తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడికి సంబంధించి పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల మీద ఇప్పుడు కేసులున్నాయి. వారంతా నిందితులుగా విచారణ ఎదుర్కొంటున్నారు. అరెస్టు కూడా అయ్యారు. అయితే పార్టీ ఈ నాయకులకు రక్షణ కల్పించే విషయంలో ఎలాంటి విధానం అవలంబిస్తున్నది. తమ సొంత పార్టీ నాయకుల మధ్య కూడా వారు వివక్ష చూపిస్తున్నారా? కొందరు నాయకుల విషయంలో ఒక తీరుగా, మరికొందరు విషయంలో మరొక తీరుగా చూస్తున్నారా? కొందరు నాయకులను ‘మీ చావు మీరు చావండి’ అంటూ గాలికొదిలేశారా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.
పార్టీ ఆఫీసు మీద దాడికేసులో 120వ నిందితుడు అయిన సజ్జల రామక్రిష్ణారెడ్డి గురువారం మంగళగిరి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. తమాషా ఏంటంటే.. అసలు తనను నిందితుల జాబితాలో చేర్చడమే తప్పు అన్నట్లుగా ఆయన చాలా రంకెలు వేశారు. కేసులో అరెస్టు అయిన వాళ్లు తమ వాంగ్మూలంలో చెప్పిన దాన్ని బట్టి.. తన పేరును కేసులో జోడించారని ఎగిరెగిరి పడ్డారు. ఏ కేసు విచారణ జరిగినాసరే.. నిందితులలో ఒకరొకరినీ విచారించే క్రమంలో కొత్త పేర్లు కూడా నిందితులుగా జత అవుతుంటాయనే సంగతి.. జగన్ పాలన కాలంలో అయిదేళ్లపాటూ పోలీసు శాఖను తన కనుసైగలతో శాసించిన ఈ నాయకుడికి తెలియకపోవడం తమాషా.
తీరా ఆయన విచారణకు వచ్చే సమయానికి, తగుదునమ్మా అంటూ ఆయనతో పాటు విచారణకు వెళ్లడానికి ఆపార్టీ మరొక ప్రధాన కార్యదర్శి, న్యాయవాది, జగన్ హయాంలో ఏఏజీగా చేసిన పొన్నవోలు సుధాకరరెడ్డి తయారయ్యారు. కోర్టు ఉత్తర్వు ఉంటే తప్ప నిందితుడితో పాటు విచారణకు హాజరు కానివ్వం అని పోలీసులు అడ్డుకుంటే వారి మీద ఆగ్రహించారు.
అదంతా పక్కన పెడితే.. చాలా మంది వైసీపీ నాయకులు ఇప్పటికే పోలీసు విచారణకు హాజరయ్యారు. ఒక్క సజ్జలకు మాత్రమే సహాయంగా వెళ్లడానికి పొన్నవోలు సుధాకర రెడ్డి ఎందుకు వచ్చారు. పోలీసు విచారణ సమయంలో న్యాయపరమైన రక్షణ అనేది సజ్జలకు మాత్రమే అవసరం అని వైసీపీ భావించిందా? మిగిలిన నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్ ఎలా పోయినా పర్లేదని అనుకున్నారా? అనేది ఇప్పుడు పార్టీ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది.
కేసులు నమోదు కాగానే.. వీరంతా ముందస్తు బెయిళ్ల కోసం కోర్టుల్ని ఆశ్రయించారు. అరెస్టు కాకుండా రక్షణ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కానీ.. దళితుడైన నందిగం సురేశ్ కు మాత్రం అలాంటి వెసులుబాటు చిక్కలేదు. అంటే వైఎస్సార్ కాంగ్రెస్ లో కొందరు నాయకులు సేఫ్ గా ఉంటే చాలునని, నందిగం సురేశ్ లాంటి దళితులు జైలుపాలైనా పర్లేదని నాయకత్వం భావిస్తున్నదనే సంకేతాలు కార్యకర్తల్లోకి వెళుతున్నాయి. సజ్జలకు తప్ప మరెవ్వరికీ పొన్నవోలు లాంటి న్యాయనిపుణుడి ద్వారా దక్కగల రక్షణ అవసరం లేదని పార్టీ భావిస్తున్నదంటే.. వారితో న్యాయవాదుల్ని పంపే ఏర్పాటు చేయలేదంటే.. దాని అర్థం వారిని గాలికి వదిలేస్తున్నట్టే అని అంతా అనుకుంటున్నారు.
లీగల్ సెక్యూరిటీ సజ్జలకు మాత్రమేనా? వాళ్లకు వద్దా?
Sunday, November 17, 2024