మద్యం, ఇసుకలపై తేలుకుట్టిన దొంగలాగా జగన్!

Tuesday, April 15, 2025

ఒక దొంగ ఒక ఇంట్లో దొంగతనానికి వచ్చాడు. తన నైపుణ్యాలు అన్నీ ఉపయోగించి.. ఇనప్పెట్టె కూడా తెరిచాడు. చీకట్లో లోపల చేయిపెట్టాడు. తేలు కుట్టింది! పాపం ఏం చేయగలడు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు అచ్చం అలాగే ఉంది. ఎన్ డి ఏ కూటమి నుంచి మూడు పార్టీల నాయకులు గాని, అటు కాంగ్రెస్ నుంచి చెల్లెలు వైఎస్ షర్మిల గాని ప్రత్యేకంగా లేవనెత్తుతున్న కొన్ని విమర్శల విషయంలో ఆయన నోరు మెదపలేకుండా ఉన్నారు. ఒకవైపు వారు అవే అంశాలను పట్టుకుని పదేపదే విమర్శిస్తూ రెచ్చిపోతుండగా, కనీసం మాత్రంగా కూడా జగన్ గానీ, ఆయన దళం లోని ఏ ఒక్క కీలక నాయకుడు గాని జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారంటే  అర్థం చేసుకోవచ్చు. అలాగని కీలకమైన ఆయా అంశాలపై విమర్శలను జగన్ పట్టించుకోనట్లుగా నటిస్తూ ఇగ్నోర్ చేసినంత మాత్రాన అవి ప్రజలు కూడా పట్టించుకోరు అనుకోవడం భ్రమ. ప్రజలు కూడా పట్టించుకుంటే గనుక ఎన్నికలలో ఎదురు దెబ్బలు తగలడం ఖాయం.

ఇంతకు ఆ విమర్శలు ఏమిటి? ఏ విషయాల్లో జగన్ కనీసం జవాబు చెప్పలేకపోతున్నారు?
మద్యం, ఇసుక వ్యాపారాలకు సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద ఎన్డీఏ కూటమి నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పైగా మద్యం ఇసుక రెండు వ్యవహారాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను సమానంగా ప్రభావితం చేసే విషయాలు. ఆ వ్యాపారాల్లో ఎలాంటి దందా నడుస్తున్నదో, ఎలాంటి దోపిడీ జరుగుతున్నదో ప్రజలందరికీ స్వయంగా తెలుసు. ప్రతిపక్షాలు విమర్శించడం వలన ఇంకొద్దిగా ఆ పాయింట్ హైలైట్ అవుతుందే తప్ప.. ప్రజలకు తెలియని సంగతులు మాత్రం కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ రెండు అంశాల విషయంలో కౌంటర్ ఇవ్వకపోతే తానే నష్టపోతారు. ఆయన తరఫున ఇసుక వ్యాపారానికి సంబంధించి- చంద్రబాబు ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు దోచుకున్నారు అంటూ ఏదో ఒకటి మసిపూసి మారేడు కాయ చేయడానికి కొందరు వైసిపి నాయకులు ప్రయత్నించారు గానీ, సరైన ఫలితం రాబట్టలేకపోయారు. ప్రజలు తమ మాటలు నమ్మడం లేదని అర్థమై ఊరుకుండిపోయారు.


అదేవిధంగా వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి జగన్ పాత్రను సామాన్యుల పరిధిలో కూడా చర్చకి పెడుతూ వైఎస్ షర్మిల ఏకధాటిగా విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ప్రొద్దుటూరు సభలో చిన్నాన్నను చంపిన హంతకులు బయటే ఉన్నారని.. వారికి మద్దతు ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలకు తెలుసునని ఏదో నర్మగర్భంగా రెండు మాటలు చెప్పడం మినహా ఆ తర్వాత ఏ సభలోనూ జగన్ మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడడం లేదు. తమ నిర్దోషిత్వాన్ని ప్రజల ఎదుట నిరూపించుకోవడానికి ఆయన ప్రయత్నించడం లేదు. ఇది కూడా పాలక పక్షానికి ఎన్నికలలో బాగా నష్టం చేసే అంశంగా మారుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.

ప్రధానంగా ఇసుక, మద్యం వ్యాపారాలలో వేల కోట్ల రూపాయలు జగన్ మరియు ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కాజేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఆ పార్టీ మాత్రం నోరు మెదపకుండా, తేలు కుట్టిన దొంగలాగా నిశ్శబ్దం పాటిస్తున్నదని విమర్శలు వస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles