చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లో 21 మంది ఎమ్మెల్యేల బలం కలిగి ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ మొత్తం ఐదు మంత్రి పదవులు అడుగుతున్నారనేది అందరికీ తెలిసిందే. అయితే ఏయే శాఖలు అడుగుతున్నారనేది కూడా కీలకమైన విషయం. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఢిల్లీలో ఇండియా టుడే విలేకరితో మాట్లాడుతూ తనకు డిప్యూటీ ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉందని వెల్లడించారు. హోం శాఖ నిర్వహిస్తూ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ కోరికగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తన పార్టీకి చెందిన సహచర ఎమ్మెల్యేల కోసం ఆయన ఏయే మంత్రిత్వ శాఖలను డిమాండ్ చేస్తున్నారనేది కీలకంగా ఉంది.
సాధారణంగా ఆర్థిక శాఖ, పరిశ్రమల శాఖ, గనులు భూగర్భవనరుల శాఖ, నీటిపారుదల శాఖ, పంచాయితీరాజ్ శాఖ తదితర వ్యవహారాలను కీలకమైన శాఖలుగా నాయకులు పరిగణిస్తూ ఉంటారు. వీటి లో రెండింటి కోసం పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా చంద్రబాబును డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఆర్థిక శాఖ, పరిశ్రమల శాఖలు కీలకమైనవే అయినప్పటికీ వాటిని తెలుగుదేశం పార్టీని తన వద్ద ఉంచుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాతి ప్రాధాన్యం ఉన్న నీటిపారుదల శాఖ, గనుల శాఖను పవన్ అడుగుతున్నట్టుగా తెలుస్తోంది.
కానీ ఇలాంటి శాఖలు అడగడం వెనుక ఉన్న సీక్రెట్ వేరే అని పలువురు అంటున్నారు. ఆర్థిక శాఖ నిర్వహణ చాలా కష్టం. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వనరుల నేపథ్యంలో.. ప్రతినెల వందల వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావం, దానికి సంబంధించిన మేనేజిమెంట్ టెక్నిక్స్ ఈ శాఖ ప్రధాన విధి. అలాగే పరిశ్రమల శాఖ కూడా కీలకమైనది. చంద్రబాబునాయుడు కొత్త పరిశ్రమలు తీసుకువచ్చి పెద్దసంఖ్యలో ఉద్యోగాలకు అవకాశం ఏర్పాటు చేస్తానని హామీలు ఇచ్చిన నేపథ్యంలో ఈ శాఖ కూడా కత్తిమీద సాము లాంటిది. పరిశ్రమలు తీసుకురాలేకపోతే.. ఆ శాఖలో అన్నీ వైఫల్యాలే కనిపిస్తాయి. అదే సమయంలో నీటిపారుదల, గనుల శాఖల పరిస్థితి వేరు. ఈ శాఖల్లో బోలెడు పనులు జరుగుతుంటాయి. బాధ్యతలు తక్కువ. పోలవరం వంటిది పూర్తిచేస్తే చాలు ఇంకేమీ చేయకపోయినా ఫుల్ మార్కులు కొట్టేయొచ్చు. పోలవరానికి ఎటూ కేంద్రం మద్దతు ఈసారి కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకే పవన్ తన పార్టీ వారికోసం ప్రధానంగా ఈ రెండు శాఖలు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
పవన్ డిమాండ్లు హోం, నీటిపారుదల, గనులు!
Wednesday, January 22, 2025