పిన్నెల్లి రివర్స్ : జగన్ ట్రైనింగ్ ఫలితమేనేమో!

Saturday, July 20, 2024

మాచర్ల నియోజకవర్గం మొత్తాన్ని ఒక దశాబ్దానికి పైగా తన కనుసన్నల్లో శాసించిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి.. ఎలాంటి నాయకుడు అనే సంగతి ప్రపంచంలో అందరికీ తెలుసు. పోలింగ్ నాడు.. పాల్వాయిగేటు బూత్ కు వెళ్లి.. అక్కడి ఈవీఎంను ఆయన ఏ విధంగా ధ్వంసం చేశారో.. ఆ వీడియోలను ప్రపంచం మొత్తం చూసింది. అయినా సరే.. ఆయన పోలీసులు తనను ఆ ఘటన గురించి విచారించినప్పుడు.. ‘అబ్బెబ్బే నాకేం తెలియదు. అసలు నేను పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రానికి వెళ్లనే లేదు’ అని చెబుతున్నారట. పోలీసులు అడిగినప్పుడు.. ఆ రోజు (పోలింగ్ రోజు!!) నా వెంట గన్ మెన్లు లేనేలేరని, తాను ఈవీఎంను పగలగొట్టనే లేదని, ఆ బూత్ లో తెదేపా ఏజంటు నంబూరి శేషగిరి రావు ఎవరో తనకు తెలియనే తెలియదని అని పోలీసులకు విచారణలో భాగంగా పిన్నెల్లి చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి.

అయితే అడ్డగోలుగా ఎన్నికల సంఘం ఏర్పాటుచేసిన సీసీ టీవీ ఫుటేజీలో తన దుర్మార్గం స్పష్టంగా రికార్డు అయిన తర్వాత కూడా ఈ రేంజిలో, అసలు తాను పాల్వాయి గేటు వెళ్లనే లేదని చెప్పేంతటి ధైర్యం పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డికి ఎలా వచ్చింది? అనే సందేహం ప్రజలకు కలుగుతోంది! వీడియో సాక్ష్యం లేకపోతే.. ఎవరు ఎలా మాట్లాడినా చెల్లుతుంది. అయినా సరే.. ప్రపంచమంతా చూసిన తన దుర్మార్గం యొక్క వీడియో గురించి ఆలోచన లేకుండా ఇలాంటి అబద్దాలు ఆయన ఎలా చెప్పగలిగారు అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

అయితే ఇలాంటి సమాధానాలు చెప్పడం గురించి.. జనంలో వేరే రకం చర్చలు నడుస్తున్నాయి. వైసీపీ అధినేత, ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లి.. పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డితో సుదీర్ఘంగా సమావేశం అయిన తర్వాత మాత్రమే ఆయనకు ఈ మాత్రం ధైర్యం వచ్చిందని ప్రజలు భావిస్తున్నారు. జగన్ శిక్షణలోనే.. తన నేరం రెడ్ హ్యాండెడ్ గా దొరికినదే అయినా సరే.. తనకు సంబంధం లేదని బుకాయించడం పిన్నెల్లి అలవాటు చేసుకున్నారని అంటున్నారు. జగన్ కూడా 45 వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి.. ఏ రకంగా అయితే.. తనకు ఏ సంబంధమూ లేదని కోర్టు ఎదుట బుకాయిస్తున్నారో.. అదే రీతిగా.. వీడియో ఫుటేజీలో దొరికిపోయినాసరే.. విచారణలో తనకు సంబంధం లేదని మాత్రమే చెప్పాలని పిన్నల్లికి జగన్ ట్రైనింగ్ ఇచ్చారని, అందుకే ఆయన ఇలా చెబుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి పిన్నెల్లి బుకాయింపు అబద్ధాలు ఆయనను కాపాడుతాయో లేదో వేచిచూడాలి. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles