జగన్ చేతగానితనం రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేస్తోంది. అసలు మన రాష్ట్ర వ్యవహారాలతో సంబంధం లేనివాళ్లు కూడా మనమీద జోకులు వేసే పరిస్థితి ఏర్పడుతోంది. జగన్ ప్రభుత్వం ఎంత చేతగానితనంతో వర్ధిల్లుతున్నదంటే.. విపక్షనాయకులు చిన్న మాటంటే.. వాళ్ల మీద సీఐడీ కేసులు పెట్టి, వాళ్ల ఆస్తులను కూలగిొట్టి నానా బీభత్సాలు చేస్తారు. సాధారణ పౌరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న పోస్టు పెడితే..రాజ్యద్రోహం కేసులు పెట్టి.. వాళ్ల మక్కెలిరగ్గొడతారు. అదే సమయంలో.. పొరుగు రాష్ట్రం వారు.. మన రాష్ట్రం పరువు తీసేలా.. జగన్ సర్కారు చేతగానితనాన్ని నవ్వులపాలు చేసేలా నానా మాటలూ అన్నా కూడా పల్లెత్తు మాట అనరు. కనీసం రోషంగా ఆ వ్యాఖ్యలను ఖండించాలనే జ్ఞానం కూడా వారికి ఉండదు. వారు చెప్పిన మాటలు నిజం కాకపోతే.. వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియజెప్పి తమ పరువు కాపాడుకోవాలనే ధోరణి కూడా వారికి ఉండదు. అవును.. ఇదంతా పోలవరం ప్రాజెక్టు గురించి ఒక సామాన్యుడి ఆక్రోశం.
తెలంగాణ మంత్రి హరీష్ రావు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. వాళ్ల కాళేశ్వర ప్రాజెక్టు గురించి చాలా ఘనంగా చెప్పుకున్నారు. చాలా త్వరగా దానిని తాము పూర్తి చేశాం అని చెప్పుకున్నారు. అదంతా ఓకే.. కానీ పోలవరం ప్రస్తావన తెచ్చి.. మరో అయిదేళ్లు గడిచినా పోలవరం ప్రాజెక్టు పూర్తికాదంటూ ఎద్దేవా చేశారు. జగన్ సర్కారు యొక్క నిష్క్రియాపరత్వం, చేతగానితనానికి ఇది చెంపపెట్టు అనుకోవాలి.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం.. తెలంగాణలోని కేసీఆర్ సర్కారు చాలా స్నేహపూర్వక సంబంధాలు నెరపుతూ ఉంటారు. హైదరాబాదులో అక్రమాస్తుల పరిరక్షణకే ఇలా చేస్తుంటారనే నిందలు మోస్తుంటారు. అక్కడి మంత్రులేమో ఏపీలోని వ్యవహారాలను ఓ ఆట ఆడుకుంటూ ఉంటారు. పనులు సజావుగా జరుగుతున్న పోలవరం నిర్మాణాన్ని దారి తప్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. బలవంతంగా కాంట్రాక్టర్లను మార్పించి.. రకరకాల డ్రామాలు చేసి.. తనకు ఫండింగ్ చేసే సంస్థలకే కట్టబెట్టారనే ఆరోపణలు జగన్ ఎదుర్కొంటూ ఉంటారు. పోనీ నిధులు కాజేయడానికి కాంట్రాక్టర్లను మార్చారు సరే.. పనులైనా చేస్తున్నారా అంటే అదీ లేదు. జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో పోలవరం పూర్తయిపోతుందని అప్పట్లో ఇరిగేషన్ మంత్రి చెప్పారు. అలాంటి హామీలు అనేకం. ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి .. చాలా బాధ్యతారాహిత్యంతో.. ఇప్పట్లో కాదు అని చెబుతుంటారు. అందుకే పొరుగురాష్ట్రంవారు హేళన చేస్తున్నారు.
ఇదే చంద్రబాబు పాలనలో ఎలా ఉండేది. పోలవరం ప్రాజెక్టు అనేది ఏపీ రాష్ట్రానికి ఓ అద్భుతమైన ప్రాజెక్టు అని అందరూ ఒప్పుకుంటారు. ప్రతి సోమవారం పోలవరం ప్రోగ్రెస్ గురించి సాక్షాత్తూ సీఎం ఆధ్వర్యంలో సమీక్ష జరిగేది. డ్రోన్ విజువల్స్ కూడా విడుదల అయ్యేవి. పని ఎంత ప్రోగ్రెస్ అవుతున్నదో.. రాష్ట్రంలోని ప్రతి ప్రజలకూ తెలిసేది. వ్యవహారం పారదర్శకంగా ఉండేది. జగన్ వచ్చాక అసలు పోలవరాన్ని పట్టించుకున్నారా? ఎన్ని సార్లు సమీక్షలు నిర్వహించారు? లెక్క తీస్తేనే.. ఆయన ఆ నిర్మాణాన్ని ఏ రకంగా భ్రష్టు పట్టించారో మనకు అర్థం అవుతుంది.