తిరుమలలోని దేవదేవుడి పట్ల జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది ఎవరు? పాపం చేసినది ఎవ్వరు? వైసీపీ పాలకులు, వారి పాలన కాలంలో.. టీటీడీ పదవుల్లో ఉన్నవారు కదా? మరి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష ను 11 రోజుల పాటు చేయడానికి నిర్ణయించుకున్నారు ఎందుకు? ఇలాంటి సందేహాలు ప్రజలకు కలగడం సహజం. కానీ.. ఆయన సంకల్పంలో ఒక అద్భుతమైన స్ఫూర్తి ఉంది. పవన్ కల్యాణ్ సూటిగా చెప్పలేదు గానీ.. జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటు వేసి.. ఆ పార్టీ అయిదేళ్లపాటు రాజ్యం చేయడానికి కారణమైన రాష్ట్రప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
‘‘దేవదేవా.. నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమని వేడుకుంటా. భగవంతుడిపై విశ్వాసం పాప భీతి లేనివారే ఇలాంటి అకృత్యాలకు ఒడిగడతారు. నా బాధేమిటంటే- తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్ళథలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం. కనిపెట్టినా నోరు మెదపకపోవడం. నాటి రాక్షస పాలకులకు భయపడి మిన్నకుండిపోయారా? అనిపిస్తుంది. వైకుంఠధామంగా భావించే తిరుమల పవిత్రతకు వేదాచారాలకు ధార్మిక విధులకు కళంకం తెచ్చేవిధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించింది. ఇక లడ్డూ ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురించేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకునే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నం అయింది. ధర్మో రక్షతి రక్షితః’ అని పవన్ కల్యాణ్ ఎక్స్ లో పోస్టు చేశారు.
పవన్ చెప్పినట్టుగా హిందూ ధర్మం పాటించే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలో లేదో చెప్పలేం గానీ.. 2019లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఒక్క చాన్స్ అనే మాట నమ్మి, ఆయన అధికారంలోకి రావడానికి కారకులు అయిన హిందువులందరూ కూడా ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం చేసుకోవల్సిందే. జగన్ సర్కారు దేవదేవుడి పట్ల చేసిన పాపాలు అన్నింటిలో.. ఆయనను గెలిపించిన వారందరికీ భాగం ఉంటుంది.. అని ప్రజలు అనుకుంటున్నారు. పవన్ లాగా 11 రోజుల దీక్ష చేయకపోయినా.. కనీసం ఆ పాపాన్ని గుర్తిచేసుకుని.. క్షమించాల్సిందిగా దేవదేవుడి ఎదుట లెంపలు వేసుకోవాలి.