మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ నాయకులతో నిర్వహించిన తొలి సమావేశంలో.. చర్చ మొత్తం కేసుల చుట్టూతానే సాగిపోయింది. పాపం.. 11 సీట్లకు పరిమితమై, ఇప్పటికీ పార్టీ కీలక నాయకులు ఒక్కరొక్కరుగా గుడ్ బై కొట్టేస్తున్న తరుణంలో డీలాపడిపోతున్న జగన్మోహన్ రెడ్డి.. పార్టీకి అత్యున్నత విధాన నిర్ణాయకమండలి ఈ పీఏసీ మాత్రమే అని ప్రకటిస్తూ 34 మందితో కమిటీ ఏర్పాటుచేశారు. ఈ కమిటీ తొలిసారిగా సమావేశం అయినప్పుడు.. సాధారణ పరిస్థితుల్లో అయితే.. పార్టీ భవిష్యత్తును ఘనంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలు మాట్లాడుకుని ఉండాలి. కానీ.. వెన్నాడుతున్న పాపాల ఫలితంగా.. ఆ సమావేశం చర్చ మొత్తం తమ పార్టీ నాయకుల మీద నమోదు అవుతున్న కేసులు, వాటినుంచి బయటకు రావడానికి తీసుకోవాల్సిన చర్యలు, అవసరమైతే సుప్రీం వరకు వెళ్లి పోరాడడం వంటి వాటి మీదకే మళ్లిపోయింది. ప్రత్యేకించి లిక్కర్ కుంభకోణంలో కీలకంగా ఉండి వసూళ్ల నెట్ వర్క్ ను నడిపించిన రాజ్ కసిరెడ్డి పోలీసులకు దొరికిపోయిన తర్వాత.. జగన్ ఆలోచనలు మొత్తం ఆ కేసు మీదికే మళ్లాయి.
అమాయకుడైన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కూడా కక్షపూరితంగా ఈ కేసులో ఇరికిస్తున్నారంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు ఆయన వ్యక్తం చేసిన కారణం వింటే ఎవ్వరికైనా నవ్వొస్తుంది. ‘తన కాలేజీ రోజుల్లో చంద్రబాబునాయుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదిరించారట. కాబట్టి ఆయన పెద్దిరెడ్డి కుటుంబం మీద కక్ష పెంచుకున్నారట. లేని పోని ఆరోపణలు సృష్టించి తప్పుడు సాక్ష్యాలతో వారిని ఇబ్బంది పెడుతున్నారట.’ ఇదీ జగన్ చెబుతున్న లాజిక్.
చంద్రబాబునాయుడు వయస్సు ఇప్పుడు 75 ఏళ్లు. యాభయ్యేళ్ల కంటె పాతకాలం నాటి యూనివర్సిటీ తగాదాలను మనసులో పెట్టుకుని చంద్రబాబునాయుడు ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబాన్ని వేధిస్తున్నారని నింద వేయడాన్ని మించిన తలాతోకాలేని వాదన మరొకటి ఉండదని జనం వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే.. చంద్రబాబునాయుడు ఇప్పటికే 15 ఏళ్లపాటూ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేయాలని ఆయన అనుకుని ఉంటే.. ఈ ఒకటిన్నర దశాబ్దపు ముఖ్యమంత్రిగా ప్రస్థానంలో అలాంటి ఉదాహరణలు ఎన్నో చూపించాలి. ఇంతకాలం గడిచాక ఇప్పుడెందుకు టార్గెట్ చేస్తారు.. అనేది ప్రజల సందేహం.
పైగా తన పగ, కక్ష తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అయితే.. కొడుకు మిథున్ రెడ్డిని కేసులో ఇరికించడం వల్ల అది ఎలా చల్లారుతుంది? పెద్దిరెడ్డినే ఈ వయసులో జైలుకు పంపితే కదా.. పగ చల్లారుతుంది.. అని కూడా ప్రజలు అడుగుతున్నారు. మోకాలికీ బోడిగుండుకీ ముడిపెట్టే చందంగా పసలేని విమర్శలు చేసి అభాసు పాలు కాకుండా.. లిక్కర్ కుంభకోణం తన మెడకు చుట్టుకునేలోగా ఏం చేయాలో జగన్ ఆలోచించుకుంటే మంచిదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
తమరి లాజిక్ కు జనం నవ్త్వుతున్నారు జగన్!
Monday, December 8, 2025
