‘బండ్లు ఓడలు అవుతాయి.. ఓడలు బండ్లవుతాయి’ అనేది సామెత. రాజకీయాలలో ఓడలు బండ్లు కావడం అంటే ఇదే! వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం.. జిల్లాలో నాయకులందరి కదలికలను కూడా తన కనుసన్నలతో నియంత్రించిన పెద్దిరెడ్డి కుటుంబం ఇప్పుడు తమ సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టడం కూడా కష్టంగా మారిపోతున్నది. వారు ఇన్నాళ్లు తమ రాజకీయ ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారిని ఎన్ని రకాలుగా వేధించారో.. అంతకంత బదులు తీర్చుకోలేకపోయినా తమ నిరసనలను తెలియజేయడానికి ప్రజలు ఎగబడుతున్నారు. పుంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి పరామర్శకు వెళ్లిన ప్రస్తుత ఎంపీ మిధున్ రెడ్డికి అక్కడ చేదు అనుభవం ఎదురైంది. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు రాళ్లు విసురుకొని ఘర్షణలకు దిగడం ఉద్రిక్తతలకు దారితీసింది.
పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసానికి పుంగనూరుకి వెళ్లారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తమను విపరీతంగా ఎంపీ వేధింపులకు గురి చేశారంటూ, ఆయనకు తమ నిరసనలు తెలియజేయడానికి ఎన్డీఏ కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలు రెడ్డప్ప ఇంటి వద్దకు చేరుకున్నారు. వారి మీద అక్కడ మోహరించి ఉన్న వైసీపీ దళాలు రాళ్లు విసిరి కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. కూటమి పార్టీల కార్యకర్తలు అందరూ ‘మిథున్ రెడ్డి గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. తమ మీద రాళ్లదాడికి సమాధానంగా వాళ్లు కూడా రాళ్లు విసిరారు. ఇరువర్గాలు రాళ్లు, కుర్చీలు విసురుకుంటూ ఘర్షణలకు దిగారు. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఇరు వర్గాలను చెదరగొట్టవలసి వచ్చింది.
నిజానికి ఎంపీ మిథున్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కూడా అడుగుపెట్టడానికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉండడం.. తాజా పరిస్థితి గా కనిపిస్తోంది. కొన్నాళ్ల కిందట ఆయన పుంగనూరు పర్యటన పెట్టుకుంటే తిరుపతిలోని నివాసం నుంచి పోలీసులు కదలనివ్వలేదు. ఆయన పర్యటన ఉద్రిక్తతలకు దారితీస్తుందని వెళ్లడానికి వీల్లేదు అని చెప్పి హౌస్ అరెస్ట్ చేశారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్వయంగా తిరుపతిలోని మీడియా వారందరికీ ఫోన్లు చేసి తనను ఇలా నిర్బంధించారంటూ వాళ్ల వాళ్ల చానల్స్ లో ప్రసారం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకున్నారు. వైసీపీ పాలన సాగిన ఐదు సంవత్సరాల కాలంలో.. మీడియా వాళ్ళు ఫోన్ చేస్తే కనీసం ఫోన్ ఆన్సర్ చేసే అలవాటు కూడా లేని మిథున్ రెడ్డి.. స్వయంగా అందరికీ ఫోన్లు చేసుకుని తనని నిర్బంధించినట్లుగా వార్తలు వేయాలని కోరడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మొత్తానికి ఆయన కొన్ని వారాల విరామం తర్వాత ఇవాళ పుంగనూరు కి వెళ్లారు గానీ ప్రజల స్పందనలో మాత్రం మార్పు లేదు. నిన్నటికి నిన్న పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న తంబళ్లపల్లె నియోజకవర్గానికి వెళితే అక్కడ కూడా ఇలాంటి ప్రతిఘటన ఎదురైంది. చెప్పుకోవడానికి చిత్తూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దిరెడ్డి ఫ్యామిలీ మాత్రమే గెలుపొందింది. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలిచారు. కానీ ఏ ఒక్కరూ తమ నియోజకవర్గాలలో అడుగుపెట్టే పరిస్థితి లేకపోవడం, వారిపట్ల ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతూ ఉండడం గమనార్హం.
ఊర్లో అడుగుపెట్టలేకపోతున్న పెద్దిరెడ్డి ఫ్యామిలీ!
Saturday, January 18, 2025