జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో అనేక రకాల అరాచకాలు, అవినీతి వ్యవహారాలు, దుర్మార్గాలు యథేచ్ఛగా సాగిపోయాయి. వీటిలో కొన్నిటిని అప్పటి నుంచి ప్రజలు గుర్తిస్తూనే వచ్చారు. కానీ ఎవరు గుర్తిస్తే మాత్రం మాకేమిటి అన్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ దళాలు విచ్చలవిడిగా చెలరేగిపోయాయి. అవినీతిని కొనసాగిస్తూ వచ్చాయి. ఇప్పుడు ప్రజల తీర్పుతో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత, వారి ఆక్రమ వ్యవహారాలు ఒక్కొక్క దాని మీద నెమ్మదిగా దృష్టి సారించే పరిస్థితి ఏర్పడుతోంది. అయితే మొదటగా తేల్చబోయే గుట్టు ఏమిటి? పండబోతున్న జగన్ పాపం ఏమిటి? అనేది సహజంగానే ఆసక్తి కరం. చంద్రబాబు నాయుడు మొదటి సంతకం, రెండో సంతకం మీద ఏయే ఫైళ్ల మీద పెడతారు అనేది ఎలాగైతే అందరికీ ఆసక్తికరంగా ఉంటుందో, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి పాపాలలో మొట్టమొదటగా బయటపడబోయేది ఏమిటి? రెండోది ఏమిటి అనే వ్యవహారాలు చర్చనీయాంశంగా ఉంటున్నాయి.
ఇప్పటికే మొదలైన దర్యాప్తులు, ఇతర పరిణామాలను గమనిస్తే జగన్ ప్రభుత్వం చేసిన అవినీతి పాపాలలో మొట్టమొదటగా కొత్త ప్రభుత్వం నిగ్గు తేల్చబోయేది లిక్కర్ కుంభకోణమేనని విశ్వసనీయంగా తెలుస్తున్నది. దాని తర్వాత ఇసుక దందాలలో ఎన్ని వేల కోట్ల స్వాహా పర్వం చోటు చేసుకున్నదో తేలుస్తారని కూడా అమరావతి వర్గాలు చెబుతున్నాయి.
లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు మొదలైంది. ఆ కార్పొరేషన్ ఎండిగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి మీద పలు కేసులను నమోదు చేసిన సిఐడి, ఆయన నివాసాలు ఆఫీసులపై దాడులు నిర్వహించి అనేక కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. రాష్ట్రంలో ఉన్న మద్యం తయారీ కంపెనీలను వైయస్సార్ కాంగ్రెస్ నాయకుల పరం చేయడం ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. ఆ పార్టీ వారికి చెందిన కంపెనీలకు మాత్రమే వేల కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు కట్టబెడుతూ అడ్డగోలుగా దోచుకోవడానికి సహకరించినట్లుగా వాసుదేవ రెడ్డి పై ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి సిఐడి అధికారులు ఇప్పటికే కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వం మారిన తర్వాత అమరావతి లోని తన కార్యాలయం నుంచి కొన్ని కీలక పత్రాలను కంప్యూటర్ హార్డ్ డిస్క్లులను అనధికారికంగా వాసుదేవరెడ్డి తరలించుకుని వెళ్లిపోయినట్లు కూడా ఫిర్యాదులు వచ్చాయి. అన్నింటి మీద కూలంకషంగా దర్యాప్తు సాగుతోంది. మొట్టమొదటిగా ఈ పాపమే బయటపడే అవకాశం కనిపిస్తోంది.
మరో కీలకమైన పాపం ఇసుక దందా! భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్రంలో సాగిన ఇసుక అక్రమాలను నిగ్గుతేల్చాలని చంద్రబాబు నాయుడుకు ఒక లేఖ కూడా రాశారు. ఇసుక తవ్వకాలలో పాల్పడిన అక్రమాలను తేల్చాలని ఆమె కోరారు. ఇప్పటికీ ఇసుక విక్రయాలలో డిజిటల్ లావాదేవీలు లేకపోవడాన్ని ఆమె తప్పు పట్టారు. కేవలం వేల కోట్ల రూపాయలను స్వాహా చేయడం కోసం మాత్రమే ఇలాంటి పద్ధతిని ఇన్నాళ్లూ జగన్ సర్కారు అనుసరించిందని ఆమె ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం దర్యాప్తు సాగిస్తే వాస్తవాలు అన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఆరకంగా మొదటిగా లిక్కర్ స్కాం, తర్వాత ఇసుక దందాల గురించిన జగన్ పాపాలు బయటకు వస్తాయని అంచనాలు సాగుతున్నాయి. వైసీపీలో చాలా మంది పెద్ద నాయకులు కటకటాల వెనక్కు వెళ్తారని అంతా అంటున్నారు.
పహలా నజర్.. ఆ దోపిడీ పర్వం మీదే!
Sunday, December 22, 2024