పనిచేసేవాడికే అందులో ఉన్న కష్టం తెలుస్తుంది. కష్టం చేసేవాడు, తెలిసినవాడు మాత్రమే ఆ కష్టానికి విలువను నిర్ణయించగలడు. గుడ్డుపెట్టే కోడికి మాత్రమే కదా నొప్పి తెలుస్తుంది అని పల్లెటూళ్లలో ఒక మొరటు సామెత ఉంటుంది. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరును గమనిస్తే.. ఆ సామెత గుర్తుకు వస్తోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిదేళ్లపాటు పాలన సాగిస్తే.. రాష్ట్రంలో చెప్పుకోదగిన ఒక్క రోడ్డు నిర్మాణం కూడా చేపట్టలేదు. సరికదా, రాష్ట్రంలోని గ్రామీణ రోడ్లన్నీ కూడా పెద్ద పెద్ద గోతుల మయంగా మారిపోయినా, ఆ రోడ్ల మీద గోతుల వల్ల.. వాహనాలు ప్రమాదాలకు గురై సర్వనాశనం అయిపోతున్నా, ప్రజల ప్రాణాలు పోతున్నా.. ఆయన కనీసం రోడ్ల మరమ్మతులను కూడా చేపట్టలేదు. అలాంటి పాలకుడికి, ఆయన అనుచరగణాలకు రోడ్లు వేయడానికి అవసరమయ్యే ఖర్చు గురించి మాత్రం ఏం తెలుస్తుంది? అలాంటి అజ్ఞానంతోనే వారు ఇప్పుడు అమరావతి నిర్మాణాల గురించి దుష్ప్రచారాలు సాగిస్తున్నారు.
అమరావతిలో ఏప్రిల్ నెలలో నిర్మాణ పనులు పునఃప్రారంభం కాబోతున్నాయి. అనేక ప్రభుత్వ భవనాలతో పాటు, దాదాపుగా నగరానికి అవసరమైన అన్ని రోడ్ల నిర్మాణం ప్రారంభం కాబోతోంది. వీటన్నింటికీ మూడేళ్ల గడువు నిర్ణయించి పనులు చేపడుతున్నారు. భారీ భవనాలు, ఆకాశహర్మ్యాల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. రోడ్ల వంటి నిర్మాణాలు మూడేళ్లలో ఖచ్చితంగా పూర్తయిపోయే అవకాశం ఉంది. అయితే ఈ పనుల పురోగతిని చూసి వైసీపీ ఓర్వలేకపోతోంది.
అమరావతి లో ఒక కిలోమీటరు రోడ్డు నిర్మాణానికి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారా? అంటూ విపరీత వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అర్థసత్యాలతో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అమరావతిలో ప్రభుత్వం ఆరులేన్లతో, ఎనిమిదిలేన్లతో భారీగా రోడ్లను ఏర్పాటుచేస్తూ.. భవిష్యత్ అవసరాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకుని పనులు చేస్తున్నారు. అసలు దార్శనికత లేని వ్యక్తులకు అలాంటి పనులు అర్థమయ్యే అవకాశం కూడా లేదు. విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించిన తర్వాత.. తన నివాసం కోసం మూడు భవంతులు నిర్మించుకోవడానికి.. ఏకంగా అయిదువందల కోట్లు తగలేసిన ముఖ్యమంత్రికి ఒక నగరాన్ని అద్భుతంగా నిర్మించడం గురించి ఆలోచన ఉంటుందని అనుకోవడం భ్రమ.
ఆధునిక తరంలో భారీ రోడ్లను కొన్ని వందల సంవత్సరాలు మన్నగలిగేలా నిర్మిస్తున్నారు. 28 కిలోమీటర్ల పొడవు గల ద్వారక ఎక్స్‌ప్రనెస్ హైవే ను ఏకంగా 7500 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు. అంటే ఒక కిలోమీటరుకు ఏకంగా 267 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు లెక్క. అయినా సరే.. ఆ రోడ్ల గురించి ఎవ్వరూ ప్రశ్నించలేదు. అంతమంచి రోడ్లు అందిస్తున్న సౌకర్యం కూడా అలాంటిదే. కానీ.. అమరావతిలో నిర్మిస్తున్న రోడ్ల గురించి వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు సైంధవుల్లా తమ తప్పుడుప్రచారంతో అడ్డుపడుతున్నాయి. అమరావతి ప్రాంతాన్ని మరుభూమిగా మార్చిన వారికి.. అక్కడ ఒక అద్భుత నగరం ఆవిష్కృతమయ్యే ప్రయత్నం దండగ ఖర్చుగానే కనిపిస్తుందని ప్రజలు అంటున్నారు.
పనిచేసే వారికే పెట్టే ఖర్చు తెలుస్తుంది!
Thursday, March 20, 2025
