తెలుగుజాతి ఎప్పటికీ గర్వించదగిన మహానాయకుడు నందమూరి తారక రామారావు జీవితాన్ని బడి పిల్లలకు పాఠ్యాంశంగా చేరుస్తారా? విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణం మీద కూడా చదువులు సమానమైన ప్రభావం చూపాలనే కాంక్ష ప్రభుత్వాలకు ఉన్నట్లయితే బహుశా ఈ ఆలోచన కార్యరూపంలోకి వస్తుంది.ఆయన జీవితం నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్పిన సంగతులు తప్పకుండా ఉన్నాయని, విద్యార్థి వయసులోనే ఎన్టీఆర్ జీవిత విశేషాలను తెలియజేయడం అనేది పిల్లల వ్యక్తిత్వ పునాదుల్లో ఉపయోగపడుతుందని నమ్ముతున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆలోచనకు గౌరవం ఇచ్చినట్టు అవుతుంది.
నందమూరి తారక రామారావు సీనీ జీవిత వజ్రోత్సవాలు విజయవాడ పోరంకిలో శనివారం చాలా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు తదితర ప్రముఖులు హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పనిచేయడం వంటివి ఎన్టీఆర్ నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అంశాలని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ జీవితచరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలన్నారు. ఆయన నటించిన ప్రతి సినిమా సందేశాత్మకం అని, లోతుగా చూసిన వాళ్లకు ఇది అర్థమవుతుందని అన్నారు. స్వరవిన్యాసం, నట విశ్వరూపం అనేవి ఈ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడికే సాధ్యం అవుతుందని కూడా చెప్పారు. తెలుగు భాషా మాధుర్యాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తిగా కొనియాడారు. విలక్షణ పథంలో సాగిన ఎన్టీఆర్ జీవితం పాఠ్యాంశం అయితే పిల్లల ఆలోచనల్లో ఖచ్చితంగా మేలైన మార్పు వస్తుందనే అనవచ్చు. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల సందర్భంగా ఇదొక మంచి ప్రకటన కాగా.. చంద్రబాబునాయుడు మరో కీలక ప్రకటన చేశారు.
ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు వచ్చేవరకు పోరాడి సాధిస్తాం అని ఆయన అన్నారు. తెలుగు నేల మీద తిరుగులేని నటుడు, నాయకుడు అయినటువంటి నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్ శతజయంతి కూడా పూర్తయి, ఆయన నటజీవితం కూడా వజ్రోత్సవం పూర్తి చేసుకుంటున్న సమయంలో.. ఆయనకు భారతరత్న గురించి ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పార్టీకి నేతగా ఉన్న చంద్రబాబు ఈ స్థాయి దృఢమైన హామీ ఇవ్వడం ఎన్టీఆర్ అభిమానులకు పండగగా ఉంది.
బడిలో పిల్లలకు పాఠంగా ఎన్టీఆర్ఱ జీవితం!
Saturday, December 21, 2024