2016లో ప్రధాని మోడీ నోట్ల రద్దును ప్రకటించిన తర్వాత.. డిజిటల్ చెల్లింపులు, ఆన్ లైన్ నగదు లావాదేవీలు అనేవి అనివార్యంగా ప్రజల జీవితాల్లో భాగం అయ్యాయి. నిరక్షరాస్యులు కూడా మొబైల్ ఫోను ద్వారా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. కిళ్లీ బంకులో ఒక సిగరెట్టు, ఒక కిళ్లీ కూడా డిజిటల్ పేమెంట్ ద్వారా కొనే పరిస్థితి మన దేశంలోకి వచ్చింది. ఆస్థాయిలో చిరు వ్యాపారాల్లోకి టెక్నాలజీ ప్రవేశించినా కూడా.. యావత్ దేశంలో.. కేవలం నగదు ద్వారా మాత్రమే లావాదేవీలు, క్రయవిక్రయాలు జరిగిన వ్యాపారాలు రెండే రెండు. అవి గత అయిదేళ్లలో.. ఏపీలో లిక్కర్ విక్రయాలు, ఏపీలో ఇసుక విక్రయాలు. చాలా స్పష్టంగా.. అక్రమాలు, అవినీతి పర్వాలు యథేచ్ఛగా చేయడానికి మాత్రమే.. ఇలా నగదు లావాదేవీలను ఆ రెండు వ్యాపారాల్లో జగన్ దళాల్లోని వారు ప్రోత్సహించారు. లిక్కర్ వ్యాపారంలో కొన్ని నెలల కిందట డిజిటల్ చెల్లింపులను కూడా అనుమతించారు. కానీ.. ఒక బిల్లు మీద పదుల సంఖ్యలో లారీలను తరలించడం వంటి అక్రమాలకు యథేచ్ఛగా తోడ్పడిన ఇసుక వ్యాపారంలో నిన్నటిదాకా కేవలం నగదు లావాదేవీలు మాత్రమే పెట్టారు.
ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ రెండు వ్యాపారాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు తీసుకువచ్చింది చంద్రబాబునాయుడు ప్రభుత్వం. ప్రజలకు కేవలం ఇసుక తవ్వకం ఖర్చులు, సీనరేజి ఖర్చులు మాత్రం చెల్లిస్తే చాలు.. అంటూ ఉచితంగా ఇసుక సరఫరా విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం సోమవారం నాడు ప్రారంభించింది. ఉచిత ఇసుక సరఫరా కోసం ఖర్చులకు చెల్లించాల్సిన ప్రతి రూపాయిని డిజిటల్ చెల్లింపుల ద్వారా మాత్రమే స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి ఏర్పాటు వలన అక్రమ దందాలకు 90 శాతం అడ్డుకట్ట వేసినట్లు అవుతుంది.
వైసీపీ పాలనలో ఆ పార్టీ స్థానిక నాయకులు వేల కోట్ల రూపాయల అక్రమార్జనలకు హేతువైన ఇసుక వ్యాపారంలో ఈ స్థాయి పారదర్శకతను తీసుకురావడాన్ని ప్రజలు తప్పకుండా గుర్తిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు ఉచిత ఇసుక విధానం వల్ల.. నిర్మాణాలు చేపట్టే వారికి ఇసుక ధరలో వ్యత్యాసం స్పష్టంగా తెలిసి రావడం మాత్రమే కాదు. అంతకంటె స్పష్టంగా డిజిటల్ చెల్లింపుల రూపంలో ఉండే పారదర్శకత కూడా అనుభవంలోకి వస్తుందని, చంద్రబాబునాయుడు ప్రభుత్వం అనుసరిస్తున్న అవినీతి రహిత విధానాల మీద గౌరవం ఏర్పడుతుందని అంటున్నారు.
ఈ పారదర్శకత ను ప్రజలు గుర్తిస్తారు!
Sunday, December 22, 2024