రాజకీయ నాయకులకు ఉండే తెలివితేటలన్నీ వారి రాజకీయ వ్యూహాలకోసమే సరిపోతుంటాయి. వారిలో ధారాళంగా మాట్లాడగలిగే నాయకులు చాలా తక్కువగా ఉంటారు. భాషమీద పట్టు, వివిధ అంశాల మీద పట్టుతో సామెతలను, జాతీయాలను కూడా అవసరాన్ని బట్టి చక్కగా వాడుతూ మాట్లాడగలిగేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. వారి స్ఫూర్తితో కొందరు అలాంటి టేలెంట్ ను నేర్చుకునే ప్రయత్నంలో ఉంటారు. కానీ చాలామంది.. ఆ టేలెంట్ ఉన్నవాళ్లతో స్క్రిప్టు రాయించుకుని దాన్ని చూసుకుంటూ చదివేస్తారు.. లేదా.. చూసుకుంటూ మాట్లాడేస్తారు. తద్వారా సామెతలు, సరదా విషయాల్లో తమకు తిరుగులేదని కూడా అనిపించుకుంటారు.
జగన్మోహన్ రెడ్డి స్క్రిప్టును మక్కీకి మక్కీ చదివే టైపు నాయకుడు. పది పదాలు ఉన్న ఒక వాక్యం చదవాలంటే.. ఆయన కనీసం అయిదుసార్లయినా చేతిలోని స్క్రిప్టు పేపరు చూడాల్సిందే. లేకుంటే చదవలేరు. కానీ.. ఆయనకు కూడా సామెతలను ప్రయోగించాలని కోరిక. అందుకే చంద్రబాబును తిట్టడానికి ప్రత్యేకమైన సామెతలను తన స్క్రిప్టు రైటర్లతో రాయించుకున్నారు. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కదా. వేల కోట్ల రూపాయల ఆస్తులు, సంపాదన ఉన్నవాడు కదా.. కనీసం బుర్ర ఉన్న స్క్రిప్టు రైటర్లను పెట్టుకోవచ్చు కదా! ఆ రైటర్లకే సామెతల అర్థాలు తెలియకుండా వంకరగా వాడుతూ ఉంటే.. దాని వలన పరువుపోయేది జగన్ కే గానీ, స్క్రిప్టు రైటర్లకు కాదు కదా! జగన్ కు మరీ ఇంత తలాతోకాలేని విధంగా సామెతలు వాడుతున్నాడే అని జనం నవ్వుకుంటారు కదా..! ఆయన వాడుతున్నవేంటో చూద్దాం..
చంద్రబాబును నమ్మడం అంటే.. అంటూ ప్రారంభించి.. ‘‘పులినోట్లో తలపెట్టడం, చేపలకు కొంగలను కాపలాపెట్టడం, దొంగచేతికి తాళాలు ఇవ్వడం..’’ లాంటి వ్యవహారం అని జగన్మోహన్ రెడ్డి వర్ణిస్తున్నారు. అక్కడికి తాను చాలా క్రియేటివ్ గా చంద్రబాబును తిట్టేసినట్టు ఆయన భావించి ఉండవచ్చు. కానీ ఆ సామెతలు ఒకదానికీ ఒకటీ సంబంధమే లేదు.
పులినోట్లో తలపెట్టడం అంటే- సాహసించి ఒక పనిని చేయడం. ఎంతకైనా తెగించి కార్యసాధనకు వెళ్లేవాడిని అలా అంటారు.
చేపలకు కొంగలను కాపలా పెట్టడం- అంటే ఆ కాపలా కొంగలే చేపల్ని తినేస్తాయి అని అర్థం.
దొంగచేతికి తాళాలు ఇవ్వడం- అంటే, దానివలన సొత్తు చోరీ కాకుండా చాలా భద్రంగా ఉంటుంది అని అర్థం.
ఈ మూడింటికీ అసలు సంబంధమే లేదు. చంద్రబాబును తిట్టడం జగన్ లక్ష్యం గనుక.. ఆయన ఉద్దేశానికి కొంగల సామెత సరిపోవచ్చు. కానీ మిగిలిన సామెతలు చంద్రబాబుకు పొగడ్తల లాంటివే.
చంద్రబాబు పులినోట్లో తలపెట్టి అయినా రాజధాని నిర్మించి తీరుతాడు అంటే.. ఆయన తన కష్టాలు తాను పడి ఎలాగైనా నిధులు తెచ్చి కడతాడు అని అర్థం. అలాగే దొంగచేతికి తాళాలు అంటే.. చంద్రబాబు దొంగే గానీ.. ఆయనను ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రం చాలా భద్రంగా ఉంటుందని అర్థం.. ఇలా అర్థాలు తెలియకుండా, తెలుసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడే బదులుగా జగన్మోహన్ రెడ్డి తన స్క్రిప్టు రైటర్లకు కాస్త బుర్ర ఉన్న వాళ్లతో ట్రైనింగు ఇప్పించచవ్చు కదా.. అని ప్రజలు అనుకుంటున్నారు.