మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన నాయకులతో తాడేపల్లిలో సమావేశం అయ్యారు. ఓడిపోయి ఆరునెలలు గడచిపోయాయి.. మరో రెండు మూడు వారాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన జిల్లాల యాత్ర జరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో.. పార్టీ నాయకులు ఏ రకంగా పోరాట ప్రణాళికతో కార్యచరణ సిద్ధం చేసుకోవాలో ఆయన ఈ మీటింగులోనైనా చెబుతారని అనుకుంటే.. పప్పులో కాలేసినట్టే. గత ఆరునెలలుగా అంటే.. ఓడిపోయిన తొలినాటినుంచి జగన్మోహన్ రెడ్డి ఏ పాచిపాటనైతే పాడుతూ వస్తున్నారో.. ఇవాళ కూడా అనంతపురం నాయకులకు అదే పాచిపాట పాడి వినిపించారు. అదే అరిగిపోయిన రికార్డును వినిపించారు.
మనం ప్రజలకు చాలా చేశాం.. చంద్రబాబునాయుడు మనకంటె ఎక్కువ చేస్తానని మోసం చేశాడు.. మనల్ని కూడా అలాంటి హామీలివ్వమని చాలా మంది చెప్పారు.. అబద్ధాలు తగవని నేను చెప్పలేదు.. జగన్ చేశాడు గనుక.. చంద్రబాబు కూడా చేస్తాడని అనుకుని ప్రజలు ఓటు వేశారు. తీరా చంద్రబాబు మాట తప్పాడు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడంతా అవినీతి మాఫియా నడుస్తోంది. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా మనమే గెలుస్తాం.. లాంటి పాచిపోయిన డైలాగులను జగన్ మళ్లీ రిపీట్ చేశారు. పలావు కాదు బిర్యానీ ఇస్తానని బాబు అన్నాడు. ఇప్పుడ పలావూ పోయింది బిర్యానీ పోయింది అంటూ జగన్ పాచి వెటకారాలు కూడా జనానికి వెగటు పుట్టిస్తున్నాయి.
కాకపోతే ఆయన ప్రసంగంలో ఒక కొత్త సంగతి కూడా ఉంది. ఇలాంటి సమయంలోనే పార్టీలో యువనాయకత్వం ఎదగడానికి మంచి అవకాశం అని ఆయన అంటున్నారు. కొత్తగా ఇప్పుడు ఎదగడం అనే మాట ఆయన ఎవరిని ఉద్దేశించి చెబుతున్నారో అర్థం కావడం లేదు. ఎందుకంటే.. పార్టీలో దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ నాయకులు పలువురు నెమ్మదిగా జారుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రతిచోటా వైసీపీకి నాయకత్వ కొరత ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని చాలా నాజూకుగా జగన్.. కొత్త నాయకత్వం ఎదగడానికి అవకాశం అని అనడం విశేషం.
ఆయన జనవరిలో జిల్లాల్లో టూర్లు ప్రారంభించనున్న నేపథ్యంలో.. ఎదగాలనుకుంటున్న కొత్త నాయకత్వానికి ఖర్చుల పరంగా ఎలాంటి టార్గెట్లు పెడతారో.. వారు నాయకులకు ఎదిగేలోగా.. ఎలా వారి నడ్డి విరుస్తారో అనే భయాలు చాలా మందిలో కలుగుతున్నాయి.
పలావు బిర్యానీ పాచిపాటలేనా.. మారవా జగన్!
Sunday, January 19, 2025