ఆయన రాజకీయ సమాధికి పవన్ ఎత్తుగడ!

Monday, October 28, 2024

పవన్ కల్యాణ్ తన పాతశత్రువు విషయంలో చాలా వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఆయనను దెబ్బకొట్టడం మాత్రమే కాదు కదా.. ఏకంగా రాజకీయంగా సమాధి చేసేయడానికే స్కెచ్ వేశారు. ఒకసారి కొడితే మళ్లీ ఇక లేవకూడదన్నట్టుగా.. గట్టి దెబ్బే కొట్టడానికి సిద్ధమయ్యారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మీద, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. జిల్లా కలెక్టరుకు నాగరాణికి ఫిర్యాదు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనాంశంగా చర్చకు వస్తోంది. పవన్ కల్యాణ్ చాణక్య తెలివితేటలకు, వ్యూహాత్మక అడుగులకు ఇది ఉదాహరణ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

గ్రంథి శ్రీనివాస్ 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో అక్కడ పోటీచేసిన పవన్ కల్యాణ్ ను గ్రంథి శ్రీనివాస్ దాదాపు 8వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడించారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ కూడా ఎన్నడూ గ్రంథి శ్రీనివాస్ గురించి అంత సీరియస్ గా పట్టించుకున్నట్టు కనిపించలేదు. ఆయన మీద నిందలతో పెద్దగా విరుచుకుపడిన దాఖలాలు కూడా లేవు.
సీన్ కట్ చేస్తే- 2024 ఎన్నికలు వచ్చాయి. వైసీపీ తరఫున సిటింగ్ ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ మళ్లీ పోటీచేశారు. కానీ పవన్ కల్యాణ్ నియోజకవర్గం మార్చుకుని పిఠాపురానికి వెళ్లారు. భీమవరం ను మాత్రం జనసేన పార్టీకే తీసుకున్నారు. ఆ పార్టీ తరఫున అక్కడ పులపర్తి రామాంజనేయులు పోటీచేశారు. గ్రంథి మీద ఏకంగా 67వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయన సాధించిన మెజారిటీ.. 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ సాధించిన మొత్తం ఓట్ల కంటె కూడా ఎక్కువే. అలా గ్రంథి ఓడిపోయారు.

మళ్లీ సీన్ కట్ చేస్తే.. గ్రంథి శ్రీనివాస్ కొన్నాళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆ పార్టీకి దాదాపుగా గుడ్ బై కొట్టేసినట్టే అని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. గ్రంథి తెలుగుదేశంలో చేరుతారనే ప్రచారం కూడా లోకల్ గా జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో.. పేదల ఇళ్లకోసం గత ప్రభుత్వం 140 ఎకరాల భూమిని సేకరించిన ప్రక్రియలో మార్కెట్ ధరకంటె అధికధరలకు ప్రభుత్వం కొనేలా చేసి.. డబ్బు కాజేశారంటూ గ్రంథిపై పవన్ కల్యాణ్ కు ఫిర్యాదులు వెళ్లాయి. ఆయన ఈ విషయాన్ని జిల్లా  కలెక్టరు నాగరాణికి ఫిర్యాదు చేసి దర్యాప్తు చేయాలని పురమాయించారు. ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ మీద బురద మరక పడింది. పేదల ఇంటి స్థలాల కొనుగోళ్లలో భారీగా దోచుకున్నట్టుగా పవన్ స్వయంగా ఫిర్యాదు చేశారు. తద్వారా.. మరక అంటిన గ్రంథిని తెలుగుదేశం పార్టీ కూడా తమలో చేర్చుకోకుండా.. ఆయన లాక్ చేశారని అంతా అనుకుంటున్నారు. ఆ రకంగా గ్రంథి రాజకీయ భవిష్యత్తుకు పవన్ సమాధి కట్టేశారని అనుకుంటున్నారు.

ReplyForwardAdd reaction

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles