వైనాట్ 175 అంటూ రంకెలు వేసిన జగన్మోహన్ రెడ్డి.. ఎన్నికలు అయిన తర్వాత కొంత తగ్గారు. కానీ ఏ ప్రశాంత్ కిశోర్ ను అయితే ఆయన హేళన చేశారో.. ఆయన మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. మాట మార్చడం లేదు. గతంలో ఏ మాట అయితే చెప్పారో.. ఇప్పుడు కూడా అదే అంటున్నారు. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్గరని, ఘోర పరాజయం మూటగట్టుకోబోతున్నారని ప్రశాంత్ కిశోర్ చెబుతున్నారు.
దేశంలో ఎన్నికల ప్రచార వ్యూహరచన అనే పనికి ఒక బ్రాండ్ వేల్యూ తీసుకువచ్చిన వ్యక్తి ప్రశాంత్ కిశోర్. దేశంలోని చాలా పార్టీలు ఆయన సేవలను వాడుకున్నాయి. ఎన్నికల అంచనాల విషయంలో ఆయన మాటకు ఒక విలువ కూడా ఉంది. ఆయన మాత్రం తన మాట మార్చడం లేదు. ఏపీలో జగన్ ఓడిపోవడం గ్యారంటీ అనే ఇప్పటికీ చెబుతున్నారు. గతంలో కూడా రెండు సందర్భాల్లో పీకే, ఏపీలో జగన్ ఓటమి తథ్యం అనే సంగతి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
తాజాగా జాతీయ స్థాయిలో కొందరికి ఇంటర్వ్యూలు ఇస్తున్న ప్రశాంత్ కిశోర్ దేశంలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తన అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. పీకే ప్రస్తుతం భాజపాకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నప్పటికీ.. ఆయన కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వమే వస్తుందని చెప్పడం విశేషం. భారతీయ జనతా పార్టీ కూటమికి 2019 ఎన్నికల ఫలితాలతో సమానంగా గానీ, అంతకంటె ఎక్కువగానీ సీట్లు వచ్చే అవకాశం ఉన్నదని పీకే జోస్యం చెప్పారు. అంతే తప్ప సీట్లు తగ్గవు అని అభిప్రాయపడ్డారు. నిజానికి పీకే ఎన్డీయే కూటమిలోని బీహార్ లోని జేడీయూ నితీశ్ కుమార్ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీహార్ పాలిటిక్స్ లో క్రియాశీలంగా ఉన్నారు. అయినా సరే.. ఎన్నికల ఫలితాల విషయానికి వచ్చేసరికి ఆయన మోడీకి అనుకూలంగానే చెప్పడం విశేషం. దేశంలో మోడీ పట్ల అసంతృప్తి ఉన్నది తప్ప, ప్రజల్లో ఆగ్రహం లేదని పీకే అంటున్నారు.
ఏపీ ఎన్నికల విషయానికి వస్తే.. జగన్ ఓటమి తథ్యం అనేది ఆయన మాట. గతంలో చెప్పినదే ఇప్పుడు కూడా చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినా.. ఎన్నికలకు ముందు 175 గెలుస్తామని, పోలింగ్ పూర్తయిన తర్వాత.. 151కంటె ఎక్కువ గెలుస్తామని అంటున్నారు. కానీ పీకే మాటలో తేడాలేదు. ప్రశాంత్ కిశోర్ కు ఏమీ తెలియదు. ఆయన క్షేత్రస్థాయిలో పనిచేయడంలేదు.. అని కూడా జగన్ పీకే గురించి ఎద్దేవా చేశారు. అయినా ఆయన మాత్రం.. జగన్ ఓటమినే మళ్లీ మళ్లీ ఖరారు చేస్తుండడం విశేషం.
పీకేది అదే మాట : జగన్ కు ఓటమే!
Sunday, December 22, 2024