ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ దేశంలో అమలవుతున్న కుహనా లౌకికవాదంపై ఒక రేంజిలో విరుచుకుపడ్డారు. సెక్యులర్ ముసుగులో హిందూ మతానికి జరుగుతున్న ద్రోహాన్ని ఆయన తీవ్రస్థాయిలో ఎండగట్టారు! సెక్యులర్ పేరుతో ఇతర మతాల వారిని ఓటు బ్యాంకులుగా మార్చుకోవడానికి హిందూత్వానికి ద్రోహం తలపెట్టే చవకబారు రాజకీయ నాయకుల నుంచి.. ఒక రకమైన మాయలో ఉన్నట్టుగా.. ఒక్కో మతం పట్ల జరిగిన అపచారాల విషయంలో ఒక్కోరీతిగా స్పందించే న్యాయస్థానాల వరకు కూడా పవన్ కల్యాణ్ నిశిత విమర్శల బారినుంచి తప్పించుకోలేదు. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి తాను కట్టుబడి ఉంటానని, అందుకోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైనా తాను సిద్ధమేనని అనడం ద్వారా.. పవన్ కల్యాణ్, అందుకోసం ఎంతటి వారితోనైనా, ఎంత పెద్ద వ్యవస్థలతోనైనా ఢీకొనడానికి తాను సిద్ధం అనే స్పష్టమైన సంకేతాలు పంపారు.
ఈ దేశంలో హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా చాలా దాడులు జరుగుతున్నాయని.. రాముడిని తిడితే నోరెత్తకూడదు.. సరస్వతిని తిడితే నోరెత్తకూడదు.. లౌకికవాదం అంటారు. కానీ ఇస్లాం దేవుళ్లను తిడితే మాత్రం అతిగా స్పందిస్తారు అంటూ పవన్ విరుచుకుపడ్డారు. సనాతన ధర్మాన్ని అంతం చేయాలని కొందరు అనుకుంటున్నారంటూ పవన్ కల్యాణ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు.
మతం గురించి మాట్లాడుకోవాలంటేనే మనం భయపడే స్థితికి వచ్చామని, ధైర్యం, వీరత్వమే సమాజ వికాసానికి మూలం అని పవన్ అన్నారు. హిందూ సమాజాన్ని కులాలు ప్రాంతాల వారీగా విభజించారని, హిందువులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నం అయిందని పవన్ పిలుపుఇచ్చారు.
సనాతన ధర్మానికి జరుగుతున్న ద్రోహంలో తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిని కల్త్తీ చేయడం అనేది చాలా చిన్న విషయం అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా తిరుమల పోటులో కూర్చుని చేత్తో కల్తీ లడ్డూలు తయారుచేశారని తాము చెప్పడం లేదని, కల్తీ దోషులెవరో తేల్చాలని, నిజాయితీగా విచారణ జరిపించాలని కోరుతోంటే.. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నట్టుగా జగన్ అండ్ కో భయపడుతున్నారని పవన్ విమర్శించడం విశేషం. మీ పాపాలను స్వామివారే నిగ్గుతేలుస్తారని పవన్ హెచ్చరించడం విశేషం. మొత్తానికి రాజకీయ నాయకులు తమకు అన్ని మతాల వారి ఓట్లు కూడా అవసరం అనే ఆలోచనతో.. మతపరమైన విషయాల్లో చాలా నర్మగర్భంగా స్పందిస్తుంటారు. కానీ పవన్ కల్యాణ్ ఎంతో తెగువతో.. హిందూ మతానికి జరుగుతున్న ద్రోహం పట్ల నిర్దిష్టంగా నిర్మొగమాటంగా స్పందించడం.. పోరాటాన్ని ప్రకటించడం పట్ల హిందువుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.