చూసి నేర్చుకో’ జగన్ గురించి అనుకుంటున్న జనం!

Thursday, December 4, 2025

‘చూసి.. నేర్చుకో..’ అనే డైలాగు పెళ్లిపుస్తకం సినిమా ద్వారా బాగా పాపులర్ అయింది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఈ నీతినే చెప్పాలేమో అని తెలుగు ప్రజలు అనుకుంటున్నారు. రాజకీయ నాయకులు అన్నాక, తమ గురించి తాము సొంత ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వడం తప్పేం కాదు. కానీ.. సొంత ప్రచారం కాస్తా శృతిమించి సొంత డప్పుగా, సొంత డబ్బాగా మారడం.. అంతకంటె దారుణంగా తయారై ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల నష్టంగా పరిణమించడం అనేది చాలా దారుణం. ఇలాంటి వాటి విషయంలో.. జగన్మోహన్ రెడ్డికి ఉండే ఆశ చాలా ఎక్కువ. అలాంటి జగన్ ఇప్పుడు.. ఏపీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను ‘చూసి.. నేర్చుకో’వాలని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీకి ప్రచారం కల్పించుకునేలా రంగుల పిచ్చి, పేర్ల పిచ్చి విషయంలో లోకేష్ ఆదర్శంగా కొన్ని ప్రమాణాలను సెట్ చేస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు.

వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం సికెదిన్నె హైస్కూలులో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్మార్ట్ కిచెన్ ను ప్రారంభించారు. దీనికి అనుబంధంగా ఇతర పాఠశాలలకు మధ్యాహ్నం భోజనం సరఫరా చేసేందుకు వాహనాలను కూడా ప్రారంభించారు. అయితే.. ఈ వాహనాల నిర్వాహకులు ముందుగానే.. వాటికి పసుపురంగు వేయించి ఉంచారు. నిజం చెప్పాలంటే.. అది తెలుగుదేశం పార్టీ పతాకం ఉండే పసుపు రంగు కూడా కాదు. కొంచెం భిన్నమైన పసుపు రంగు. అయినా సరే.. నారా లోకేష్ జిల్లా కలెక్టరుతో మాట్లాడి.. ఆ పసుపు రంగు మార్పించాలని సూచించారు. రాజకీయ పార్టీలను సూచించే రంగులు, విద్యారంగంలోకి చొరబడకుండా చూడాలని లోకేష్ కలెక్టరుతో అన్నారు. విద్యాశాఖకు ప్రత్యేకించిన గ్రీన్, బ్రౌన్, రెడ్ రంగులు మాత్రమే వాడాలని చెప్పారు. లోకేష్ ఇలా పురమాయించడం గమనించిన వారికి, ఆ స్వభావం పట్ల గౌరవం ఏర్పడుతోంది.

ఎందుకంటే.. జగన్ పరిపాలన కాలంలో పార్టీ రంగులు రాష్ట్రానికంతా పులమడమే పనిగా పెట్టుకున్నారు ఆయన. ఆఫీసులకు పిల్లలకు ఇచ్చే బ్యాగులకు అన్నింటికీ తన పార్టీ రంగులే వేయించారు. ఇదంతా పెద్ద వివాదంగా మారిన తర్వాత.. కోర్టులు మొట్టికాయలు వేసిన తర్వాత.. వందల కోట్లు ఖర్చు పెట్టించి.. ఆఫీసులకు వేసిన రంగులు మార్పించారు. రంగులు మాత్రమే కాదు.. పథకాలకు పెట్టే పేర్లు కూడా తన పేరు, తన తండ్రి పేరు మాత్రమే పెట్టుకుంటూ పోయారు. ప్రజల భూములు సర్వే చేయిస్తూ సరిహద్దు రాళ్లుగా.. తన బొమ్మ ఉండే రాళ్లను నాటించడానికి వందల కోట్లరూపాయలు తగలేశారు. కానీ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి పిచ్చి ఎక్కడా కనిపించడం లేదు. విద్యారంగంలో సర్వేపల్లి రాధాకష్ణన్, అబ్దుల్ కలాం, డొక్కా సీతమ్మ వంటి పేర్లు వినిపిస్తున్నాయి. పసుపు రంగు వద్దు అని స్వయంగా లోకేష్ చెప్పే పరిస్థితి. ఇలాంటి మంచి స్వభావాన్ని వారిని చూసి.. జగన్ నేర్చుకోవాలని ప్రజలు హితవు చెబుతున్నారు. రంగుల పిచ్చి, పేర్ల పిచ్చి తగ్గించుకోవాలని అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles