జగన్మోహన్ రెడ్డిని చూస్తే ప్రజలకు జాలి కలుగుతోంది. అవును మరి.. ఎంతగా వారే ఆయనను ఘోరంగా ఓడించి 11 సీట్లకు మాత్రం పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆ 11 కాస్తా 10 అయ్యే ప్రమాదం ఉన్నదని సంకేతాలు అందుతున్నాయి. అబ్బెబ్బే.. అలాంటిదేమీ లేదు. వైసీపీలో గెలిచిన వారిని తెలుగుదేశంలోకి ఫిరాయింపజేసే ప్రయత్నాలేమీ సాగడం లేదు. కాకపోతే.. ఒక ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఇలాంటి పిటిషన్లలో తీర్పు రావడం వెంటనే జరగకపోవచ్చు గానీ.. ఒకవేళ ప్రతికూల ఫలితం వస్తే.. వైసీపీ బలం 10కి దిగజారుతుంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజవకర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తెలుగుదేశానికి చెందిన గిడ్డి ఈశ్వరిపై 19 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీ సాధించారు. నిజానికి యావత్ ఉత్తరాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ గెలిచిన రెండే సీట్లలో పాడేరు కూడా ఒకటి. అయితే నెలరోజులు గడిచాయో లేదో.. సదరు మత్స్యరాస వారి ఎమ్మెల్యే పదవికి శుభం కార్డు పడుతుందేమో అనే ప్రచారం జరుగుతోంది.
పాడేరు ఎమ్మెల్యేగా విశ్వేశ్వరరాజు ఎన్నిక చెల్లదంటూ అక్కడ ఓడిపోయిన గిడ్డి ఈశ్వరి హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసును హైకోర్టు త్వరగా పరిష్కరిస్తే గనుక.. గిడ్డి ఈశ్వరి పిటిషన్ లో సమర్పించిన ఆధారాలు నిజమైనవని తేలితే.. ఆయనపై వేటు తప్పదు. ఆయనను అనర్హుడుగా చేయడంతో పాటు, తనను గెలిచినట్టు ప్రకటించాలని ఆమె హైకోర్టును కోరారు.
గతంలో తెలంగాణలో కూడా ఇలాంటి కేసులు దాఖలయ్యాయి. కాకపోతే.. అయిదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలు రావడానికి కొంతకాలం ముందే గెలిచిన వారికి ప్రతికూలంగా తీర్పు వచ్చింది. అయినా.. వారు సుప్రీంను ఆశ్రయించి.. ఆ మిగిలిన కొన్ని నెలలు కూడా పదవిలో కొనసాగారు. ఆ రకంగా హైకోర్టులో కేసు వేసి, గెలిచినా కూడా ఎమ్మెల్యేగా ప్రకటింపజేసుకోలేకపోయిన వారిలో డికె అరుణ తదితరులు ఉన్నారు.
కానీ ఇప్పుడు ఏపీలో పరిస్థితులు వేరు. అధికారంలో తెలుగుదేశమే ఉంది. గిడ్డి ఈశ్వరి పిటిషన్ హైకోర్టులో నెగ్గితే.. వెంటనే తదనుగుణంగా గిడ్డి ఈశ్వరితో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించేయడం ఇక్కడ సాధ్యం కావొచ్చు. అదే జరిగిందంటే.. అసలే 11 స్థాానలకు పరిమితమైనందుకు కుమిలిపోతున్న జగన్ కు మరింత క్షోభ తప్పదని పలువురు అంచనా వేస్తున్నారు.