దేశం మొత్తాన్ని నివ్వెరపోయేలా చేసిన మూడున్నర వేల కోట్ల రూపాయల అతిపెద్ద లిక్కర్ కుంభకోణంలో.. మద్యం కంపెనీలను బెదిరించి, తమ మనుషుల్ని అక్కడే నియమించి.. వారి నుంచి తమ వాటాలను నగదురూపంలో వాటాలుగా వసూలు చేసిన నెట్వర్క్ నడిపించిన కేటుగాడు కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి అయితే.. అసలు జగన్ గద్దె ఎక్కిన తర్వాత.. మద్యం వ్యాపారంలో ఈ రకంగా వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికి అవకాశం ఉన్నదని గుర్తించి, అందుకు తగిన పాలసీరూపకల్పనకు కీలకంగా మార్గదర్శనం చేసిన మాస్టర్ మైండ్ వైసీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఇప్పుడు ఆయన పరారీలోకి వెళతారా? సుప్రీం కోర్టుకు వెళతారా? అనే చర్చ ప్రజల్లో నడుస్తోంది. సుప్రీం కోర్టుకు వెళ్లడం గ్యారంటీనే అయినప్పటికీ.. అప్పటిదాకా పోలీసులు అరెస్టు చేయకుండా ఉండాలంటే.. ఆయన దేశం విడిచి వెళ్లడం కూడా గ్యారంటీ అని పలువురు సందేహిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. అత్యంత కీలకంగా చక్రం తిప్పిన ముఖ్య నాయకుల్లో మొట్టమొదటగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరే చెప్పుకోవాలి. జగన్ పాలన కాలంలో జరిగిన రెండు అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటి లిక్కర్ కాగా, రెండోది ఇసుక. తమాషా ఏంటంటే.. వేలాది కోట్లరూపాయలు కాజేసిన ఈరెండు కుంభకోణాలు కూడా మిథున్ కనుసన్నల్లోనే జరిగాయి. ఇసుక కుంభకోణం అయితే ఏకంగా ఆయన తండ్రి మంత్రిత్వ శాఖలోనే చోటు చేసుకుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అప్పట్లో నెంబర్ టూ స్థాయిలో చక్రం తిప్పిన నాయకుడు గనుక దందా సునాయాసం అయింది. ఇసుక దందాను తండ్రి స్వయంగా చూసుకుంటే.. కొడుకు పైకి కనిపించకుండా మాస్టర్ మైండ్ గాను, ఫైనల్ గా వసూళ్లను పుచ్చుకుని అంతిమ లబ్ధిదారు అయిన బిగ్ బాస్ కు అందించే ఫైనల్ పాయింట్ గాను వ్యవహరించారు.
మద్యం కేసులో గతంలో సిట్ అధికారులు సాక్షిగా విచారణకు పిలిచినప్పుడు మిథున్ రెడ్డి చాలా చాలా ప్రగల్భాలు పలికారు. తమ కుటుంబం మీద రకరకాల కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నట్టుగా ప్రభుత్వం మీద నిందలు వేశారు. ఏ ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేరని పేర్కొన్నారు. మద్యం కుంభకోణం విషయం విలేకరులు అడిగినప్పుడు.. మద్యం వ్యాపారం అంతా చాలా పారదర్శకంగా జరిగిందని.. ఆ వ్యవహారంలో అసలు కుంభకోణమే లేదని, లేని కుంభకోణంలో తన పాత్ర గురించి అడిగితే ఏం చెప్పగలనని చాలా తెలివిగా సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ.. ఈ కుంభకోణంలో కీలక పాత్రధారులు ఒక్కరొక్కరుగా అరెస్టు అవుతూ రిమాండులోకి వెళ్లడం, వారు సిట్ విచారణలో వెల్లడిస్తూ వచ్చిన వివరాలను బట్టి మిథున్ రెడ్డి పాత్ర నిర్ధరణ అయింది.
ఆయనను నిందితుడిగా కూడా చేర్చారు. ఆ తర్వాతి విచాకరణలో ఆయన పాత్ర మరింత ఎక్కువనని తేలింది. ఈ నేపథ్యంలో ఆయనకు ముందస్తు బెయిలు ఇవ్వరాదని ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా చాలా గట్టిగానే హైకోర్టులో వాదించారు. మిథున్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేయడంతో ఇప్పుడు ఆయన అరెస్టు తప్పదని, ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. సుప్రీం తీర్పు వెల్లడించేలోగా విదేశాలకు వెళ్లే అవకాశం ఉందని కూడా అనుకుంటున్నారు.
