గత ఎన్నికలలో మొదటిసారిగా రెండు చోట్ల నుండి అసెంబ్లీకి ఫోన్ చేసి ఓటమి చెందడంతో రాజకీయంగా ఒక విధంగా అవహేళనకు గురయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి వ్యూహాత్మకంగా నియోజకవర్గాలను ఎంపిక చేసుకొంటున్నట్లు తెలుస్తున్నది. ఒక వంక ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టుదలతో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేసినా ఎలాగైనా ఓడించాలని ఎత్తుగడలు వేస్తున్నారు.
మరోసారి పోటీచేసి ఓడితే ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదని గ్రహించిన పవన్ కళ్యాణ్ ఈ సారి ఇప్పటి వరకు పోటీ విషయమై పెదవి విప్పక పోయినా పకడ్బందీగా వ్యూహం రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది. ముందుగా పొత్తుల విషయం తేలితే గాని పోటీ గురించి ప్రకటించే అవకాశం లేదు.
కేవలం బిజెపితో కలసి పోటీ చేయాలా? టిడిపిలో కలసి పోటీ చేయాలా? బిజెపి, టిడిపిలతో కల్సి ఉమ్మడిగా పోటీ చేయాలా?… అనే విషయం ఇప్పట్లే తేలే అవకాశం లేదు. ఒంటరిగా పోటీ చేసినా, గతంలో వలే అన్ని సీట్లలో పోటీచేసి పరాభావంకు గురయ్యే బదులు, బలమైన సీట్లలోనే పోటీ చేయాలనీ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
ఎమ్యెల్యేగా పోటీ చేసినా సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడం, టిడిపితో పొత్తు పెట్టుకొంటే చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా చేరినా మద్దతుదారులు ఆమోదించే అవకాశం లేకపోవడంతో లోక్ సభకు పోటీ చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
ఎంపీగా గెలుపొందితే కేంద్ర మంత్రివర్గంలో చేసి కీలక మంత్రిత్వ శాఖ చేపట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా వై ఎస్ జగన్ కు బలమైన రాయలసీమ నుండే పోటీచేసి, వైసిపిని ఓడించడంలో కీలక భావించే విధంగా వ్యూహరచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అనంతపూర్ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేసే ఆలోచనలు ఉన్నట్లు చెబుతున్నారు.
పైగా, ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ మద్దతుదారులు సహితం పెద్ద సంఖ్యలో ఉన్నారు. వైసీపీ సహితం పలు ప్రతికూలతలు ఎదుర్కొంటున్నది. జనసేన కార్యక్రమాలు అనేకం ఈ జిల్లా నుండి ప్రారంభిస్తూ వస్తున్నారు. ఇక్కడ అన్ని అంశాలు కలిసి వచ్చే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
ఎన్నికలలో పోటీపై లోతయిన కసరత్తు చేస్తున్నారని, పొత్తుల విషయం ఖరారు అయిన తర్వాతనే తమ నిర్ణయం ప్రకటిస్తారని జనసేన వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇక్కడి నుండి ఎంపీగా పోటీ చేస్తూనే గోదావరి జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుండి ఎమ్యెల్యేగా కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ విధంగా చేయడం ద్వారా రెండు ప్రాంతాలలో ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.
గతంలో పోటీ చేసిన భీమవరం, గాజువాకల నుండి తిరిగి పోటీ చేసే అవకాశాలు కనబడటం లేదు. ఈ పర్యాయం కాకినాడజిల్లా పిఠాపురం నుండి పోటీ చేస్తారని ఒక కధనం వినిపిస్తున్నది. అందుకనే అక్కడి నుండి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను పోటీకి దింపే ప్రయత్నాలు జగన్ చేస్తున్నారు. అయితే ఆయన వైసిపిలో చేరి, పోటీకి సుముఖత వ్యక్తం చేస్తారా అన్నది అనుమానమే.
ముద్రగడ ముందుకు రాని పక్షంలో కాకినాడ ఎంపీ వంగా గీతను ఇక్కడి నుండి అసెంబ్లీకి పోటీ చేయించే అవకాశం ఉన్నదని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. ఆమె కూడా అసెంబ్లీకి పోటీ చేయడం పట్లనే ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.