వచ్చే ఎన్నికలలో పొత్తు గురించి జనసేన శ్రేణులలో ఒక వంక సందిగ్ధత నెలకొనగా, ప్రస్తుతం పొత్తుల విషయం గురించి చర్చించకుండా ఎన్నికల సన్నాహాలపై దృష్టి సారించాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ సహచరులకు సూచించారు. ఆ మేరకు జనంలోకి పార్టీని తీసుకు వెళ్లేందుకు కసరత్తు చేస్తున్నారు. అందుకోసమే సొంతంగా ఒక ప్రచార రధాన్ని కూడా సమకూర్చుకున్నారు.
ఒక వంక టీడీపీ, జనసేన, బీజేపీ కలసి ఉమ్మడిగా పోటీ చేస్తే అధికారంలో ఉన్న వైసీపీని ఓడించడం సులువు కావచ్చని వాదనలు వినిపిస్తుండగా, అందుకు టీడీపీ నుండి కూడా సానుకూల సంకేతాలు లభిస్తున్నాయి. అయితే బీజేపీ నాయకులు టిడిపి విషయంలో తమ వైఖరి స్పష్టం చేయడం లేదు. కేవలం జనసేనతోనే తమ పొత్తు కొనసాగుతుందని తరచూ ప్రకటనలు చేస్తున్నారు.
బిజెపితో పొత్తు ఏర్పరచుకొని రెండేళ్లవుతున్నా, ఉపఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నా ఇప్పటి వరకు జనసేనతో కలసి ఉమ్మడిగా ఎటువంటి రాజకీయ కార్యక్రమాలకు బిజెపి సిద్ధం కావడం లేదు. దానితో జనసేన శ్రేణులలో ఆ పార్టీ పట్ల కొంత అసహనం వ్యక్తం అవుతున్నది. దానితో బిజెపితో సంబంధం లేకుండా టిడిపితో కలసి ముందుకు వెళ్లాలనే ఆలోచనలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన సందర్భంగా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ను పిలిపించుకొని మాట్లాడంతో ఆ తర్వాత బిజెపి పట్ల పవన్ వైఖరిలో కొంత సానుకూలత వ్యక్తం అవుతున్నది. అందుకనే కొంతకాలం పాటు పొత్తుల విషయం అటుంచి, ఎన్నికల సన్నాహాలు పట్ల ద్రుష్టి సారిస్తున్నారు.
రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా తన సత్తా చాటాలని పట్టుదలగా ఉన్న పవన్ కళ్యాణ్ పొత్తులతో సంబంధం లేకుండా ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్నారు. ఓ వైపు కమిటైన సినిమాలను పూర్తి చేసి సాధ్యమైనంత తొందరగా ఎన్నికల ప్రచారంలోకి పూర్తిస్థాయిలో దిగాలని భావిస్తున్నారు.
ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ప్రచారం కోసం ఆయన ప్రచారం వాహనం కూడా సిద్ధమైంది. దానికి వారాహి అనే పేరు కూడా పెట్టారు. ఈ వాహనానికి సంబంధించిన ఫోటోలను వీడియోలను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఎన్నికల సమరానికి వారాహి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
వారాహి అంటే దుర్గాదేవి సప్త మాతృకల్లో ఒకరు… వారాహి. ఇదే పేరును వాహనానికి పెట్టారు. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాల్లో ఉంది. ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారని జనసేన నేతలు చెబుతున్నారు. ఆ ఆలోచనతోనే వాహనానికి వారాహి అని పేరు పెట్టినట్లు జనసేన పార్టీ ప్రకటించింది.
ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారం వేళ పవన్ సాధ్యమైనంత సమయం ప్రజల మధ్యనే ఉండేలా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. మరోవైపు ఎన్నికలకు కొన్ని నెలల ముందు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్.. ఇందుకోసం ఈ కొత్త వాహనాన్ని సిద్ధం చేశారనే చర్చ జరుగుతోంది.
గతంలో వలె రాష్ట్రం మొత్తం కాకుండా తమకు బలమైన నియోజకవర్గాలు, ప్రాంతాలను గుర్తించి, అక్కడనే ప్రచారంపై దృష్టి సారిస్తూ వచ్చే ఎన్నికలలో గణనీయ సంఖ్యలో ఎమ్యెల్యేలను గెలిపించుకోవడంపై ఇప్పుడు దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తున్నది. అందుకు టిడిపితో పొత్తు విషయంలో తొందర పడవద్దని ప్రధాని మోదీ ఇచ్చిన సలహను పాటిస్తూనే తమదైన వ్యూహంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.