జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోటా మొదటి సారి తాను ముఖ్యమంత్రి అవుతాను అనే మాట వినిపించింది. “మీరు గట్టిగా అనుకుంటే నేను ముఖ్యమంత్రి అవుతా” అంటూ సత్తెనపల్లిలో ఆదివారం జరిగిన కౌలు రైతు భరోసా యాత్ర సభలో పాల్గొంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. “మీ అందరి గుండెచప్పుడు బలంగా ఉంటే నేను సీఎం అవుతా” అని పేర్కొన్నారు.
అదేసమయంలో, రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని కూడా స్పష్టం చేశారు. అందుకోసం కట్టుబడి ఉన్నానని చెప్పారు. వైసిపి నేతలు తనపై చేస్తున్న దుష్ప్రచారాలు తిప్పికొడుతూ ఏ పార్టీకో అమ్ముడు పోయే ఖర్మ తనకి పట్టలేదని తేల్చి చెప్పారు. పెన్షన్ డబ్బులు కాజేసే నీచత్వం తనకి లేదని అంటూ అధికార పార్టీ నేతలను ఎద్దేవా చేశారు. తాను తప్పుచేస్తే తన చొక్కా పట్టుకుని అడగమని ప్రజలను కోరారు. అదీకాకుండా,
అధికారం చూడని కులాలకు అధికారం ఇచ్చి చూడాలని పేర్కొనడం ద్వారా ఏపీలో ఇప్పటి వరకు అధికారం అనుభవిస్తున్న కులాలను కాకుండా ఇతరులను ఎన్నుకోవాలని బలమైన సంకేతం ఇచ్చినట్లయింది. “వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు నాకు వదిలిపెట్టండి. నేను చూసుకుంటాను. గెలుపు కోసం నేను ముందు నిలబడతా. నాకు మీరు మద్దతు ఇవ్వండి” అంటూ అభ్యర్ధించారు.
వచ్చే ఎట్టి ఎన్నికలలో వైసీపీ తిరిగి అధికారంలోకి రాదనీ జనసేన పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పైగా, ఆ పార్టీని తిరిగి అధికారంలోకి రాకుండా చూసుకొనే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు.తనపై వైసిపి నేతలు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ వైసీపీ నేతలు మాట్లాడే మాటలన్నీ పనికిమాలినవని కొట్టిపారేసారు బాధ్యత లేకుండా మాట్లాడే వైసీపీ నేతలకు బలంగా సమాధానం చెబుతా అని హెచ్చరించారు. “వాళ్లు నన్ను ఎంత తొక్కాలని చూసిన నేను అంత పైకి లేస్తా” అని తేల్చి చెప్పారు.
అంబటిపై మండిపాటు
స్థానిక శాసన సభ్యుడు, రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు తనపై చేస్తున్న విమర్శలను పరోక్షంగా ప్రస్తావిస్తూ కాపు కులాన్ని అడ్డుపెట్టుకొని కొంతమంది నాయకులు ఎదుగుతున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. తన దగ్గర ఒక్క రూపాయి వున్నా కూడా తాను ప్రజలకే దానం చేస్తానని చెబుతూ తనకు సినిమాలే ఆధారం అని, అంబటిలా కాదని ఎద్దేవా చేశారు.
తాను ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తా అని తేల్చి చెప్పారు. .అంబటిది శవాల మీద పేలాలు ఏరుకునే మనస్తత్వం అందు ధ్వజమెత్తారు. తాను ఎప్పుడు మాట్లాడినా తనను తిట్టడానికి వైసీపీ గాడిదలు బయటికి వస్తాయని మండిపడ్డారు.
రాష్ట్రంలో రౌడీయిజం తగ్గాలని చెబుతూ కొత్త ప్రభుత్వం రాకపోతే ఏపీ రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారుతుందంటూ స్పష్టం చేశారు. తనను వీకెండ్ పొలిటీషియన్ అంటున్నారని పేర్కొంటూ తనకు వారానికి ఒకసారి వస్తేనే తట్టుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు.
తాను త్వరలోనే తన ప్రచార రథం వేసుకొని ఆంధ్రప్రదేశ్ రోడ్లపై తిరుగుతానని చెబుతూ ఎవడు ఆపుతాడో చూద్దాం అంటూ సవాల్ చేయారు. “వారాహిని అడ్డుకొని చూడండి నేనంటే ఏంటో చూపిస్తా” అని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు.
జనసేనలోకి వైసీపీ కీలక నేత
ఇలా ఉండగా, వైసిపి కీలక నేత ఒకరు జనసేనలో చేరడం కలకలం సృష్టిస్తున్నది. రాజోలుకు చెందిన బొంతు రాజేశ్వరరావును పవన్ కల్యాణ్ ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బొంతు రాజేశ్వరరావు రాజోలు నియోజకవర్గం నుంచి ఆయన గత రెండు ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
బొంతు రాజేశ్వరరావు జగన్ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేశారు. ఇటీవల ఆయన వైసీపీకి రాజీనామా చేయగా.. జనసేనలో చేరుతారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. ఈ సందర్భంగా బొంతు రాజేశ్వరరావుతో విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గురాన అయ్యలు, పి.గన్నవరం నియోజకవర్గానికి చెందిన ఏఎంసీ ఛైర్మన్ కొమ్మూరి కొండలరావు జనసేన కండువా కప్పుకున్నారు.