రకటించేవారు. ఇదంతా ఒకప్పటి తరహా.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
‘‘రాకు రాకు జగనన్నో.. మా ఊరి వైపు రాకు..
మా బతుకుల్లో చీకట్లను నింపి వెళ్లబోకు..’’
అంటూ ప్రజలు ఏడుపుగొట్టు పాటలు పాడుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యమంత్రి ఫలానా ఊరికి ఎందుకు వస్తున్నారు? అంటే నిర్దిష్టమైన కార్యక్రమం ఉండదు. ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఏదో ఒక ఊరిని ఎంచుకుంటారు. అక్కడ మమ అనిపిస్తారు. అన్ని ప్రాంతాల సమతూకం పాటిస్తున్నాం అన్నట్టుగా రాష్ట్రంలో ఈ మూల నుంచి ఆ మూల వరకు అన్నిచోట్ల సభలు పెడతారు. అయితే ఆ సభలకు స్థానికంగా అక్కడే నిర్వహించాలనే అవసరం ఏమీ ఉండదు. అలాంటివి నిర్వహించడం తప్పు కాదు. కానీ.. ఆ ఊరిలో సభ పెట్టినందుకు అక్కడి ప్రజలకు ప్రాంతానికి కొత్త వరం ఏదన్నా ఇస్తే బాగుంటుంది. అలాంటివి ఉండవు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఏకరవు పెట్టడం తప్ప మరొకటి జరగదు.
పైగా జగన్ ఒక ఊరికి వస్తున్నారంటే.. ఆ ఊరి ప్రజలకు రెండురోజుల కర్ఫ్యూ నరకం ఉంటుంది. జగన్ రాకకు ముందురోజునుంచే విపరీతమైన ఆంక్షలు ఆ ఊరిని ముంచెత్తుతాయి. ప్రజలను రోడ్లలోకి కూడా రానివ్వరు. జగన్ సభకు అధికారులు తోలించే ప్రజలు తప్ప.. మరెవ్వరూ రోడ్ల మీద తిరగనే కూడదు అనే తరహాలో.. ఈ నిషేధాజ్ఞలు ఉంటాయి. ప్రజల జీవితం నరకప్రాయం అవుతుంది. ఆ రెండు రోజుల పాటూ.. జగన్ కాన్వాయ్ తిరిగే రోడ్లు, తిరగని రోడ్లలో కూడా దుకాణాలు అన్నింటినీ మూసేయిస్తారు. వ్యాపారం కొండెక్కినట్టే.
అందుకే ముఖ్యమంత్రి హోదాలో జగన్ తమ ఊరికి వస్తున్నారంటేనే జనం భయపడుతున్నారు. మా ఊరికి మాత్రం మాత్రం రావొద్దు అని విన్నవించుకుంటున్నారు. ముఖ్యమంత్రి రావడం వల్ల.. ఊరికి ఒనగూరే కొత్త ప్రయోజనం ఏమీ లేనప్పుడు.. జనజీవితం స్తంభిస్తున్నప్పుడు.. వస్తే ఎంత? రాకపోతే ఎంత? అనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతోంది.