2024 ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓట్ల చీలిక లేకుండా చూస్తామని చెప్పడం ద్వారా టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి కోసం ప్రయత్నిస్తున్నట్లు కొంతకాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇస్తున్న సంకేతం కొద్దీ రోజుల క్రితం ఆయన విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కాగానే తారుమారైంది. ప్రధాని ఏమి మాట్లాడారో, ఏమి సూచించారో కానీ ఆ తర్వాత జనసేన ధోరణిలో మార్పు వెల్లడైనది.
జనసేన, టిడిపి పొత్తు ఉండబోదని ఒక వంక బిజెపి నాయకులూ చెబుతూ ఉండగా, అన్ని సీట్లలో తామే పోటీ చేస్తామని జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. దానితో జనసేనతో పొత్తు సాధ్యం కాదనే నిర్ధారణకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూల్ జిల్లా పర్యటన సందర్భంగా ఇవే తనకు చివరి ఎన్నికల కావచ్చని అంటూ ప్రజలపై `సెంటిమెంట్’ అస్త్రం ఉపయోగించే ప్రయత్నం చేశారు.
చంద్రబాబు నాయుడు స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ వద్దకు వెళ్లి, ఇద్దరం కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అధికార వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేద్దామని ప్రతిపాదించడంతో ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి – జనసేన ఉమ్మడిగా ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్లు గత నెలలో స్పష్టమైన సంకేతం ఇచ్చారు.
దానితో గాబరా పడిన వైసిపి నాయకత్వం ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటనను ఉపయోగించుకొని కేంద్రంలోని బిజెపికి తామెంత సన్నిహితమో చాటి చెప్పే ప్రయత్నం చేశారు. ఒక విధంగా ఏపీలో తిరిగి టిడిపి అధికారమలోకి రాకుండా అడ్డుకోవడానికి బిజెపి కట్టుబడి ఉన్నదని, జగన్ అధికారంలో కొనసాగడమే రాజకీయంగా తమకు ప్రయోజనకరమనే సంకేతం తన విశాఖ పర్యటన సందర్భంగా ప్రధాని ఇచ్చారు.
దానితో అధికార వైసిపిలో రాష్ట్రంలో తమకు రాజకీయంగా తిరుగు లేదనే సంబరాలు వెల్లడవుతూ వస్తున్నాయి. అయితే ఇంతలో ఏమైందొ, ఆదివారం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ తన స్వరాన్ని పెంచి, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తామంటూ వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తోన్నారని, వాళ్లు గెలుస్తూ ఉంటే తాము చూస్తూ కూర్చుంటామా? అంటూ ప్రశ్నించడం రాజకీయ వర్గాలలో కలకలం రేపుతున్నది.
ముఖ్యంగా తమ వ్యూహాత్మక ఎత్తుగడలు ఎక్కడ కూలిపోతాయో అన్న ఆందోళన వైసిపి, బిజెపి వర్గాలలో వ్యక్తం అవుతున్నది. పవన్ కళ్యాణ్ ఎత్తుగడ ఏమిటో అర్ధం కావడం లేదని చికాకు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రధాని మోదీ పట్ల ఎంతో గౌరవం వ్యక్తం చేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీకి చెప్పకుండానే వైసీపీని దెబ్బ కొడతా అని ధిక్కార ధోరణిలో మాట్లాడటం కూడా వారికి గందరగోళం కలిగిస్తున్నది.
“నేను ఆంధ్రుడిని. ఇక్కడే పుట్టాను. ఇక్కడే తేల్చుకుంటాను. నా యుద్ధం నేనే చేస్తాను. వైసీపీని ఢీ కొట్టడానికి ప్రధానితో చెప్పి చేయాలా? నేనే సరిపోతాను” అంటూ ప్రకటించడం ద్వారా వైసిపిని ఎదుర్కోవడంలో తన వ్యూహాలు తనకు ఉన్నాయని, బిజెపి మాయాజాలంలో చిక్కుకో వలసిన అవసరం లేదని హెచ్చరికను కూడా ఇచ్చినట్లు అయింది.
ఇప్పటం గ్రామంలో జనసేన బహిరంగ సభకు స్థలం ఇచ్చారనే కోపంతో రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల వెడల్పు పేరుతో స్థానికుల ఇళ్లను కూల్చివేయడం గురించి ప్రస్తావిస్తూ ఈ విషయంలో తానే పోరాటం చేస్తానని, ఢిల్లీకి వెళ్లి సాయం అడగనని పవన్ స్పష్టం చేశారు. ఒక విధంగా కొందరు బీజేపీ నేతలు వైసీపీ ఏజెంట్ల వలే వ్యవహరిస్తున్నారని జరుగుతున్న ఆరోపణల పట్ల తన అసహనాన్ని పవన్ వ్యక్తం చేసినట్లు అయింది.
వైసీపీ రాజకీయ పార్టీనా? ఉగ్రవాద సంస్థా? అని ప్రశ్నించడం ద్వారా కొందరు బిజెపి నాయకులు ఆ పార్టీకి సన్నిహితంగా వ్యవహరిస్తూ ఉండడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన్నట్లయింది. రాజకీయం వైసీపీయే చేయాలా? తాము చేయకూడదా? అని ప్రశ్నించడం ద్వారా వైసిపి – బిజెపి కుమ్ముక్కు రాజకీయాలకు పాల్పడితే ఏమి చేయాలో తనకూ తెలుసని చెప్పకనే చెప్పిన్నల్తయింది.
వైసీపీని దెబ్బ కొట్టే విషయంలో ప్రధానికి చెప్పి చేయనని తేల్చి చెప్పడం ద్వారా తాను ప్రధాని చెప్పిన విధంగా.. బీజేపీ నిర్దేశించిన విధంగా పని చేయననే స్పష్టమైన సంకేతం కూడా ఇచ్చారు. 2024 ఎన్నికలతో వైసీపీని గద్దె దించడం తధ్యమని స్పష్టం చేస్తూ ఆ ఎన్నికల తర్వాత తాము కూడా వైసీపీ నాయకుల ఇళ్లను తాము కూడా చట్టబద్ధంగానే కూడగడతామని హెచ్చరించారు. వైసీపీ ఫ్యూడలిస్టిక్ గోడలు బద్దలు కొడతాం అని తేల్చి చెప్పారు.