ఆరకంగా పెద్దిరెడ్డి జగన్ కంటే ముదురు!

Sunday, December 22, 2024

అధికారం తన చేతిలో ఉండాలేగానీ.. తన స్థాయిలో విర్రవీగే వారు మరొకరు ప్రపంచంలో ఉండరని జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు నిరూపించి చూపించారు. అధికారం జగన్ చేతిలో ఉండాలే గానీ తాను ఆయనను మించి విర్రవీగగలనని ఆయన క్యాబినెట్ లోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిరూపిస్తున్నారు. ప్రజలను నిషేధించడంలో, చిన్నచూపు చూడడంలో ప్రభుత్వ ఆస్తులను తమ సొంత సొత్తులాగా వాడుకోవడంలో జగన్మోహన్ రెడ్డి శైలి ఒక ఎత్తు అయితే అంతకు పదింతలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహార సరళి విమర్శల పాలవుతోంది.

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తన నివాసం చుట్టూ ఉండే రోడ్లలో ప్రజల రాకపోకలను నిషేధించారు. ఆ రోడ్లు ఆయన సొంత సొత్తు కాదు. అయినా సరే ఆ రోడ్లలో ఎవ్వరూ తిరగకుండా ఉండేలాగా ఎక్కడికక్కడ పోలీసు ఔట్ పోస్టులు ఏర్పాటు చేసి భారీ బారికేడ్లు పెట్టించి ప్రజలను రానివ్వకుండా చేశారు. అమరావతి ప్రాంతాన్ని మొత్తం స్మశానం లాగా మార్చేసిన జగన్మోహన్ రెడ్డి కేవలం తన ఇంటి చుట్టూ ఉండే రోడ్లలో మాత్రం.. తాను ఇంటి నుంచి కదిలితే కారులో వెళ్లే రోడ్లలో మాత్రం.. కోట్లు ఖర్చుపెట్టి సుందరీ కరణ పనులు చేయించారు. పూల మొక్కలు గట్రా నాటించారు. ఇలా తన ఇల్లు కాదు కదా తన చుట్టూ ఉండే రోడ్లన్నీ కూడా తన సొత్తు మాత్రమే అన్నట్టుగా జగన్ పరిపాలనలో తన ముద్ర చూపించారు.

నాయకుడు ఏ దారిలో నడిస్తే బంట్లు కూడా అదే దారిలో కదా నడవాలి కాబట్టి, జగన్ అనుసరించిన కబ్జాల బాట తమకు అందరికీ అనుసరణీయం అని మొదటగా గ్రహించిన వారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి! తిరుపతిలోని ఆయన నివాసానికి వెళ్లే దారిని ఆయన పూర్తిగా తన కబ్జాలోనే ఉంచేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డబ్బులతో తన ఇంటికి వెళ్లే దారిలో సిసి రోడ్డు వేయించుకున్నారు పెద్దిరెడ్డి. ఆ పిమ్మట రోడ్డుకు రెండు వైపులా నరసంచారం జరగకుండా పెద్దపెద్ద గేట్లు పెట్టించి తాళాలు వేసుకున్నారు. తన సొంతదే అయినట్టుగా వ్యవహరించేవారు. దీనికి వ్యతిరేకంగా జనసేన, విపక్షాలు ఆందోళన చేసిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. గేట్లు తెరిపిస్తామని మునిసిపాలిటీ వాళ్లు ఆందోళన కారులకు సమాధానం ఇచ్చారు.
అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోర్టుకు వెళ్లడం జరిగింది. ప్రభుత్వం స్టే ఇవ్వడంతో గేట్ల తొలగింపు ఆగిపోయింది. రాకపోకలను మాత్రం అడ్డుకోవడానికి వీల్లేదని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అయితే పాత గేట్లు తాళాలు తీసేసిన తర్వాత హైకోర్టు తీర్పును అంతవరకే గౌరవించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తన ఇంటి ఎదుటిగా రోడ్డుకు అడ్డంగా మరో పెద్ద గేట్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోడ్డును ప్రజల సౌకర్యార్థం వాడుకులోకి తేవాల్సిందే అని హైకోర్టు చెప్పిన ఆదేశాలకు దిక్కు లేకుండా పోయింది. ఇదివరకు తాళాలు తెరిచిన చోట ప్రజలు వెళ్లినవెంటనే మధ్యలో పెద్దిరెడ్డి ఏర్పాటు చేసిన ఇంకొక పెద్ద గేటు కనిపించాక మౌనంగా వెనుతిరుగుతున్నారు. పెద్దిరెడ్డి అరాచకాలను దోపిడీపర్వాన్ని అడిగే నాధుడే లేడా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles