నెల్లూరు జిల్లాలో నోటి దురుసు ప్రదర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పరిస్థితి ప్రస్తుతం క్లిష్టంగా మారుతోంది. కొవ్వూరు నియోజకవర్గంలో తనను ఓడించి ఎమ్మెల్యే అయిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై అక్కసుపట్టలేక నల్లపురెడ్డి చేసిన నీచమైన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనను కటకటాల వెనక్కు నెట్టేలా ఉన్నాయి. కేవలం ఆయన అవినీతిపరుడని అన్నందుకు, అవినీతిలో ఆయన పీహెచ్డీ చేశాడని వ్యాఖ్యానించినందుకు.. ప్రశాంతి రెడ్డి మీద ఆమెకు అన్న వరుస అయ్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఎంతటి నీచమైన నిందలు వేశారో అందరూ చూశారు. ఆమె దాంపత్య జీవితాన్ని కూడా గేలి చేస్తూ ప్రభాకర్ రెడ్డిని బెదిరించి పెళ్లి చేసుకున్నదని దుర్మార్గంగా వ్యాఖ్యానించారు.
తదనంతర పరిణామాలలో ఆయన ఇంటి మీద ప్రశాంత్ రెడ్డి అభిమానులు దాడి చేయడం కూడా జరిగింది. మొత్తానికి అప్పటికప్పుడు వారి ఆగ్రహానికి గురికాకుండా చెన్నై పారిపోయిన ప్రసన్న కుమార్ రెడ్డి తిరిగి వచ్చి తాను నెల్లూరులోనే ఉన్నానని ఎక్కడికో పారిపోలేదని.. ధైర్యం ఉంటే తనను అరెస్టు చేసుకోవచ్చని మేకపోతు గాంభీర్యంతో సవాళ్లు విసిరారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆయన మీద ఎస్పీ వద్ద కేసులు పెట్టారు కూడా! అయితే ఒకవైపు దమ్ముంటే అరెస్టు చేసుకోవచ్చని సవాలు విసురుతూనే.. మరొకవైపు తనకు ముందస్తు బెయిలు కావాలి మరో అంటూ నల్లపురెడ్డి ప్రసన్న హైకోర్టును ఆశ్రయించడం చాలా తమాషాగా కనిపిస్తోంది.
అయితే ప్రసన్నకుమార్ రెడ్డి కోరుకుంటున్నట్లుగా ఆయనకు ముందస్తు బెయిలు దక్కకపోవచ్చునని న్యాయనిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవి. ప్రసన్న కుమార్ రెడ్డి నోటి దురుసుతనాన్ని హైకోర్టు న్యాయమూర్తి తీవ్రంగా మందలించారు. ఒక మహిళా ఎమ్మెల్యే పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ తప్పు పట్టారు. అలాంటి మాటల వెనుక ఉన్న కుసంస్కారాన్ని ఎండగట్టారు. మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ ప్రసన్న కుమార్ రెడ్డిని న్యాయస్థానం హెచ్చరించింది.
ఈ పరిణామాలను గమనించినప్పుడు ఆయనకు ముందస్తు బెయిలు దొరకడం అసాధ్యం అనే అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది. పైగా ఈ పిటిషన్ పై విచారణ పూర్తి కాలేదు. ఇరుపక్షాల వాదనలను వినడానికి బుధవారానికి వాయిదా వేశారు. కానీ న్యాయమూర్తుల వ్యాఖ్యలను గమనిస్తే నల్లపురెడ్డికి బెయిలు దక్కడం అసాధ్యం అనే అందరూ అనుకుంటున్నారు.
ఈ పిటిషన్ తిరస్కరణకు గురైతే గనుక నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డిని తక్షణం అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదురుగా తీసుకువెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన మీద లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
ఒకవైపు అరెస్టుకు సవాళ్లు.. మరోవైపు బెయిల్ కోసం పిటిషన్లు!
Friday, December 5, 2025
