జగన్మోహన్ రెడ్డికి ఒక విషయంలో మాత్రం చక్కటి క్లారిటీ ఉంది. తనమీద గానీ, తాను ఎంతగానో వెనకేసుకు వస్తున్న ప్రియమైన తమ్ముడు అవినాష్ రెడ్డి మీదగాని ఉన్న కేసుల విషయంలో కాస్త సేఫ్ జోన్ లో ఉండాలంటే.. కేంద్రంలో బలమైన పార్టీ అండ ఉండాలి. తమ మీద ఉన్న కేసులన్నీ సీబీఐ, ఈడీ ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా నడుస్తున్నవే కావడంతో.. రాష్ట్రంలో తాను మాజీ ముఖ్యమంత్రిని అని రొమ్ము విరుచుకు తిరిగినంత మాత్రాన సరిపోదు. కేంద్రంలోని బలమైన పార్టీ అండ ఉంటే తప్ప తనకు కేసుల నుంచి అంతో ఇంతో రక్షణ ఉండదు. ఆ క్లారిటీ ఉండడం వల్ల ఆయన చిట్టచివరకు అనేక మెట్లు దిగివచ్చినట్లుగా తాజాగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చెల్లెలు వైఎస్ షర్మిలకు – తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారా దక్కిన ఆస్తుల్లో వాటా ఇవ్వడానికి ససేమిరా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు అందుకు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ డీల్ కు ప్రత్యుపకారంగా.. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ దోస్తీ కట్టడానికి షర్మిల అభ్యంతర పెట్టకుండా ఉండాలి.
2019 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం వైఎస్ షర్మిల కూడా ప్రాణం పెట్టి పనిచేశారు. అసలు అన్నయ్య జైల్లో ఉన్నప్పుడు పార్టీ కట్టుతప్పిపోకుండా, తన పాదయాత్రతో కాపాడిన చరిత్ర ఆమెది. ఎన్నికల ప్రచారంలో కూడా చాలా చురుగ్గా ఉండి జగన్ ను సీఎం చేశారు. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఆస్తుల పంపకం దగ్గరే అసలు వివాదం పుట్టినట్టుగా పుకార్లు వినిపించాయి. ఎంత తీవ్రంగా అంటే.. కనీసం రాఖీ నాడు కూడా పలకరించుకోనంతగా! జగన్ ను నానా మాటలు తూలనాడిన షర్మిల.. తెలంగాణలో రాజకీయ పార్టీ అనే విఫలప్రయోగం చేసిన తర్వాత.. ఏపీసీసీ సారధిగా అన్నయ్యకు పక్కలో బల్లెంలాగా తయారయ్యారు. ఊరూరా తిరుగుతూ బాబాయి వివేకానందరెడ్డిని హత్యచేసిన వారిని జగన్ కాపాడుతున్నాడని, తన తండ్రి వైఎస్ ఆర్ పేరు ఎఫ్ఐఆర్ లోకి ఎక్కడానికి జగన్ కారకుడని రకరకాల నిందలతో విరుచుకుపడ్డారు. ఆమె మాటల ప్రభావం ఎంతమేర పనిచేసిందో తెలియదు గానీ.. మొత్తానికి జగన్ పతనం ఎన్నికల్లో ఖరారైంది.
తాను ఇన్నాళ్లూ ఏ బిజెపి ప్రాపకం కోసం ఆరాటపడుతూ.. వారిద్వారా సీబీఐ, ఈడీ కేసులు తన మెడకు బిగుసుకోకుండా జాగ్రత్తపడుతూ వచ్చాడో ఇప్పుడు ఆ అవకాశం జగన్ కు లేకుండాపోయింది. బిజెపి- తెలుగుదేశం, జనసనలతో కలిసి అధికార కూటమిగా మారింది. జగన్ కు వేరే గత్యంతరం లేదు. తన కేసులనుంచి రక్షణ కావాలంటే జాతీయ పార్టీ మద్దతు అవపసరం! అందుకే ఇప్పుడు చెల్లెలు షర్మిలకు తండ్రి ఆస్తుల్లో వాటాలు పంచడానికి జగన్ ఓకే అన్నట్టుగా.. ఈ మేరకు బెంగుళూరులో పలు విడతల చర్చల అనంతరం రాజీ కుదిరినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. చెల్లెలికి ఆస్తులు విషయంలో చీప్ గా ఇన్నాళ్లు భీష్మించుకుని కూర్చుని.. ఇప్పుడు బేరానికి రావడం జగన్ పతనానికి నిదర్శనం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
చెల్లెలికి ఆస్తి వాటాకు ఓకే.. కాంగ్రెస్ దోస్తీకోసం జగన్ త్యాగం!
Sunday, December 22, 2024