మజ్లీస్ పార్టీ సా,రధి హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పహల్గావ్ ఉగ్రవాద దాడి తరువాత పాకిస్తాన్ దుందుడుకు పోకడలను చాలా తీవ్రమైన స్వరంతో నిరసిస్తున్నారు. పాకిస్తాన్ మంత్రి, బేనజీర్ భుట్టో కుమారుడు భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పుడు ఓవైసీ చాలా తీవ్రంగా స్పందించారు. ‘నీ తల్లిని చంపినప్పుడు అది ఉగ్రవాద చర్య అవుతుంది.. ఇప్పుడు ఉగ్రవాద చర్య కాకుండా పోయిందా అంటూ నిలదీశారు. ఒకప్పట్లో పాకిస్తాన్ కు ప్రధానమంత్రిగా పనిచేసిన బేనజీర్ భుట్టోను అక్కడే ఉగ్రవాదులు హతమార్చిన సంగతి చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఆ విషయం ఒవైసీ ప్రస్తావిస్తూ ఆమె కొడుకైన పాక్ మంత్రికి హితవు చెప్పారు.
ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ మరో అడుగు ముందుకు వేసి భారతదేశం పాకిస్థాన్ మీద దాడి చేసి పాక్ ఆక్రమిత కాశ్మీరును తక్షణం తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యానిస్తున్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాల గురించి గతంలో ప్రధాని నరేంద్ర మోడీ ఒక సందర్భంలో ప్రస్తావిస్తూ ‘ఉగ్రవాదులను ఇంట్లోకి చొరబడి చంపుతామని’ హెచ్చరించారు. పాక్ ఆక్రమిత కాశ్మీరును ఉగ్రవాద కార్ఖానాగా పాక్ మార్చుకుంటున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో… పిఓకే లోకి ప్రవేశించి మరి ఉగ్రవాదులను మట్టు పెడతాం అనే సంకేతం ఇచ్చేలాగా ప్రధాని ఈ ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రధానికి ఏమి సూచిస్తున్నారంటే.. ‘ఈసారి ఇంట్లోకి చొరబడి చంపడం మాత్రమే కాదు, అక్కడే ఉండాలని’ అంటున్నారు. పిఓకే లో పాక్ సైనికులు పోస్టులను ఖాళీ చేసి వెళ్ళిపోతున్న వార్తలు నిజమైతే చాలా మంచిదని.. మనం తక్షణం ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. మోడీ సర్కారు ఎల్ఓసి వెంబడి ఉగ్రవాదుల స్థావరాలను 2019 లోని నిర్మూలించి ఉండాల్సిందని ఓవైసీ అంటున్నారు. అలాగే పిఓకే మనదేనని భారత్ పార్లమెంటు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేసి, ఈసారి కచ్చితంగా దానిని మనం స్వాధీనంలోకి తెచ్చుకోవాలని ఓవైసీ అంటున్నారు.
అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఇలాంటి తీవ్రమైన స్వరాన్ని వినిపించడం ఆశావాహ పరిణామం. అలాగే దేశంలో ఉన్న ముస్లిం వర్గానికి చెందిన యువతరంలో కూడా పాకిస్తాన్ చేస్తున్న దురాగతాల పట్ల అవగాహన కలిగించడానికి, భారత ప్రతిస్పందనలకు వారందరి నుంచి మద్దతు రాబట్టడానికి ఓవైసీ తన వంతు కృషి చేస్తే దేశం ఆయన ఆయన చిత్తశుద్ధిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
పీఓకే స్వాధీనం తప్పనిసరి అంటున్న ఓవైసీ!
Friday, December 5, 2025
