ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తొలివిజయం తెలుగుదేశం ఖాతాలో పడింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగుజాతి మొత్తం అన్నగా ఆరాధించిన నందమూరి తారక రామారావుకు సహచరుడు, ఆయన మంత్రివర్గంలో కూడా పనిచేసిన సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించారు. తొలి గెలుపు అంటే… అది మామూలు గెలుపు కాదు! ఏకంగా.. 57వేల ఓట్ల అత్యద్భుతమైన మెజారిటీతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఆ రకంగా రాష్ట్రంలో సాధించిన తొలి విజయం దిక్కులు పిక్కటిల్లేలా నమోదు అయింది.
రాష్ట్రవ్యాప్తంగా అద్భుతమైన ఫలితాలు నమోదు అవుతుండడంతో.. తెలుగుదేశం శ్రేణులన్నీ మహోత్సాహంతో ఉన్నాయి. అందరూ పండగ చేసుకుంటున్నారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశంలో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరు. నిజం చెప్పాలంటే.. చంద్రబాబునాయుడు కంటె సీనియర్ నాయకుడు కూడా! నియోజకవర్గ ప్రజలతో నిత్యం మమేకం అయి ఉండి, నిత్యం వారితో టచ్ లో ఉంటూ పనిచేసేవారు. విస్తృతమైన ప్రజాదరణను ఆయన సొంతం చేసుకున్నారు. ఆయన ఇప్పటికే ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. ఈ ఎన్నికల్లో తొలివిజయం నమోదు చేయడం ద్వారా ఆయన ఏడోసారి గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు.
ఈ ఎన్నికల సమయంలో నిజానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చాలా సంక్లిష్టత ఎదురైంది. జనసేన పార్టీకి చెందిన కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ సీటు కోసం పట్టుబట్టారు. పొత్తులు కుదిరిన తర్వాత కూడా కందుల దుర్గేష్ ఆ సీటు కావాల్సిందేనని మొండికేశారు. పవన్ కల్యాణ్ కూడా ఆ సీటు అడగడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. కానీ.. అంత సీనియర్ నాయకుడు సిటింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి టికెట్ నిరాకరించడానికి చంద్రబాబునాయుడు ఏమాత్రం అంగీకరించలేదు.
దాంతో కందుల దుర్గేష్ కోసం నిడదవోలు స్థానాన్ని జనసేనకు కేటాయించారు. అక్కడ ఆయనకు టికెట్ ఇచ్చారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన సొంత నియోజకవర్గంలో విస్తృతంగా సొంత మనుషుల్ని ఏర్పాటు చేసుకుని.. ఇంటింటికీ వారిని తిప్పడం ద్వారా తాను చేసిన పనులను, పార్టీ మేనిఫెస్టో అంశాలను అన్నింటినీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగారు. మొత్తానికి ఆయన కష్టం ఫలించింది. 57 వేల ఓట్ల మెజారిటీతో గెలవడం మాత్రమే కాదు.. పార్టీ తరఫున తొలివిజయంగా నమోదు చేసి చరిత్ర సృష్టించారు.
తొలివిజయం ఎన్టీఆర్ సహచరుడిదే!
Wednesday, January 22, 2025