కొన్ని రోజుల కిందట దుబాయికి పరారవడానికి ప్రయత్నించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దేవినేని అవినాష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. 2021లో చంద్రబాబునాయుడు ఇంటిమీద చేసిన దాడికి సంబంధించి.. ఆయన మీద కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. తననను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు తెచ్చుకున్న అవినాష్.. ఇటీవల దేశం విడిచి దుబాయి వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే మంగళగిరి పోలీసులు ఆయన కోసం లుక్ అవుట్ నోటీసులు జారీచేసి ఉండడంతో.. హైదరాబాదు విమానాశ్రయంలో పోలీసులు ఆయనను ఆపివేశారు. మంగళగిరి పోలీసులకు సమాచారం ఇచ్చాక, వారి కోరిక మేరకు దుబాయి వెళ్లనివ్వకుండా వెనక్కు పంపారు. ఇప్పుడు ఆయనకు విచారణకు రావాల్సిందిగా నోటీసులు అందాయి. ఆయన ఇంట్లో లేకపోవడంతో ఇంటికి వాటిని అంటించారు.
ప్రస్తుతం జోగిరమేష్ వంతు నడుస్తోంది. ఇదే దాడికి సంబంధించి జోగిరమేష్ ఒకసారి మాత్రమే విచారణకు హాజరై తర్వాత డుమ్మా కొట్టారు. తాజాగా బుధవారం మళ్లీ రావల్సిందిగా ఆయనకు కూడా నోటీసులు అందాయి. విచారణకు వస్తే అరెస్టు చేస్తారనే భయం జోగిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈలోగా తాము చెప్పినప్పుడు విచారణకు రావాలంటూ దేవినేని అవినాష్ కు కూడా నోటీసులు రావడం గమనార్హం.
వీరికి మాత్రమే కాదు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. 2021 అక్టోబరు 19 నాటి సీసీ టీవీల ఫుటేజీ సమర్పించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దాడి జరిగిన రోజున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఎవరెవరు బయల్దేరారు అనేది లెక్క తేల్చడానికి ఆఫీసుకు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వైకాపా సెంట్రల్ ఆఫీసుకు పోలీసులు నోటీసులు అంటించి వెళ్లడం విశేషం.
పరారీకి ప్రయత్నించిన నాయకుడికీ నోటీసులు!
Monday, December 23, 2024